శనివారం 04 జూలై 2020
Sports - May 21, 2020 , 17:27:41

'ఒలింపిక్స్‌ను మళ్లీ వాయిదా వేయాల్సి వస్తే.. రద్దే'

 'ఒలింపిక్స్‌ను మళ్లీ వాయిదా వేయాల్సి వస్తే.. రద్దే'

టోక్యో: వచ్చే ఏడాది జరుగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ను కరోనా వైరస్‌ కారణంగా నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడితే మళ్లీ వాయిదా వేయబోమని, రద్దు చేసేస్తామని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐవోసీ) అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ తెలిపారు. టోక్యో విశ్వక్రీడలకు 2021 చివరి ఆప్షన్‌ అని గురువారం బీబీసీకి ఇచ్చిన ఇంటర్వూ్యలో స్పష్టం చేశారు. ఈ ఏడాది జూలైలో ప్రారంభం కావాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ మహమ్మారి వల్ల 2021 జూలైకి వచ్చే ఏడాది వాయిదా పడింది. అయితే వైరస్‌ ప్రభావం ఇలాగే ఉంటే వచ్చే ఏడాది సైతం విశ్వక్రీడలు జరుగడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. మరోసారి వాయిదా వేసే ప్రసక్తే లేదని బాచ్‌ తేల్చిచెప్పారు. 

'సూటిగా చెప్పాలంటే.. ఒలింపిక్స్‌ నిర్వహక కమిటీ కోసం 3వేల నుంచి 5వేల మంది ఉద్యోగులను జపాన్‌ ఎప్పటికీ ఉంచుకోలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడల షెడ్యూల్‌ను ప్రతీ ఏడాది మార్చలేం. అథ్లెట్లను అనిశ్చితికి గురి చేయలేం. ఒలింపిక్స్‌ క్రీడలను మాటిమాటికీ వాయిదా వేయలేం. వచ్చే ఏడాదికి కరోనా వైరస్‌ ప్రభావం తగ్గకుంటే ఒలింపిక్స్‌ను రద్దు చేయాల్సి రావొచ్చు' అని బాచ్‌ అన్నారు. 


logo