శనివారం 16 జనవరి 2021
Sports - Dec 28, 2020 , 00:41:26

సాహో రహానే

సాహో రహానే

  • అజేయ శతకంతో అదరగొట్టిన అజింక్యా
  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌  277/5
  • 82 పరుగుల ఆధిక్యం

పిచ్‌ పరీక్ష పెడుతున్న సమయాన.. సహచరుల నుంచి సహకారం అందని వేళ.. కంగారూ బౌలర్లు కదం తొక్కుతున్న తరుణంలో.. నాయకుడంటే ముందుండి నడిపించాలనే చందంగా.. అజింక్యా రహానే రెచ్చిపోయాడు. మేఘావృతమైన మెల్‌బోర్న్‌ మైదానంలో ఆసీస్‌ బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ.. ఎమ్‌సీజీలో బ్యాటింగ్‌ చేయడం ఇంత సులువా అన్న రీతిలో అజేయ శతకంతో విజృంభించాడు. రహానే క్లాస్‌ ఇన్నింగ్స్‌ ముందు ఆసీస్‌ పేస్‌ త్రయం పప్పులు ఉడకలేదు. దుర్బేధ్యమైన డిఫెన్స్‌తో కంగారూలను విసిగిస్తూనే.. వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలు బాదిన రహానే టీమ్‌ఇండియాను మెరుగైన స్థితికి చేర్చాడు. మూడో రోజు కూడా ఇదే తీవ్రత కొనసాగించి మరో వంద పరుగుల ఆధిక్యం సాధిస్తే.. రెండో టెస్టుపై టీమ్‌ఇండియాకు పట్టు చిక్కినట్లే!

మెల్‌బోర్న్‌: బౌలర్లను తెలివిగా వాడుకోవడంతో పాటు చక్కటి ఫీల్డింగ్‌ ప్లేస్‌మెంట్స్‌తో తొలి రోజు ఆకట్టుకున్న స్టాండిన్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే (200 బంతుల్లో 104 బ్యాటింగ్‌; 12 ఫోర్లు) రెండో రోజు బ్యాట్‌తో అదరగొట్టాడు. విరాట్‌ కోహ్లీ గైర్హాజరీలో బ్యాటింగ్‌ బలహీనపడుతుందేమోనన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ సారథిగా జట్టును ముందుండి నడిపించాడు. ఫలితంగా ఆదివారం ఆట ముగిసే సమయానికి టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. వర్షం ఆటంకం కలిగించిన రెండో రోజు ఆటలో 80.3 ఓవర్లు బ్యాటింగ్‌ చేసిన రహానే సేన నాలుగు వికెట్లే చేజార్చుకుంది. అరంగేట్ర ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ (45; 8 ఫోర్లు), ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (40 బ్యాటింగ్‌) రాణించారు. చేతిలో ఐదు వికెట్లు ఉన్న టీమ్‌ఇండియా ప్రస్తుతం 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. కంగారూ బౌలర్లలో స్టార్క్‌, కమిన్స్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సోమవారం ఆట ఆరంభంలో ఆసీస్‌ పేస్‌ త్రయాన్ని ఢీకొంటూ మనవాళ్లు ఆధిక్యాన్ని ఎంతవరకు తీసుకెళ్తారో చూడాలి. 


కమిన్స్‌ డబుల్‌ స్ట్రోక్‌

ఓవర్‌నైట్‌ స్కోరు 36/1తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమ్‌ఇండియా.. ఆరంభంలో ఆచితూచి ఆడింది. తొలి బంతికే పుజారా క్యాచౌటైనట్లు భావించిన ఆసీస్‌.. రివ్యూ తీసుకొని భంగపడింది. పుజ్జీ తనకు అలవాటైన శైలిలో డిఫెన్స్‌ ఆడుతుంటే.. మరో ఎండ్‌లో తొలి టెస్టు ఆడుతున్న గిల్‌ అడపాదడపా బౌండ్రీలు బాదాడు. రెండో వికెట్‌కు 61 పరుగులు జోడించాక కమిన్స్‌ బౌలింగ్‌లో గిల్‌ ఔటయ్యాడు. అయితే టీమ్‌ఇండియాకు అసలు దెబ్బ మాత్రం పుజారా రూపంలో తగిలింది. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన పుజారా.. కమిన్స్‌ వేసిన అద్భుత బంతికి కీపర్‌కు క్యాచ్‌ ఇవ్వగా.. పైన్‌ దాన్ని చక్కగా ఒడిసిపట్టాడు. దీంతో మూడు పరుగుల వ్యవధిలో భారత్‌ రెండు వికెట్లు కోల్పోయింది. ఇక అక్కడి నుంచి ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత రహానే భూజాలపై పడింది. 


ఆరంభాలు దక్కినా..

తెలుగు ఆటగాడు హనుమ విహారి (21)తో కలిసి రహానే నెమ్మదిగా స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లాడు. మంచి ఆరంభం లభించిన అనంతరం విహారి.. లియాన్‌కు చిక్కగా.. వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ (29) తన శైలికి భిన్నంగా బ్యాటింగ్‌ చేశాడు. వచ్చీరావడంతోనే అడ్డదిడ్డమైన షాట్లు ఆడకుండా క్రీజులో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకొని.. ఆ తర్వాత స్ట్రోక్‌ ప్లేతో ఆకట్టుకున్నాడు. ఒక ఎండ్‌లో రహానే క్రీజులో పాతుకుపోగా.. ఐదో వికెట్‌కు 57 పరుగులు జోడించాక పంత్‌ ఔటయ్యాడు. ఈ సమయంలో వరుణుడి కారణంగా మ్యాచ్‌కు కాస్త ఆటంకం కలిగినా.. చివరి సెషన్‌లో రహానే ఆకట్టుకున్నాడు.

అజేయ భాగస్వామ్యం

తొలి రెండు సెషన్‌లు రక్షణాత్మక ధోరణిలో ఆడిన రహానే.. టీ అనంతరం తనలోని కళాత్మక దూకుడును బయట పెట్టాడు. బౌలర్‌తో సంబంధం లేకుండా చెత్త బంతి పడితే దానిపై విరుచుకుపడి బౌండ్రీకి తరలించాడు. మరో ఎండ్‌లో జడేజా సింగిల్స్‌ తీస్తూ స్ట్రయిక్‌ రొటేట్‌ చేశాడు. ఆసీస్‌ ఫీల్డింగ్‌ తప్పిదాలు కూడా భారత్‌కు కలిసొచ్చాయి. ఈ క్రమంలోనే 195 బంతుల్లో రహానే టెస్టుల్లో 12వ శతకాన్ని తన పేరిట లిఖించుకున్నాడు. జడ్డూతో కలిసి రహానే ఆరోవికెట్‌కు అజేయంగా 104 పరుగులు జోడించడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించగలిగింది. నిర్ణీత సమయానికి ముందే మరోసారి చినుకులు ప్రారంభం కావడంతో ఆదివారం ఆటను కాస్త ముందుగానే ముగిసింది.

ఈశతకంప్రత్యేకం

నలుగురితో పాటు నడిచేవాడు కాకుండా.. నలుగురిని నడిపించేవాడే నాయకుడు అన్న రీతిలో కొత్త కెప్టెన్‌ అజింక్యా రహానే రెండో టెస్టులో జట్టును ముందుకు తీసుకెళ్తున్నాడు. కోహ్లీ స్వదేశానికి తిరిగి వచ్చేయడంతో బలహీనపడిన భారత బ్యాటింగ్‌ దళం.. కంగారూ పేసర్లను ఎలా ఎదుర్కుంటుందో అని భావిస్తున్న తరుణంలో తన సూపర్‌ ఇన్నింగ్స్‌తో రహానే సిరీస్‌కు జీవం పోశాడు. ఫామ్‌ తాత్కాలికం.. క్లాస్‌ శాశ్వతం అనిపిస్తూ ప్రతికూల పరిస్థితుల్లో జట్టుకు సరైన దిశానిర్దేశం చేస్తున్నాడు. అతడిచ్చిన స్ఫూర్తితో సహచరులు కూడా తలా కొన్ని పరుగులు చేస్తే.. బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌ను సమం చేయడం భారత్‌కు పెద్ద కష్టం కాకపోవచ్చు!

నమస్తే తెలంగాణ క్రీడా విభాగం: సుదీర్ఘ ఫార్మాట్‌లో 66 మ్యాచ్‌లు ఆడిన అజింక్యా రహానే.. చాన్నాళ్లుగా టెస్టుల్లో భారత జట్టుకు వైస్‌కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టెక్నిక్‌లో ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోని జింక్స్‌.. తన అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో టీమ్‌ఇండియాకు ఎన్నో విజయాలు అందించినా.. మర్రి చెట్టు కింద మరో మొక్క మనగలలేదనే చందంగా అతడి ప్రతిభ వెలుగులోకి రాకుండా పోయింది. రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లీ టన్నుల కొద్ది పరుగులు చేస్తుండటంతో.. రహానే పేరు పెద్దగా వినిపించలేదు. అయితే అవకాశం వచ్చిన ప్రతీసారి జింక్స్‌ తనను తాను నిరూపించుకున్నాడు. 

సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌ 

కోహ్లీ గైర్హాజరీలో రెండుసార్లు జట్టుకు సారథ్యం వహించే అవకాశాలు రాగా.. ఆ రెండు టెస్టుల్లోనూ రహానే టీమ్‌ను గెలిపించాడు. సంప్రదాయ క్రికెట్‌లో 42.45 సగటుతో 4245 పరుగులు చేసిన రహానేకు అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ కొత్తకాకపోయినా.. మెల్‌బోర్న్‌ శతకం మాత్రం ప్రత్యేకమనే చెప్పాలి. ఈ మ్యాచ్‌కు ముందు టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసి అవమాన భారంతో.. ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన జట్టును అతడు ముందుండి నడిపించిన తీరు అమోఘం. టీమ్‌ఇండియా అంటే విరాట్‌ కోహ్లీ అనేంతలా ముద్రపడ్డ ప్రస్తుత తరుణంలో.. అతడు అందుబాటులో లేకున్నా తన యుక్తితో జట్టును ముందుకు నడిపిస్తున్న జింక్స్‌పై మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

ఈ ఏడాది ఇదే మొదటిది

ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో టీమ్‌ఇండియా తరఫున నమోదైన ఏకైక సెంచరీ ఇదే కావడం విశేషం. ఈ ఏడాది మొత్తం నాలుగు టెస్టులు ఆడిన భారత్‌.. అందులో మూడింట ఓటమి పాలైంది. ఇందులో ఒక్కసారి కూడా 250 పరుగుల మార్క్‌ దాటలేకపోయింది. ఆదివారం తొలి సెషన్‌ గమనిస్తే.. ఈ మ్యాచ్‌లోనూ అదే గతి తప్పదనుకుంటున్న తరుణంలో రహానే ఆసీస్‌ బౌలర్లకు అడ్డుగా నిలిచాడు. సహచరుల నుంచి పెద్దగా సహకారం అందకున్నా చిన్న చిన్న భాగస్వామ్యాలతోనే కంగారూలను విసిగించాడు. గత పర్యటనలో దంచికొట్టిన పుజారా పెద్దగా ప్రభావం చూపకపోయినా.. నేనున్నానంటూ జట్టును ఆదుకున్నాడు. స్టార్క్‌, కమిన్స్‌, హజిల్‌వుడ్‌ గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగంతో విసురుతున్న బంతులను బౌండ్రీలకు తరలించి ఔరా అనిపించాడు. ఆత్మవిశ్వాసం లోపించిన జట్టును అతడు తిరిగి గాడిలో పెట్టిన విధానాన్ని ఎంత పొగిడినా తక్కువే! 

అయ్యో..ఆసీస్‌

రెండో టెస్టులో ఆసీస్‌ ఫీల్డర్లు లెక్కకు మిక్కిలి క్యాచ్‌లు వదిలేశారు. అడిలైడ్‌ టెస్టులో ఇలాంటి తప్పిదాల వల్లే మూల్యం చెల్లించుకున్న భారత్‌ ఈ సారి మెరుగుపడగా.. ఆసీస్‌కు ఆ జాడ్యం పట్టుకున్నట్లు కనిపించింది. తొలిరోజే గిల్‌ క్యాచ్‌ను లబుషేన్‌ వదిలేయగా.. ఆదివారం గిల్‌కు పైన్‌ మరోసారి లైఫ్‌ ఇచ్చాడు. ఇక పంత్‌ ఇచ్చిన క్యాచ్‌ను గల్లీలో గ్రీన్‌ వదిలేయగా.. రహానే ఇచ్చిన క్లిష్టతరమైన క్యాచ్‌ను స్మిత్‌ జారవిడిచాడు. ఆదివారం ఆటలో చివరి బంతికి జింక్స్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో హెడ్‌ నేలపాలు చేశాడు.

స్కోరు బోర్డు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 195

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ (ఎల్బీ) స్టార్క్‌ 0, గిల్‌ (సి) పైన్‌ (బి) కమిన్స్‌ 45, పుజారా (సి) పైన్‌ (బి) కమిన్స్‌ 17, రహానే (నాటౌట్‌) 104, విహారి (సి) స్మిత్‌ (బి) లియాన్‌ 21, పంత్‌ (సి) పైన్‌ (బి) స్టార్క్‌ 29, జడేజా (నాటౌట్‌) 40, ఎక్స్‌ట్రాలు: 21, మొత్తం: 91.3 ఓవర్లలో 277/5. వికెట్ల పతనం: 1-0, 2-61, 3-64, 4-116, 5-173, బౌలింగ్‌: స్టార్క్‌ 18.3-3-61-2, కమిన్స్‌ 22-7-71-2, హజిల్‌వుడ్‌ 21-6-44-0, లియాన్‌ 18-2-52-1, గ్రీన్‌ 12-1-31-0.