శుక్రవారం 05 మార్చి 2021
Sports - Jan 25, 2021 , 00:54:31

ఇంగ్లండ్‌పై అద‌ర‌గొడితే ఫైన‌ల్ బెర్తు ఖాయం

ఇంగ్లండ్‌పై అద‌ర‌గొడితే ఫైన‌ల్ బెర్తు ఖాయం

  • ఆస్ట్రేలియాపై సిరీస్‌ విజయంతో భారత్‌ ఆశలు రెట్టింపు 
  • ఇంగ్లండ్‌పై అదరగొడితే ఫైనల్‌ బెర్తు 
  • టెస్టు చాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియా దూకుడు 

ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) తుది అంకానికి చేరువైంది. ఆదరణ తగ్గుతున్న సంప్రదాయ ఫార్మాట్‌కు కొత్త జోష్‌ తెచ్చేందుకు ప్రవేశపెట్టిన ఈ ప్రయోగానికి కరోనా వైరస్‌ తీవ్ర ఆటంకం కలిగించినా.. ముందుకెళ్లాలనే ఐసీసీ నిర్ణయించుకుంది. క్రికెట్‌ మక్కా లార్డ్స్‌ వేదికగా జూన్‌లో టైటిల్‌ ఫైట్‌ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. 

ఆస్ట్రేలియా గడ్డపై చరిత్రాత్మక టెస్టు సిరీస్‌ విజయంతో డబ్ల్యూటీసీ పట్టికలో భారత్‌ అగ్రస్థానానికి ఎగబాకింది. ఇక అచ్చొచ్చిన స్వదేశీ పిచ్‌లపై ఇంగ్లండ్‌ను చిత్తుచేస్తే ఫైనల్‌ బెర్తు ఖాయం. తుదిపోరుకు చేరేందుకు న్యూజిలాండ్‌ పోటీపడుతుంటే.. ఆసీస్‌కు కూడా ఆ అవకాశం ఉంది. ఇప్పుడున్న స్థితిలో ఇంగ్లండ్‌కు కష్టతరమే కాగా.. మిగిలిన జట్లు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ప్రేక్షకపాత్రకే పరిమితం కానున్నాయి. 

నమస్తే తెలంగాణ క్రీడావిభాగం

పరిమిత ఓవర్ల క్రికెట్‌ హవాలో సంప్రదాయ ఫార్మాట్‌కు పునర్వైభవం తెచ్చేందుకు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)నకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) శ్రీకారం చుట్టింది. 2019 జూలైలో యాషెస్‌ సిరీస్‌తో దీనికి అంకురార్పన జరిగింది. 9 టెస్టు జట్లు తలా ఆరు టెస్టు సిరీస్‌లు (స్వదేశంలో మూడు, విదేశాల్లో మూడు) ఆడేలా డబ్ల్యూటీసీకి ఐసీసీ రూపకల్పన చేసింది. వీటిల్లో అత్యధిక పాయింట్లు సాధించిన టాప్‌-2 జట్లకు 2021 జూన్‌లో లార్డ్స్‌ వేదికగా ఫైనల్‌ నిర్వహించాలని నిర్ణయించింది. అయితే 2020లో కరోనా వైరస్‌ విజృంభణతో ప్రణాళిక తలకిందులైంది. చాలా సిరీస్‌లు రద్దయిపోయాయి. దీంతో చాంపియన్‌షిప్‌ ఇక కష్టమే అనుకున్న తరుణంలో పాయింట్ల విధానంలో ఐసీసీ మార్పులు తెచ్చింది. అనుకున్న విధంగానే ఫైనల్‌ నిర్వహిస్తామని ప్రకటించింది. ఇక ఫైనల్‌కు గడువు దగ్గర పడుతుండగా.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాప్‌-2లో ఉన్న భారత్‌, న్యూజిలాండ్‌ ఫైనల్‌ చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌కు కూడా చాన్స్‌లు లేకపోలేదు.

పాయింట్ల విధానం మారిందిలా.. 

కరోనా మహమ్మారి కారణంగా చాలా టెస్టు సిరీస్‌లు రద్దవడంతో చాంపియన్‌షిప్‌ పాయింట్ల విధానంలో ఐసీసీ మార్పులు చేసింది. సిరీస్‌లోని మొత్తం పాయింట్లలో.. ఓ జట్టు గెలిచిన పాయింట్ల శాతం ప్రకారం ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్‌లను నిర్ణయిస్తున్నది. ఏ టెస్టు సిరీస్‌కైనా 120 పాయింట్లు ఉంటాయి. ఉదాహరణకు భారత్‌, ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌నే తీసుకుంటే గెలిస్తే 30, టై అయితే 15, డ్రాకు 10 పాయింట్లు జట్టు ఖాతాలో చేరుతాయి. ఇలా రెండింట్లో ఏ టీమ్‌ సిరీస్‌లో ఎక్కువ పాయింట్లను ఖాతాలో వేసుకుంటుందో ఆ జట్టుకు అధిక శాతం వస్తుంది. ఒకవేళ పాయింట్ల శాతం కూడా సమానమైతే చేసిన పరుగులు, పడగొట్టిన వికెట్ల ఆధారంగా శాతాలను ఐసీసీ లెక్కేస్తుంది. 

జోరుమీదున్న భారత్‌ 

(71.7%, 430 పాయింట్లు)

మిగిలి ఉన్న మ్యాచ్‌లు: 4, స్వదేశంలో ఇంగ్లండ్‌తోటీమ్‌ఇండియా వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై నాలుగు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో బెర్తు పక్కా కావాలంటే రెండు మ్యాచ్‌ల తేడాతో ఇంగ్లిష్‌ జట్టును చిత్తుచేయాలి. ఒకవేళ ఓ మ్యాచ్‌ ఓడిపోతే మిగిలిన మూడు కచ్చితంగా గెలువాలి. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఫైనల్‌ చేరాలంటే కోహ్లీసేన 4-0, 3-1, 3-0, 2-0తో ఇంగ్లండ్‌పై గెలువాలి. ఒకవేళ 0-3, 0-4తో ఓడితే ఫైనల్‌ చేరే అవకాశమే ఉండదు. స్వదేశంలో సిరీస్‌ కావడంతో భారత్‌ సత్తాచాటే చాన్స్‌లే అధికం. దీంతో మిగిలిన జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా టీమ్‌ఇండియా నేరుగా ఫైనల్‌ చేరే అవకాశాలే మెండు. కాగా 2019లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌పై సిరీస్‌ విజయాలు సాధించిన భారత్‌.. గతేడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌ చేతిలో 0-2తో టెస్టు సిరీస్‌ కోల్పోయిన సంగతి తెలిసిందే.

న్యూజిలాండ్‌ (70 శాతం, 420 పాయింట్లు)

మ్యాచ్‌లు మిగిలిలేవు

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ ఖరారు కాకపోవడంతో డబ్ల్యూటీసీలో ఇక న్యూజిలాండ్‌కు మ్యాచ్‌లు లేనట్టే. సాధ్యమైన 600 పాయింట్లలో ఇప్పటికే న్యూజిలాండ్‌ 420 దక్కించుకుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా 3-0 లేదా 2-0తో ఆస్ట్రేలియాను ఓడించి, మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో గెలిస్తే కివీస్‌కు ఫైనల్‌ చాన్స్‌ ఉండదు. లేకపోతే మిగిలిన జట్ల సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది. భారత్‌ తర్వాత ఎక్కువ అవకాశాలు బ్లాక్‌క్యాప్స్‌కే ఉన్నాయి.  

ఆస్ట్రేలియా (69.2శాతం, 332 పాయింట్లు)

మిగిలిన మ్యాచ్‌లు: 3, దక్షిణాఫ్రికాతో (ఖరారు కావాల్సి ఉంది)

 సొంతగడ్డపై భారత్‌ చేతిలో చావుదెబ్బ తిన్న ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టకలో టాప్‌ నుంచి మూడోస్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికాలో ఆ జట్టుతో జరిగే టెస్టు సిరీస్‌లో కనీసం రెండు టెస్టులు గెలిచి.. ఒక్క మ్యాచ్‌లోనూ ఓడకపోతే ఆస్ట్రేలియా ఫైనల్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ సిరీస్‌ను దక్షిణాఫ్రికా గెలిస్తే.. ఆసీస్‌ పని ఖతమైనట్టే. ఒకవేళ వేరే ఫలితం వస్తే.. మిగిలిన జట్లపై కంగారూ జట్టు ఆశలుపెట్టుకోవాల్సి ఉంటుంది. 

ఇంగ్లండ్‌ (65.2శాతం, 332 పాయింట్లు)

మిగిలిన మ్యాచ్‌లు: లంకలో 1, భారత్‌లో 4 టెస్టులు 

టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరేందుకు ఇంగ్లండ్‌కు అవకాశాలు తక్కువే. తుదిపోరులో చోటు సాధించాలంటే ప్రస్తుత గాలే టెస్టుతో పాటు భారత్‌ను 3-0 లేదా 4-0తో రూట్‌సేన ఓడించాల్సి ఉంటుంది. 2-2తో డ్రా చేసుకున్నా ఫలితం ఉండదు. 

ఇక పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, వెస్టిండీస్‌ ఎప్పుడో రేసు నుంచి తప్పుకున్నాయి. ఒకవేళ దక్షిణాఫ్రికా (40 శాతం).. ఆసీస్‌, పాక్‌లను క్లీన్‌స్వీప్‌ చేస్తే.. మిగిలిన జట్ల ఫలితాల ఆధారంగా ఫైనల్‌ చేరొచ్చు.  


VIDEOS

logo