శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Mar 10, 2020 , 03:59:01

నాకౌట్‌ ఫోబియా!

నాకౌట్‌ ఫోబియా!

2014 నుంచి ఐసీసీ టోర్నీల్లో భారత క్రికెట్‌ అభిమానుల హృదయాలు కలచివేసే సందర్భాలు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు ఏడేండ్ల నుంచి మెగాటోర్నీల్లో సెమీస్‌ లేదా ఫైనల్స్‌ వరకు వెళ్లగలుగుతున్న భారత పురుషుల, మహిళల జట్లు రిక్తహస్తాలతోనే తిరిగివస్తున్నాయి. టోర్నీ ప్రారంభంలో అదిరే ప్రదర్శనతో దూసుకెళుతూ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో తేలిపోతున్నాయి. తప్పక గెలవాల్సిన పోటీల్లో ఒత్తిడికి చిత్తవుతున్నాయి. టోర్నీ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన చేసిన ప్లేయర్లు సైతం నాకౌట్‌ దశకు వచ్చే సరికి చేతులెత్తేస్తున్నారు. దీంతో ఏడేండ్లుగా ఎనిమిది మెగాటోర్నీల్లో మొత్తం ఎనిమిది నాకౌట్‌ మ్యాచ్‌ల్లో భారత సీనియర్‌ జట్లు నిరాశపరిచాయి.

  • మెగాటోర్నీల్లో భారత జట్ల తడబాటు
  • ఐసీసీ టైటిల్‌ సాధించి ఏడేండ్లు
  • నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి చిత్తు

ప్రతి ఐసీసీ టోర్నీలో ఫేవరెట్‌గా అడుగుపెడుతున్న భారత క్రికెట్‌ జట్లు నాకౌట్‌ దశలో చతికిలపడుతున్నాయి. గ్రూప్‌ దశలో అదిరే ఆటతో ఆకట్టుకుంటూ దూసుకెళ్లడం.. సెమీస్‌ లేదా ఫైనల్స్‌లో ఒత్తిడి భరించలేక ఓటమి పాలవడం పరిపాటిగా మారింది. దీంతో దాదాపు ఏడేండ్లుగా భారత పురుషుల, మహిళల క్రికెట్‌ జట్లు ఒక్క ఐసీసీ మేజర్‌ టోర్నీ టైటిల్‌ను కైవసం చేసుకోలేకపోయాయి. మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని భారత పురుషుల జట్టు 2013 చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ను చివరిసారి అందుకుంది. ఆ తర్వాత జరిగిన అన్ని ఐసీసీ టోర్నీల్లోనూ  నిరాశే ఎదురైంది. 2013 తర్వాత రెండు సార్లు ఫైనల్స్‌ (2014 టీ20ప్రపంచకప్‌, 2017 చాంపియన్స్‌ట్రోఫీ)లో, మూడు సార్లు సెమీఫైనల్స్‌(2015, 2019 వన్డే ప్రపంచకప్‌, 2016 టీ20 వరల్డ్‌కప్‌)లో ఓడి రిక్తహస్తాలతోనే టోర్నీల నుంచి వైదొలిగింది. మహిళల పరిస్థితీ అంతే. 2017 వన్డే, 2020 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో భారత మహిళల జట్టుకు ఓటమి ఎదురవగా.. 2018 టీ20వరల్డ్‌కప్‌లో సెమీస్‌లోనే పరాజయం పాలైంది.


2014 నుంచి 2019


2014 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌  

ఈ టోర్నీ గ్రూప్‌-1లో భారత్‌ అగ్రస్థానాన నిలిచి, సెమీఫైనల్లోనూ దక్షిణాఫ్రికాను ఓడించింది. శ్రీలంక సైతం తుదిపోరుకు దూసుకురావడంతో 2011 వన్డే ప్రపంచకప్‌ మరోసారి రిపీట్‌ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే, ముందు గా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ కోహ్లీ(77) రాణించడంతో 130పరుగుల మోస్తరు స్కోరు చేసింది. సంగక్కర(52) అదరగొట్టడంతో శ్రీలంక 17.5ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 


2015 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌  

ఈ టోర్నీలో ఢిపెండింగ్‌ చాంపియన్‌ హోదాలో అడుగుపెట్టిన భారత్‌ గ్రూప్‌ దశలో అదరగొట్టి సెమీస్‌ చేరింది. ఆ మ్యాచ్‌లో స్టీవ్‌ స్మిత్‌(105) శతకంతో దుమ్మురేపడంతో  ఆసీస్‌ 328 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ధోనీ(65) మినహా మరెవరూ రాణించలేకపోవడంతో భారత్‌ 233పరుగులకే ఆలౌటైంది. 


2016 టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ 

స్వదేశంలో ఈ టోర్నీ జరుగడంతో టైటిల్‌ భారత్‌దే అని అందరూ అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే సెమీస్‌లో కెప్టెన్‌ కోహ్లీ(47 బంతుల్లో 89పరుగులు) అదరగొట్టడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన భార త్‌ 193 పరుగుల భారీ స్కోరు చేసింది. విండీస్‌ బ్యాట్స్‌మన్‌ సిమన్స్‌(51బంతుల్లో 82) అదరగొట్టడంతో 7వికెట్ల తేడాతో  భారత్‌ పరాజయం పాలైంది. 


2017 చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ 

భారత అభిమానులను ఈ టోర్నీ ఎప్పు డూ చేదు జ్ఞాపకంగానే గుర్తుంటుంది. చిర కాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన టోర్నీ ఫైనల్లో భారత్‌ 180పరుగుల  ఓటమి చవిచూసింది.  338 పరుగుల లక్ష్యఛేదనలో 158కే అలౌటై తీవ్రంగా నిరాశపరిచింది. 


2019 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌ 

ఇటీవల భారత అభిమానులను ఎక్కువ బాధించిన మ్యాచ్‌ 2019 వన్డే విశ్వకప్‌ సెమీఫైనల్‌. కివీస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో రెండురోజుల పాటు జరిగింది.  తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 239 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ధోనీ (50)తో పాటు చివర్లో జడేజా (77) మినహా ఎవరూ నిలువలేకపో వడంతో 18పరుగుల తేడాతో ఓడింది. 


2017 నుంచి 2020

2017 మహిళల ప్రపంచకప్‌ ఫైనల్స్‌ 

ఈ టోర్నీలో ఫైనల్లో భారత్‌ తప్పక గెలుస్తుందన్న స్థితికి చేరింది. 229పరుగుల లక్ష్యఛేదనలో పూనమ్‌ రావత్‌(86) రాణించడంతో ఓ దశలో మూడు వికెట్లకు 191పరుగులు చేసింది. ఆ దశలో ఒక్కసారిగా భారత బ్యాటింగ్‌ కుప్పకూలింది. 28పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్‌ చేతిలో 9పరుగుల తేడాతో ఓడింది. 


2018 మహిళల టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌..  

భారత మహిళల జట్టు ప్రపంచకప్‌ టైటిల్‌ ఆశలను ఇంగ్లండ్‌ మరోసారి ఈ టోర్నీలో చెరిపేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ఓ దశలో 89 పరుగులకు రెండు వికెట్లు పటిష్ఠ స్థితిలోనే నిలిచింది.  ఆ తర్వాత 23పరుగుల వ్యవధిలో 8వికెట్లు చేజార్చుకొని 112కే పరిమితమైంది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ 17బంతులు మిగిలుండగానే 8వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించడంతో భారత్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. ఈ మ్యాచ్‌లో సీనియర్‌ ప్లేయర్‌ మిథాలీ రాజ్‌ను పక్కనబెట్టడంతో దుమారం రేగిన సంగతి తెలిసిందే.

 

2020 మహిళల  టీ20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌.. 

తాజాగా జరిగిన ఈ టోర్నీలో ప్రారంభం నుంచి అదరగొట్టిన భారత్‌ ఫైనల్లో  విఫలమైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియాను కట్టడి చేయలేకపోయింది. ఓపెనర్లు అలీసా హేలీ(75), మూనీ(78) రెచ్చిపోవడంతో ఆసీస్‌ 184పరుగుల భారీ స్కోరు చేసింది. టోర్నీ ఆసాంతం అదరగొట్టిన భారత యువ కెరటం షఫాలీ(2) సహా మిగిలిన వారు విఫలమవడంతో భారత్‌ 99పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలిసారి ప్రపంచకప్‌ గెలువాలన్న భారత మహిళల కల మరోసారి చెదిరింది. 


logo