మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Oct 25, 2020 , 17:13:47

RCB vs CSK: రాణించిన కోహ్లీ, డివిలియర్స్‌

RCB vs CSK: రాణించిన  కోహ్లీ, డివిలియర్స్‌

దుబాయ్; చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పోరాడే స్కోరు సాధించింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(50: 43 బంతుల్లో 1ఫోర్‌, 1సిక్స్‌) అర్ధశతకానికి తోడు  డివిలియర్స్‌(39: 36 బంతుల్లో 4ఫోర్లు) రాణించడంతో బెంగళూరు 20 ఓవర్లలో  6 వికెట్లకు 145 పరుగులు చేసింది.

ఆరంభంలో దేవదత్‌ పడిక్కల్‌(22) ఫర్వాలేదనిపించారు.  శామ్‌ కరన్‌(3/19), దీపక్‌ చాహర్‌(2/31) కట్టుదిట్టంగా బంతులేసి బెంగళూరు భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు.  మధ్య ఓవర్లలో స్పిన్నర్లు బ్యాట్స్‌మెన్‌ను బాగా ఇబ్బంది పెట్టారు. 

46 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన జట్టును కోహ్లీ, డివిలియర్స్‌ జోడీ ఆదుకుంది.     బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ  వీరిద్దరూ 82  పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. డివిలియర్స్‌  బౌండరీలు లక్ష్యంగా చెలరేగగా..విరాట్‌ సింగిల్స్‌,  డబుల్స్‌ తీసేందుకు ప్రయత్నించాడు. డెత్‌ ఓవర్లలో బెంగళూరు ఎక్కువగా పరుగులు రాబట్టలేకపోయింది. 

చాహర్‌ వేసిన 18వ ఓవర్లో ఏబీడీ ఔట్‌ కాగా కరన్‌ వేసిన తర్వాతి ఓవర్‌ మొదటి బంతికే మొయిన్‌ అలీ వెనుదిరిగాడు.  అదే ఓవర్‌లో అర్ధశతకం పూర్తి చేసుకున్న విరాట్‌ ఆఖరి బంతికి డుప్లెసిస్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరడంతో చివర్లో మెరుపులు లేకుండానే ఇన్నింగ్స్‌ ముగిసింది.  ఆఖరి మూడు ఓవర్లలో బెంగళూరు 4 వికెట్లు కోల్పోయి 20 పరుగులు చేసింది.