బుధవారం 25 నవంబర్ 2020
Sports - Sep 21, 2020 , 21:20:47

పడిక్కల్‌ ఫటాఫట్‌...డివిలియర్స్‌ అర్ధశతకం

పడిక్కల్‌  ఫటాఫట్‌...డివిలియర్స్‌ అర్ధశతకం

దుబాయ్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు యువ ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ (56) అదరగొట్టాడు.  రైజర్స్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొని  ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే అర్ధశతకంతో అలరించాడు.  చూడచక్కని షాట్లతో ఆద్యంతం ఆకట్టుకున్నాడు.   పడిక్కల్‌ ఆరంభంలో  జోరు చూపించగా..ఆఖర్లో డివిలియర్స్‌ (51) అర్ధశతకంతో  రాణించడంతో నిర్ణీత ఓవర్లలో బెంగళూరు 5 వికెట్లకు 163 పరుగులు  చేసింది.  

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు అదిరే ఆరంభం అందించారు. మరో  ఓపెనర్‌ ఫించ్‌..20 ఏండ్ల క్రికెటర్‌కు చక్కని సహకారం అందించాడు.  ఈ జోడీ  6 ఓవర్లలోనే 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.  మొదటి  నుంచి దూకుడుగా ఆడిన దేవదత్‌..36 బంతుల్లోనే  హాఫ్‌సెంచరీ చేశాడు.  పడిక్కల్‌ అర్ధశతకం పూర్తి చేసుకున్న కాసేపటికే అతని జోరుకు శంకర్‌ ముగింపు పలికాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్‌ కోహ్లీ(14) పెద్దగా రాణించలేదు. నటరాజన్‌  బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

ఓపెనర్లు ఔటైన తర్వాత బెంగళూరు స్కోరు వేగం తగ్గింది.  ఓపెనర్లు తొలి వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం  నెలకొల్పారు. పడిక్కల్‌, ఫించ్‌ వరుస ఓవర్లలో ఔటయ్యారు.  ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్‌ను సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టడి చేశారు.  ఇన్నింగ్స్‌ ఆఖర్లో డివిలియర్స్‌ మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. ధనాధన్‌ ఆటతో హాఫ్‌సెంచరీ సాధించడంతో పాటు  జట్టు స్కోరును 160 దాటించాడు.  రైజర్స్‌ బౌలర్లలో నటరాజన్‌, శంకర్‌, అభిషేక్‌ శర్మ తలో వికెట్‌ తీశారు. ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ మ్యాచ్ మధ్యలోనే తప్పుకున్నాడు.