ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Sep 19, 2020 , 16:14:01

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లకు భారీ ఊరట

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లకు భారీ ఊరట

దుబాయ్ : ఐపీఎల్ ప్రారంభానికి ఒక రోజు ముందు యూఉఈకి చేరుకున్న ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లకు భారీ ఊరట లభించింది. ఈ దేశాలకు చెందిన 21 మంది ఆటగాళ్ళు 6 రోజులకు బదులుగా కేవలం 36 గంటలు స్వీయ నిర్బంధంలో ఉండాలని యూఏఈ ప్రభుత్వం ఆదేశించింది. 

క్వారంటైన్ సమయాన్ని తగ్గిస్తూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫ్రాంచైజీలకు యూఏఈ ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. లీగ్‌లో పాల్గొనేందుకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాకు చెందిన 21 మంది ఆటగాళ్ళు గురువారం సాయంత్రం యూకే నుంచి చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా యూఏఈ చేరుకున్నారు. వారు కేవలం 36 గంటలు స్వీయ నిర్బంధంలో ఉండలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. దాంతో ఈ ఆటగాళ్లందరూ మొదటి మ్యాచ్ నుంచే అందుబాటులో ఉంటారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ బుధవారం ముగిసింది.

మొదట ఈ ఆటగాళ్ళు స్వీయ నిర్బంధంలో 6 రోజులు ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మొదటి, మూడవ, ఆరవ రోజుల్లో కరోనా పరీక్ష చేయవలసి వచ్చింది. 7 వ రోజు, అన్ని నివేదికలు ప్రతికూలంగా వచ్చిన తర్వాతే ఆటగాళ్ళు బయో-సురక్షిత వాతావరణంలో ప్రవేశం పొందుతారు. 

అంతకుముందు, ఫ్రాంచైజీలు బ్రిటన్ నుంచి వస్తున్న ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఉపశమనం కల్పించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాయి. అన్ని జట్ల పెద్ద ఆటగాళ్ళు చాలా మంది మొదటి మ్యాచ్ నుంచి అందుబాటులో ఉండేందుకు స్వీయ నిర్బంధం గడువుపై పునరాలోచించాలని వారు కోరిన మీదట యూఏఈ ప్రభుత్వంతో బీసీసీఐ పెద్దలు చర్చించి ఈ మేరకు ఉపశమనం చర్యలు తీసుకున్నారు.