ఆదివారం 17 జనవరి 2021
Sports - Dec 10, 2020 , 01:26:03

విధిని గెలిచిన నటరాజు

విధిని గెలిచిన నటరాజు

‘అలుపెరుగని కష్టమే తలరాతను మారుస్తుంది. సాధించాలన్న కసి లక్ష్యానికి చేరుస్తుంది’ అన్న సూత్రానికి టీమ్‌ఇండియా యువ పేసర్‌ తంగరసు నటరాజన్‌ సరిగ్గా సరిపోతాడు. పేదరికమే ఆస్తిగా ఉన్న కుటుంబంలో పుట్టి.. ఎక్కడో మారుమూల తమిళనాడు గ్రామం చిన్నప్పంపట్టి నుంచి వచ్చి.. భారత జట్టులోకి ప్రవేశించడం వెనుక అతడి అపార శ్రమ దాగి ఉంది. కూలీ పనులు చేసి తనను ఇంతవాడిని చేసిన తల్లిదండ్రుల రుణం తీర్చుకున్న స్ఫూర్తిదాయక ప్రయాణం ఉంది. ఐపీఎల్‌లో యార్కర్లతో బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టిన నటరాజన్‌ జాతీయ జట్టులోనూ రాణించి తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ‘ఐపీఎల్‌లో నా హీరో నటరాజనే’ అని దిగ్గజ కపిల్‌దేవ్‌ అన్నాడంటే అతడి ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో నటరాజన్‌ జీవిత ప్రయాణంపై ప్రత్యేక కథనం. 

ప్రపంచంలోని మేటి బ్యాట్స్‌మెన్‌ను గురితప్పని యార్కర్లతో నటరాజన్‌ ఈ ఏడాది ఐపీఎల్‌లో గడగడలాడించాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున అదరగొట్టి డెత్‌ బౌలింగ్‌ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. అనతి కాలంలోనే టీమ్‌ఇండియాలోకి వచ్చేశాడు. ప్రతిభావంతుడిని అదృష్టం వరిస్తుందన్నట్టు నెట్‌బౌలర్‌గా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టి.. జట్టులో చోటు దక్కించుకొని.. అద్భుత ప్రదర్శనతో ప్రధాన బౌలర్‌ అనే స్థాయికి ఎదిగాడు. ఒక్క సిరీస్‌ ఆడి.. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లోనూ కీలక బౌలర్‌ అవుతాడని అనిపించుకునే ప్రదర్శన చేశాడు.  

పేదరికం.. మారుమూల గ్రామం.. ఏదీ ఆపలేదు  

నటరాజన్‌ది తమిళనాడు సేలం జిల్లాకు 36 కిలోమీటర్ల దూరం ఉన్న చిన్నప్పంపట్టి అనే మారుమూల గ్రామం. తండ్రి రైల్వే హమాలీగా, తల్లి చిరు వ్యాపారిగా కష్టపడుతూ అతడిని పెంచారు. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడడం గురించి అసలు ఊహించలేని పరిస్థితి అది. అలాంటిది క్రికెట్‌పై ఉన్న ప్రేమ, కఠోర శ్రమ అతడిని ఈస్థాయికి తీసుకొచ్చింది. కష్టానికి భయపడని ఆత్మైస్థెర్యమే అంతర్జాతీయ యవనికపై నిలబెట్టింది. పదేండ్ల క్రితం వరకు నటరాజన్‌ టెన్నిస్‌ బాల్‌తోనే స్థానిక మ్యాచ్‌లు ఆడాడు. జయప్రకాశ్‌ అనే స్నేహితుడు భారత మాజీ వికెట్‌ కీపర్‌ భరత్‌ రెడ్డి వద్దకు తీసుకెళ్లడంతో నట్టూ జీవితం మలుపు తిరిగింది. జోలీ రోవల్స్‌ క్లబ్‌ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ తమిళనాడు తరఫున దేశవాళీ క్రికెట్‌లో రాణించాడు. ప్రస్తుతం జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 

నీళ్ల క్యాన్‌తో పిచ్‌.. గ్రామంలో అకాడమీ 

తన గ్రామం నుంచి మరికొంత మంది ప్లేయర్లు తయారు కావాలనే లక్ష్యంతో చిన్నస్థాయి క్రికెట్‌ అకాడమీని తన సొంత ఖర్చుతో నటరాజన్‌ ఏర్పాటు చేశాడు. సరైన ఆర్థిక వనరులు లేకపోవడంతో 20 లీటర్ల క్యాన్‌నే రోలర్లుగా వాడి పిచ్‌లను తయారు చేశాడు. ఐపీఎల్‌కు ముందు లాక్‌డౌన్‌ సమయంలో అతడు అక్కడే ప్రాక్టీస్‌ చేశాడు. ఎంతో మంది యువ క్రికెటర్లు ప్రస్తుతం అక్కడ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. తాను ఎదగడంతో నటరాజన్‌ కుటుంబం కష్టాలు కూడా తీరాయి. తల్లిదండ్రుల కోసం మంచిఇల్లు కట్టించాడు. తన సోదరిని ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. మొత్తంగా తన కష్టానికి నటరాజన్‌ ప్రతిఫలం పొందుతున్నాడు.

2017లోనే అడుగుపెట్టినా.. 

తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌(టీపీఎల్‌)లో నటరాజన్‌ ప్రతిభను గుర్తించిన పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవెన్‌ అతడిని 2017 ఐపీఎల్‌ వేలంలో రూ.3కోట్లకు తీసుకుంది. అయినా సరైన అవకాశాలు రాలేదు. 2018లో  నట్టూను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.40లక్షలకే సొంతం చేసుకుంది. అతడికి ఆడే అవకాశం ఈ ఏడాది ఐపీఎల్‌లోనే వచ్చింది. ఈ చాన్స్‌ ఒడిసిపట్టిన నట్టూ యార్కర్‌ స్పెషలిస్ట్‌గా మారిపోయాడు. ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 16 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీశాడు. కీలకమైన చివరి ఓవర్లలో పొదుపుగా బౌలింగ్‌ చేసి.. హైదరాబాద్‌ నాకౌట్‌ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. భారత్‌ తరఫున ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో నటరాజన్‌ ఆరు వికెట్లు తీశాడు. ప్రత్యర్థి బౌలర్లంతా విఫలమైన చోట, పరుగుల వరద పారిన సిరీస్‌లో 7లోపే ఎకానమీ నమోదు తన యార్కర్‌ పదును, వైవిధ్యమైన బౌలింగ్‌ సత్తా ఏంటో చూపాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌కు నా కన్నా నటరాజనే సరైనోడు’ అని ట్రోఫీని హార్దిక్‌ పాండ్య ఇచ్చేశాడంటే నటరాజన్‌ ప్రదర్శనను అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా టీమ్‌ఇండియాలో యార్కర్‌ అంటే బుమ్రా అనే పరిస్థితి నుంచి నటరాజన్‌ కూడా అనే రోజులు వచ్చేశాయి. త్వరలోనే నట్టూ యార్కర్‌ కింగ్‌ అని పిలిపించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లోనూ నటరాజన్‌ కీలకం కానున్నాడు. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్‌ వేలంలోకి నటరాజన్‌ వస్తే అతడి ధర ఏ స్థాయికి వెళుతుందో కూడా ఊహించడం కష్టమే.