శుక్రవారం 29 మే 2020
Sports - Apr 03, 2020 , 12:13:54

2011 వరల్డ్‌ కప్‌లో సచిన్‌, యువీతోపాటు మరో ముగ్గురు

2011 వరల్డ్‌ కప్‌లో సచిన్‌, యువీతోపాటు మరో ముగ్గురు

భారత్‌ తన రెండో ప్రపంచకప్‌ను గెలుపొంది నేటికి తొమ్మిదేండ్లు పూర్తయ్యాయి. అయితే 2011 వరల్డ్‌ కప్‌ అనగానే మనకు గుర్తొచ్చేది సచిన్‌ టెండూల్కర్‌, యువరాజ్‌సింగ్‌, జహీర్‌ఖాన్‌. భారత్‌ కప్పు గెలుపొందడంలో వీరు ముగ్గురిది ముఖ్యపాత్రే. 481 పరుగులతో టోర్నీలోనే అత్యధిక స్కోరర్‌ నిలిచాడు సచిన్‌, తన ఆల్‌రౌండ్‌ షోతో (362 పరుగులు, 15 వికెట్లు) మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు యువరాజ్​, 21 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు జహీర్‌. అయినా టోర్నీలో జట్టు కష్టసమయాల్లో ఉన్నప్పుడు, తప్పక గెలవాల్సిన మ్యాచుల్లో విశేషంగా రాణించి విజయతీరాలకు చేర్చినవారు మరో ముగ్గురు ఉన్నారు. వారే గౌతం గంభీర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, మునాఫ్‌ పటేల్‌. 


గౌతమ్​ గంభీర్‌

భారత్‌కు తన బ్యాటింగ్‌తో గంభీర్ ఎన్నో విజయాలను అందించాడు. లెజెండరీ బ్యాట్స్‌మెన్‌ సచిన్​కు చివరి వరల్డ్‌కప్‌, భారత్‌ గెలిచిన రెండో ప్రపంచకప్‌లో ముఖ్యపాత్ర పోషించాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో 97 పరుగులు చేసి భారత్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు.   

ఫైనల్‌లో సచిన్‌ టెండూల్కర్‌, సెహ్వాగ్‌ వికెట్లు కోల్పోయిన తర్వాత గంభీర్‌ చూపిన తెగువ ఆధునిక వన్డే క్రికెట్‌లో అత్యుత్తమమైన ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలుస్తున్నది. మొత్తం నాలుగు అర్ధ సెంచరీలతో కలిపి 393 పరుగులతో టోర్నీలో సచిన్‌ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. క్వార్టర్‌ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై లక్ష్యఛేదనలో ప్రధానపాత్ర పోషించాడు. అయితే ఇవన్నీ తనకు అలవాటులేని మూడో స్థానంలో బ్యాటింగ్‌చేసే సాధించాడు.   సెహ్వాగ్‌

వీరేందర్‌ సెహ్వాగ్​... భారత్‌ బ్యాట్స్‌మెన్​లో ధనాధన్‌ బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. బౌలర్లను ఊచకోత కోసే ఈ ఓపెనర్‌ తన గురువు సచిన్‌ చివరి వరల్డ్‌కప్‌లో తనదైన మార్క్‌ వేశాడు. ఇద్దరూ కలిపి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత్‌కు మంచి ఓపెనింగ్‌ భాగస్వామాన్ని అందించారు. టోర్నీలో 122.58 స్ట్రైక్‌రేట్‌తో సెహ్వాగ్​ 380 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌పై 175 పరుగులు చేసి వరల్డ్‌ కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ను రికార్డు సెట్ చేశాడు.మునాఫ్‌ పటేల్‌

కెప్టెన్‌ ధోనీ తనపై ఉంచిన నమ్మకాన్ని టోర్నీ ఆసాంతం నిలుపుకున్నాడు మీడియం పేసర్‌ మునాఫ్‌ పటేల్‌. జహీర్‌ ఖాన్‌ తర్వాత ధోనీ నమ్మకముంచిన బౌలర్‌ మునాఫ్‌ కావడం విశేషం. 2011 వరల్డ్‌ కప్‌లో తాను ఆడిన 8 మ్యాచుల్లో 5.36 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో 48 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. 


logo