ఇలింగ్‌వర్త్: ఓ బ్యాట్స్‌మన్ సిక్స్ కొడితే ప్రత్యర్థి బౌలర్, ఫీల్డర్లు ఫీలవుతారు. కానీ ఇంగ్లండ్‌లోని ఇలింగ్‌వర్త్ సెయింట్ మేరీస్ క్రికెటర్ ఆసిఫ్ అలీ మాత్రం తాను సిక్స్ కొట్టినందుకు తెగ ఫీలయ్యాడు. కారణం ఏమై ఉంటుందో ఊహించగలరా? ఎందుకంటే ఆ బ్యాట్స్‌మన్ కొట్టిన సిక్స్ గ్రౌండ్ బయట ఉన్న తన సొంత కారు వెనుక అద్దాన్ని బద్ధలుకొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అలీ సిక్స్ కొట్టడం.. ఆ వెంటనే పెద్ద శబ్దం రావడం, ప్లేయర్స్ అంతా ఒక్కసారిగా పెద్దగా నవ్వడం, అలీ షాక్ తినడం వీడియోలో కనిపిస్తుంది. 24 సెకన్ల ఈ వీడియోను 24 గంటల్లోనే లక్షల మంది చూశారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఫొటోలు చూస్తే మీకే తెలుస్తుంది. పార్కింగ్‌లో ఉన్న అలీ కారు వెనుక అద్దం పూర్తిగా ధ్వంసం కావడం చూడొచ్చు. అప్పుడెప్పుడో ఐర్లాండ్‌కు చెందిన కెవిన్ ఓబ్రైన్ కొట్టిన బాల్ ఇలా ఓ కారు అద్దం పగలగొట్టిందని, విషయం తెలుసుకున్న కారు డీలర్ ఫ్రీగానే సర్వీస్ చేశాడని ఓ యూజర్ కామెంట్ చేశాడు. షాట్ బాగుంది కానీ.. ఆ కారు టైమ్ బాగా లేదని మరో యూజర్ కామెంట్ చేయడం విశేషం.