మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Nov 07, 2020 , 18:22:23

అభిమానులకు డివిలియర్స్‌ క్షమాపణలు

అభిమానులకు డివిలియర్స్‌ క్షమాపణలు

అబుదాబి: ఐపీఎల్‌ టైటిల్‌ను దక్కించుకోవాలన్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) కల మరోసారి చెదిరిపోయింది. ప్రస్తుత 13వ సీజన్‌ ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిన ఆ జట్టు నిరాశగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్‌ ఓడిపోయాక ఆర్‌సీబీ ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకొని అభినందించుకున్నారు. 

కొందరు ప్లేయర్లు జెర్సీలపై సంతకాలు చేశారు. మరికొందరు అభిమానులకు సందేశాలు ఇచ్చారు. ఈ వీడియోను రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఎప్పటికీ గుర్తుండిపోయే టోర్నీ.. నిరాశతో ముగిసిందంటూ రాసుకొచ్చింది. ఈ వీడియోలో డివిలియర్స్‌, కెప్టెన్‌ కోహ్లీ సహా మరికొందరు మాట్లాడారు. మద్దతు తెలిపిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

మాకు మద్దతుగా నిలిచిన ఆర్‌సీబీ అభిమానులందరికీ కృతజ్ఞతలు. మేం టోర్నీ మొత్తం ఆడాలని (టైటిల్‌ సాధించాలని) మీరు కోరుకున్నారు. తర్వాతి సీజన్‌లో నెరవేర్చగలమని ఆశిస్తున్నా. మధ్యలోనే నిష్క్రమించినందుకు క్షమాపణలు చెబుతున్నా. మేం శాయశక్తులా పోరాడాం. ఎన్నో సానుకూలతలు బయపడ్డాయి. నిత్యం మా వెంట నిలుస్తూ మద్దతునిచ్చినందుకు కృతజ్ఞతలు  అని డివిలియర్స్‌ చెప్పాడు.


 తమ జట్టు చివరి వరకు పోరాడడం పట్ల గర్వంగా ఉన్నానని, ఈసారి వచ్చిన సానుకూలతలతో వచ్చే ఏడాది బరిలోకి దిగుతామని కెప్టెన్‌ కోహ్లీ అన్నాడు. అలాగే ఓపెనర్లు ఆరోన్‌ ఫించ్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌ కూడా బెంగళూరు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.