ఆదివారం 06 డిసెంబర్ 2020
Sports - Oct 12, 2020 , 21:25:09

IPL 2020: డివిలియర్స్‌ మెరుపులు..బెంగళూరు భారీ స్కోరు

IPL 2020: డివిలియర్స్‌ మెరుపులు..బెంగళూరు భారీ స్కోరు

షార్జా: ఐపీఎల్‌-13వ సీజన్‌లో భాగంగా  కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో  జరుగుతున్న మ్యాచ్‌లో    రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు  195  పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.  హార్డ్‌హిట్టర్‌ ఏబీ డివిలియర్స్‌(73 నాటౌట్‌: 33 బంతుల్లో 5ఫోర్లు, 6సిక్సర్లు)వీరవిహారం చేయడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 194 పరుగులు చేసింది.   ఆరంభంలో అరోన్‌ ఫించ్‌(47: 37 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌ ),  దేవదత్‌ పడిక్కల్‌(32: 23 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌)  దూకుడుకు తోడు ఆఖర్లో   డివిలియర్స్‌ మెరుపులు తోడు కావడంతో  బెంగళూరు  భారీ స్కోరు చేసింది.

ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(33 నాటౌట్:‌ 28 బంతుల్లో ఫోర్‌) ఫర్వాలేదనిపించాడు.   ఓపెనింగ్‌ జోడీని  కోల్‌కతా బౌలర్లు ఏ దశలోనూ ఇబ్బంది పెట్టలేకపోయారు. ఓపెనర్లు  ఫించ్‌, దేవదత్‌  ఆరంభం నుంచి వేగంగా ఆడి జట్టును  చక్కని ఆరంభానిచ్చారు. ఓపెనింగ్‌ జోడీ కోల్‌కతా బౌలర్లపై  ఎదురుదాడికి దిగి పవర్‌ప్లేలో వికెట్‌ నష్టపోకుండా 47 పరుగులు  రాబట్టింది.  ఆండ్రూ రస్సెల్‌ వేసిన ఎనిమిదో ఓవర్లో పడిక్కల్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన   కోహ్లీ నిదానంగా ఆడుతుండగా మరో ఎండ్‌లో అరోన్‌ ఫించ్‌ భారీ షాట్లతో చెలరేగాడు. 

వన్‌డౌన్‌లో వచ్చిన   విరాట్‌   నెమ్మదిగా బ్యాటింగ్‌ చేయగా...  ఫించ్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఏబీడీ ఎక్కువగా తానే స్ట్రయికింగ్‌ తీసుకుంటూ ఎదురుదాడికి దిగాడు.  అటు  కోహ్లీ సహకారం అందించాడు. 15 ఓవర్లకు ఆర్‌సీబీ  111/2తో మెరుగైన స్థితిలో ఉన్నా ఆఖర్లో డివిలియర్స్‌ మెరుపులతో బెంగళూరు భారీ స్కోరు చేసింది.  చివరి ఐదు ఓవర్లలో ఏబీడీ ఆకాశమే హద్దుగా రెచ్చిపోవడంతో  83 పరుగులు  రాబట్టింది.  డెత్‌ ఓవర్లలో ఏబీడీ ధాటికి కోల్‌కతా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.