గురువారం 21 జనవరి 2021
Sports - Nov 26, 2020 , 11:45:27

ఆరుగురు పాకిస్థాన్ క్రికెట‌ర్ల‌కు క‌రోనా

ఆరుగురు పాకిస్థాన్ క్రికెట‌ర్ల‌కు క‌రోనా

వెల్లింగ్ట‌న్‌: న‌్యూజిలాండ్ టూర్‌కు వెళ్లిన పాకిస్థాన్ టీమ్‌లో క‌రోనా క‌ల‌కలం రేపింది. ఏకంగా ఆరుగురు క్రికెట‌ర్లు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. ఈ వైర‌స్‌ను దాదాపుగా దేశం నుంచే త‌రిమేసిన న్యూజిలాండ్‌.. ఈ తాజా కేసుల‌తో ఉలిక్కి పడింది. త‌మ క్వారంటైన్ నిబంధ‌న‌ల‌ను పాక్ క్రికెట‌ర్లు ఉల్లంఘించిన‌ట్లు అక్క‌డి ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. పాక్ టీమ్‌కు చివ‌రి వార్నింగ్ ఇచ్చి.. టీమ్ ప్లేయ‌ర్స్ ఎవ‌రూ రూమ్‌ల నుంచి బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. మొత్తం 53 మంది పాక్ టీమ్ స‌భ్యుల‌కు పాకిస్థాన్ నుంచి బ‌య‌లుదేరే ముందు లాహోర్‌లో క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్నాయేమో అని ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఆ టెస్టుల్లో ఎవ‌రికీ ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌లేదు. అయితే న్యూజిలాండ్ రాగానే చేసిన ప‌రీక్ష‌ల్లో మాత్రం పాజిటివ్‌గా తేలింది. ఇప్పుడు పాజిటివ్‌గా తేలిన ప్లేయ‌ర్స్ అంద‌రికీ క‌నీసం మ‌రో నాలుగుసార్లు టెస్టులు నిర్వ‌హిస్తామ‌ని అక్క‌డి ఆరోగ్య శాఖ తెలిపింది. త‌మ దేశానికి వ‌చ్చి ఆడ‌టం త‌మ‌కు సంతోషం కలిగించే విష‌య‌మే అయినా.. ఇక్క‌డి నిబంద‌న‌ల‌కు క‌ట్టుబ‌డి ఉండాల్సిన అవ‌స‌రం కూడా వాళ్ల‌పై ఉంద‌ని కివీ ఆరోగ్య శాఖ చెప్ప‌డం గ‌మ‌నార్హం. క‌ఠిన క్వారంటైన్ నిబంధ‌న‌లు, లాక్‌డౌన్లతో న్యూజిలాండ్ క‌రోనా వైర‌స్‌ను త‌రిమికొట్టింది. ఈ మ‌హ‌మ్మారి మొద‌లైనప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా కేవ‌లం 1684 కేసులు మాత్ర‌మే న‌మోద‌య్యాయి. డిసెంబర్ 18న జ‌రిగే టీ20తో న్యూజిలాండ్‌లో పాక్ టూర్ మొద‌ల‌వుతుంది. మొత్తం మూడు టీ20లు, రెండు టెస్టులు పాక్ టీమ్ ఆడ‌నుంది. 


logo