ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Sports - Feb 11, 2021 , 08:12:31

డీఎస్‌పీగా స్టార్‌ స్ప్రింటర్‌ హిమదాస్‌

డీఎస్‌పీగా స్టార్‌ స్ప్రింటర్‌ హిమదాస్‌

గువాహటి : స్టార్‌ స్ప్రింటర్‌ హిమదాస్‌ను డిప్యూటీ పోలీస్‌ సూపరింటెండెంట్‌గా నియమించాలని అసోం ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం సర్బానంద సోనోవాల్‌ అధ్యక్షతన బుధవారం రాత్రి జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చింది. పోలీస్‌, ఎక్సైజ్, రవాణా తదితర వివిధ విభాగాల్లోని క్లాస్-1, క్లాస్-2 ఆఫీసర్లుగా క్రీడాకారులను నియమించడం ద్వారా రాష్ట్రంలో సమీకృత క్రీడా విధానాన్ని సవరించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు పరిశ్రమల శాఖ మంత్రి చంద్రమోహన్ పటోవరి విలేకరులకు తెలిపారు. అసోం పోలీస్‌ విభాగంలో డీఎస్పీ ర్యాంకు అధికారిగా హిమదాస్‌ను.. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి క్లాస్ -1 ఆఫీసర్లుగా నియమించనున్నట్లు పేర్కొన్నారు. 20 ఏళ్ల ఈ అస్సామీ స్టార్‌ స్పింటర్‌ ఐఏఏఎఫ్‌ వరల్డ్‌ అండర్‌-20 చాంపియన్‌ షిప్స్‌లో గ్లోబల్‌ ట్రాక్‌ ఈవెంట్‌ ఏదైనా ఫార్మాట్‌లో బంగారు పతకం సాధించిన మొట్టమొదటి భారతీయ అథ్లెట్‌గా రికార్డు సాధించింది.

ఇదిలా ఉండగా.. అసోం ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జనవరి 2021 నుంచి మార్చి 2021 వరకు నెలకు 30 యూనిట్ల వరకు వినియోగించే గృహాలకు ఉచిత విద్యుత్‌ను అందించాలనే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మున్సిపల్ బోర్డుల ఉద్యోగులకు సేవా ప్రయోజనాలు అందించే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గౌహతి ప్రెస్ క్లబ్ తో సహా వివిధ సంస్థలకు భూమిని కేటాయించాలని సమావేశంలో నిర్ణయించారు.  దీబ్రూగఢ్ లో శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రం నూతన ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. పబ్లిక్ వర్క్స్ డిపార్‌మెంట్‌ పేరును లోక్ నిర్మాణ్ విభాగ్‌గా మార్చడానికి మంత్రిమండలి కూడా అంగీకరించిందని పటోవరీ వివరించారు.

VIDEOS

logo