మంగళవారం 14 జూలై 2020
Sports - Jun 09, 2020 , 17:19:00

కూరగాయలు అమ్ముతున్న క్రీడాకారిణికి సాయం

కూరగాయలు అమ్ముతున్న క్రీడాకారిణికి సాయం

రాంచీ: పేద కుటుంబంలో పుట్టి సమస్యలతో సహవాసం చేసి ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంకు అందుకొన్న భారత్‌ ఆర్చర్‌ దీపికా కుమారిని ఆదర్శంగా తీసుకొన్న ఓ యువ క్రీడాకారిణి.. ఇల్లు గడవడం కోసం కూరగాయలు అమ్మతున్నది. కష్టాల సుడిగుండంలో ఉన్న విషయం తెలుసుకొన్న జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌ ఆమెను ఆదుకోవడానికి చర్యలు తీసుకొన్నారు. జార్ఖండ్‌కు చెందిన యువ ఆర్చర్‌ సోను ఖాతూన్‌‌.. చిన్న వయసు నుంచే ఆర్చరీపై మక్కువ పెంచుకొన్నది. జాతీయ పాఠశాల అండర్‌-17 విభాగంలో కాంస్య పతకం సాధించింది. అయితే కొన్నేండ్ల క్రితం అనుకోకుండా తన విల్లు విరిగిపోవడంతో ఇక ఆటను కొనసాగించలేకపోయింది. ఆటను తిరిగి కొనసాగించాలనుకొన్నా తన వద్ద విల్లు కొనేందుకు కాదు కదా ఇల్లు గడిచేందుకు కూడా డబ్బు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడింది. చివరకు ఇంటి అవసరాల కోసం  స్థానికంగా కూరగాయలు అమ్మే పనిలో కుదిరింది. 

యువ  ఆర్చర్‌ కూరగాయలు అమ్ముకుంటోంది అంటూ ఆమె వీడియో వైరల్‌ కావడంతో విషయం ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌ దృష్టికెళ్లింది. ఆర్చరీలో ప్రతిభావంతురాలైన సోను ఖాతూన్‌ను ఆదుకోవాలని స్థానిక అధికారులకు సీఎం ఆదేశించడంతో.. డిప్యూటీ కమిషనర్‌ అమిత్‌ కుమార్‌ ఆమెను తన కార్యాలయానికి పిలిపించుకొని రూ.20 వేల చెక్కును సాయంగా అందజేశారు. భవిష్యత్‌లో ఖాతూన్‌ను ఆదుకొనేందుకు మరిన్ని చర్యలు తీసుకొంటామని అమిత్‌ తెలిపారు. మరుగున పడిపోతున్న క్రీడాకారులను గుర్తించి వారిని జాతీయ, అంతర్జాతీయస్థాయిలో తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకొంటామని ఈ సందర్భంగా సీఎం హేమంత్‌ సోరేన్‌ పేర్కొన్నారు.logo