సోమవారం 08 మార్చి 2021
Sports - Jan 20, 2021 , 13:06:25

ర‌హానే ఓట‌మెరుగ‌ని రికార్డు

ర‌హానే ఓట‌మెరుగ‌ని రికార్డు

మ‌న టీమిండియా స్టాండిన్ కెప్టెన్ అజింక్య ర‌హానే పేరులో అజింక్య అంటే అజేయుడు అని అర్థం. పేరుకు త‌గిన‌ట్లే అత‌ని రికార్డు కూడా ఉంది. ఇప్ప‌టి వర‌కూ ఇండియ‌న్ టీమ్‌కు టెస్టుల్లో ర‌హానే కెప్టెన్సీ చేసిన ఏ మ్యాచ్ కూడా ఓడిపోక‌పోవ‌డం విశేషం. ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై సాధించిన మ‌రో చారిత్ర‌క విజ‌యంతో త‌న రికార్డును ర‌హానే మ‌రింత ప‌దిలం చేసుకున్నాడు. ఇప్ప‌టి వ‌రకూ ర‌హానే ఐదు టెస్టుల్లో కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌గా.. అందులో టీమిండియా నాలుగు గెలిచి, ఒక‌టి డ్రా చేసుకుంది. ఆస్ట్రేలియాపై నాలుగు టెస్టుల్లో కెప్టెన్సీ చేయ‌గా.. మూడు విజ‌యాలు, ఒక డ్రాతో తిరుగులేని రికార్డును సొంతం చేసుకున్నాడు. 

కామ్‌గా కానిచ్చేశాడు..

విరాట్ కోహ్లితో పోలిస్తే రహానే కెప్టెన్సీ పూర్తిగా భిన్నం. గ్రౌండ్‌లో కోహ్లి చాలా దూకుడుగా ఉంటాడు. వికెట్ ప‌డినా, మ్యాచ్‌లో గెలిచినా అత‌ని ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు. గాల్లోకి పిడి గుద్దులు కురిపిస్తూ సంబ‌రాలు చేసుకుంటాడు. కానీ ర‌హానే పూర్తి విరుద్ధంగా ఉంటాడు. బ్రిస్బేన్‌లో అంత‌టి విజ‌యం సాధించిన త‌ర్వాత కూడా అత‌నిలో ఎలాంటి భావోద్వేగాలు క‌నిపించ‌లేదు. కామ్‌గా టీమ్ మేట్స్‌తో సెల‌బ్రేట్ చేసుకున్నాడు. నిజానికి ఆస్ట్రేలియాలాంటి టీమ్‌పై, వాళ్ల సొంత‌గ‌డ్డ‌పై ఆడాలంటే కోహ్లిలాంటి దూకుడైన కెప్టెనే క‌రెక్ట్ అని చాలా మంది భావించారు. కానీ ర‌హానే వాళ్ల అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేశాడు. 

స‌హ‌నం, ఎత్తుగ‌డ‌ల‌తోనే..

ఆస్ట్రేలియాలో క్లిష్ట స‌మ‌యంలో కోహ్లి టీమ్‌ను విడిచిపెట్టి వెళ్లాడు. ఇలాంటి స‌మ‌యంలో మ‌రో కెప్టెన్ అయితే చేతులెత్తేసే వాడేనేమో. కానీ ర‌హానే ఆ త‌ర్వాతి టెస్ట్‌లోనే టీమ్‌ను ముందుండి న‌డిపించాడు. సెంచ‌రీతో మ్యాచ్‌ను గెలిపించి.. సిరీస్‌ను స‌మం చేశాడు. దీనికితోడు కెప్టెన్‌గా అత‌ను వేసిన ప్ర‌తి ఎత్తుగ‌డా ఫ‌లించింది. మెల్‌బోర్న్ టెస్ట్‌లో మూడో పేస్‌బౌల‌ర్ కంటే ముందే స్పిన్న‌ర్ అశ్విన్‌ను బౌలింగ్‌కు దించ‌డం మ్యాచ్‌ను మ‌లుపు తిప్పింది. అత‌డు స్మిత్‌ను డ‌కౌట్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 195 ప‌రుగుల‌కే ఆలౌటైంది. 

గాయాలు వెంటాడుతున్నా..

అత‌డు కెప్టెన్సీ చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచీ టీమ్‌ను గాయాలు వేధించాయి. టీమ్‌లోని ప్ర‌ధాన ప్లేయ‌ర్స్ ఒక్కొక్క‌రుగా గాయంతో దూర‌మ‌వుతూ వ‌చ్చారు. కానీ అందుబాటులో ఉన్న వ‌న‌రుల‌నే ర‌హానే అద్భుతంగా వాడుకున్నాడు. చివ‌రి టెస్ట్‌లో ఆడిన న‌లుగురు పేస్‌బౌల‌ర్ల మొత్తం అనుభ‌వం కేవ‌లం నాలుగు టెస్టులే. అలాంటి బౌలింగ్ లైన‌ప్‌తోనే గ‌బ్బా స్టేడియంలో 13 ఏళ్ల త‌ర్వాత ఆస్ట్రేలియాను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆలౌట్ చేసిన ఘ‌న‌త సాధించాడు. 

త‌న ఫేవ‌రెట్ మూవీలోలాగే..

ర‌హానేకు చాలా ఇష్ట‌మైన సినిమా ఆమిర్ ఖాన్ న‌టించిన ల‌గాన్‌. అందులో హీరో క్రికెట్‌పై ఏమాత్రం అవ‌గాహ‌న లేని అనామ‌కుల‌ను ఒక్క‌టిగా చేర్చి ఇంగ్లిష్ టీమ్‌ను మ‌ట్టిక‌రిపిస్తాడు. ఇప్పుడు ర‌హానే కూడా అంత‌కు మించిన విజ‌యాన్నే సాధించాడు. ఒక్కోసారి రీల్ ఇండియా కంటే రియ‌ల్ ఇండియా మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్ అని ఈ అజేయుడు నిరూపించాడు. 


ఇవి కూడా చ‌ద‌వండి

మా టీమ్‌తో జాగ్ర‌త్త‌.. టీమిండియాకు పీట‌ర్స‌న్ వార్నింగ్‌

వావ్ టీమిండియా.. ఆకాశానికెత్తిన‌ ఆస్ట్రేలియన్ మీడియా

డ్రెస్సింగ్ రూమ్‌లో ర‌విశాస్త్రి స్పీచ్ చూశారా.. వీడియో

హిందూ మ‌తాన్ని కించ ప‌రిచారు.. శిక్ష త‌ప్ప‌దు!

బిలియ‌నీర్ జాక్‌మా క‌నిపించారు..

VIDEOS

logo