ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Sports - Feb 01, 2021 , 18:12:09

రెండో టెస్టుకు ప్రేక్షకులకు అనుమతి

రెండో టెస్టుకు ప్రేక్షకులకు అనుమతి

న్యూఢిల్లీ: క్రీడా పోటీలకు మైదానాలు, స్టేడియాల్లో 50 శాతం మంది ప్రేక్షకులకు అనుమతినిస్తూ కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య చెన్నై వేదికగా జరిగే  రెండో టెస్టుకు 50శాతం  ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించాలని బీసీసీఐ, తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌(టీఎన్‌సీఏ) నిర్ణయించాయి.  కొత్తగా కొవిడ్‌-19 మార్గదర్శకాలు విడుదల కావడంతో స్టేడియంలోకి ఫ్యాన్స్‌ను అనుమతించే విషయంపై అసోసియేషన్‌ సభ్యులు బీసీసీఐ అధికారులతో చర్చించారు.  మ్యాచ్‌ కవరేజీకి మీడియా ప్రతినిధులను కూడా అనుమతించనున్నారు.

'క్రీడా వేదికల్లో ప్రేక్షకులను అనుమతించే విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా కొవిడ్‌-19 మార్గదర్శకాలను అనుసరించి రెండో టెస్టు కోసం ప్రేక్షకులను అనుమతించే అంశంపై చర్చించాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదివారం ఎస్‌ఓపీలు విడుదల చేసిందని' టీఎన్‌సీఏ అధికారి పేర్కొన్నారు.  సేఫ్టీ ప్రొటోకాల్స్‌కు అనుగుణంగా రెండో టెస్టుకు 50శాతం మంది ప్రేక్షకులను అనుమతించాలని బీసీసీఐ, టీఎన్‌సీఏ నిర్ణయించాయి.  ఎంఏ చిదంబరం స్టేడియం సామర్థ్యం 50,000. 

భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య తొలి టెస్టు శుక్రవారం నుంచి ఆరంభంకానుండగా రెండో టెస్టు ఫిబ్రవరి 13న మొదలవనుంది. ఐతే మూడు, నాలుగు టెస్టులకు ఆతిథ్యమిచ్చే అహ్మదాబాద్‌ స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తామని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. 

VIDEOS

logo