గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Jan 31, 2020 , 02:14:58

మార్పులతో బరిలోకి భారత్‌.. సుందర్‌, సైనీకి అవకాశం

మార్పులతో బరిలోకి భారత్‌.. సుందర్‌, సైనీకి అవకాశం

మధ్యాహ్నం 12.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో

  • పరువు కాపాడుకునేందుకు కివీస్‌ ఆరాటం.. నేడు నాలుగో టీ20 మ్యాచ్‌

సిరీస్‌ గెలిచిన ఊపులో భారత్‌ ఉంటే..సొంతగడ్డపై కనీసం పరువు నిలుపుకోవాలన్న పట్టుదలతో న్యూజిలాండ్‌ కనిపిస్తున్నది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ కివీస్‌లో తొలిసారి టీ20 సిరీస్‌ సొంతం చేసుకున్న టీమ్‌ఇండియా ప్రయోగాలకు మొగ్గుచూపించే అవకాశం కనిపిస్తున్నది.  కెప్టెన్‌ విలియమ్సన్‌ ముందుండి  నడిపిస్తున్నా..సహచరుల నుంచి సహకారం కరువైన వేళ కివీస్‌ ఏమాత్రం పోటీనిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 వెల్లింగ్టన్‌ వేదికగా జరుగనుంది. 

వెల్లింగ్టన్‌: ప్రపంచకప్‌ సన్నాహాల్లో భాగంగా భారత్‌ పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నది. ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పటిష్ఠమైన జట్టు కోసం ప్రయోగాలు చేసేందుకు సిద్ధమైంది. అయితే మొత్తంగా ప్రస్తుతమున్న బ్యాటింగ్‌ కూర్పును మార్చకుండా బౌలింగ్‌లో వైవిధ్యం కోసం కుర్రాళ్లకు అవకాశమివ్వబోతున్నది. గత మ్యాచ్‌ హీరో మహమ్మద్‌ షమీ స్థానంలో యువ పేసర్‌ నవ్‌దీప్‌ సైనీ, చాహల్‌, జడేజా ఈ ఇద్దరిలో ఒకరిని తప్పించి ఆల్‌రౌండర్‌ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకునే చాన్స్‌ కనిపిస్తున్నది. వికెట్‌కీపర్‌గా విజయవంతమైన కేఎల్‌ రాహుల్‌ను కొనసాగించనుండగా, రిషబ్‌ పంత్‌, శాంసన్‌కు మరోమారు నిరాశే ఎదురుకావచ్చు. టాపార్డర్‌లో రాహుల్‌, రోహిత్‌, కోహ్లీ, అయ్యర్‌ మంచి ఫామ్‌మీదుండగా, పాండే, దూబే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో అంతగా సఫలం కాలేకపోతున్నారు.

మార్పులు, చేర్పులతో 

మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే భారత్‌కు సిరీస్‌ సమర్పించుకున్న కివీస్‌ మా ర్పులు, చేర్పులు ఎంచుకోబోతున్నది. వరుసగా విఫలమవుతూ జట్టుకు భారంగా మారిన ఆల్‌రౌండర్‌ గ్రాండ్‌హోమ్‌ బదులుగా మిచెల్‌ తుది జట్టులోకి రానున్నాడు. ఫామ్‌మీదున్న కెప్టెన్‌ విలియమ్సన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందు వచ్చే అవకాశముంది. పరిస్థితులను బట్టి గప్టిల్‌తో కలిసి విలియమ్సన్‌ ఓపెనర్‌గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

జట్ల అంచనా: 

భారత్‌: కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌, రాహుల్‌,  అయ్యర్‌, పాండే, దూబే, జడేజా/సుందర్‌, శార్దుల్‌, చాహల్‌/కుల్దీప్‌, షమీ/సైనీ, బుమ్రా 

న్యూజిలాండ్‌: విలియమ్సన్‌(కెప్టెన్‌), గప్టిల్‌, మున్రో, టేలర్‌, మిచెల్‌, సిఫెర్ట్‌, సాంట్నర్‌, కుగెల్జిన్‌, సౌథీ, సోధీ, బెన్నెట్‌ 

పిచ్‌, వాతావరణం: 

వెస్ట్‌ప్యాక్‌ స్టేడియంలో మొదట బ్యాటింగ్‌ చేసే జట్టు గెలిచే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగుసార్లు ఇలాంటి ఫలితమే వచ్చింది. మ్యాచ్‌కు వేదికైన వెల్లింగ్టన్‌ బేసిన్‌ రిజర్వ్‌లో మంచి ఎండ కాసే అవకాశముంది.


logo
>>>>>>