సోమవారం 30 మార్చి 2020
Sports - Jan 25, 2020 , 00:09:26

రేసులోకి అగార్కర్‌

రేసులోకి అగార్కర్‌

న్యూఢిల్లీ: జాతీయ సెలెక్టర్‌ పదవి కోసం దరఖాస్తుల వెల్లువ కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే పలువురు ప్రముఖ క్రికెటర్లు దరఖాస్తు చేసుకోగా, తాజాగా మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌ రేసులోకి వచ్చాడు. తాను సెలెక్టర్‌ పదవి కోసం బరిలోకి దిగుతున్నట్లు అగార్కర్‌ శుక్రవారం పేర్కొన్నాడు. అయితే సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ రేసులో అజిత్‌ అందరికంటే ముందంజలో ఉన్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. కెరీర్‌లో 26టెస్టులు, 191 వన్డేలు, 3 టీ20లు ఆడిన 42 ఏండ్ల అగార్కర్‌ ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లు కలిపి 349 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 


దీనికి తోడు వన్డేల్లో తక్కువ మ్యాచ్‌(23)ల్లో వేగంగా 50 వికెట్లు తీసిన రికార్డు ఈ ముంబై బౌలర్‌ పేరిట ఉంది. మరోవైపు గతంలో జూనియర్‌ సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 24వ తేదీని బీసీసీఐ తుది గడువుగా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటి వరకు అగార్కర్‌, ప్రసాద్‌, చేతన్‌శర్మ, మోంగియా, శివ రామకృష్ణన్‌, రాజేశ్‌ చౌహాన్‌, ఖురాసియా, జ్ఞానేంద్ర పాండే, ప్రీతమ్‌ పోటీపడుతున్నారు. 


logo