ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Oct 17, 2020 , 01:12:24

షెడ్యూల్‌ ప్రకారమే వింబుల్డన్‌ 2021

 షెడ్యూల్‌ ప్రకారమే వింబుల్డన్‌ 2021

లండన్‌: ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ విం బుల్డన్‌ వచ్చే ఏడాది షెడ్యూల్‌ ప్రకారం జరుగనుంది. ఈ విషయాన్ని ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. షెడ్యూల్‌ను అనుసరించి 2021 జూన్‌ 28 నుంచి జూలై 11 మధ్య జరిగే వింబుల్డన్‌లో ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించే అంశంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. వింబుల్డన్‌ టోర్నీ నిర్వహణపై ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సాలీ బోల్టన్‌ మాట్లాడుతూ ‘వచ్చే ఏడాది టోర్నీ నిర్వహించడం మా తొలి ప్రాధాన్యం. అందుకోసం ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నాం. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ప్రేక్షకులను అనుమతించాలా వద్దా అన్న దానిపై నిర్ణయం తీసుకొంటాం.  ప్రభుత్వ, వైద్య వర్గాల సలహాలు, సూచనలను అనుసరించి టోర్నీ నిర్వహణ ఏర్పాట్లు చేస్తాం’ అని అన్నాడు. కొవిడ్‌-19 కారణంగా 1945 తర్వాత తొలిసారి వింబుల్డన్‌ టోర్నీ ఈ ఏడాది రద్దయిన సంగతి తెలిసిందే.