శనివారం 16 జనవరి 2021
Sports - Dec 10, 2020 , 01:25:49

క్రికెట్‌కు పార్థివ్‌ గుడ్‌బై

క్రికెట్‌కు పార్థివ్‌ గుడ్‌బై

న్యూఢిల్లీ: భారత వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 17 ఏండ్ల వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతడు తన 18 సంవత్సరాల కెరీర్‌కు బుధవారం వీడ్కోలు పలికాడు. రిటైర్మెంట్‌ను ప్రకటిస్తూ ట్విట్టర్‌లో భావోద్వేగ లేఖను పోస్ట్‌ చేశాడు. ఇంతకాలం తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని, ముఖ్యంగా తనపై నమ్మకముంచిన సౌరవ్‌ గంగూలీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అని రాసుకొచ్చాడు. ప్రతిభపరంగా పార్థివ్‌ మంచి వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ అయినా.. ధోనీ తరంలో ఆడాడు కాబట్టే టీమ్‌ఇండియాలో అవకాశాలు రాలేదని ఎందరో మాజీలు చాలాసార్లు అభిప్రాయపడ్డారు. అయితే తాను ధోనీ కన్నా మెరుగ్గా ఆడనందుకే చాన్స్‌ దక్కలేదంటూ పార్థివ్‌ క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. 2002 ఆగస్టు 8న  సౌరవ్‌ గంగూలీ సారథ్యంలో 17 ఏండ్ల 153 రోజుల వయసులోనే ఇంగ్లండ్‌పై పార్థివ్‌ టీమ్‌ఇండియాలో టెస్టు అరంగేట్రం చేశాడు. చివరగా 2018 జనవరిలో దక్షిణాఫ్రికాతో టెస్టు ఆడాడు.  అంతర్జాతీయ స్థాయిలో సెంచరీ చేయలేకపోయినా దేశవాళీ క్రికెట్‌లో పార్థివ్‌ దిగ్గజంగా పేరుతెచ్చుకున్నాడు. 194 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన పటేల్‌ 43 సగటు, 27 శతకాలతో 11,240 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనూ దక్కన్‌ చార్జర్స్‌, ముంబై, చెన్నై,బెంగళూరు తరఫున 13 సీజన్లు ఆడాడు.