సోమవారం 26 అక్టోబర్ 2020
Sports - Sep 30, 2020 , 03:28:58

ఐపీఎల్‌ అత్యధిక పరుగుల జాబితా టాప్‌-5లో ముగ్గురు మనవాళ్లే

ఐపీఎల్‌ అత్యధిక పరుగుల జాబితా టాప్‌-5లో ముగ్గురు మనవాళ్లే

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌.. పేరుకు మనదే అయినా..  దీనివల్ల పేరు ప్రఖ్యాతలు పొందేది మాత్రం ఎక్కువ శాతం విదేశీ ఆటగాళ్లే. జట్టుకు నలుగురు చొప్పునే ఉన్నా.. మిగిలిన ఏడుగురి కన్నా ఎక్కువ ఫేమస్‌ అయ్యేది వాళ్లే. అందుకే ఫ్రాంచైజీలు కూడా విదేశీ స్టార్లను దక్కించుకునేందుకు పోటీ పడతాయి. కొన్ని జట్లు ఓపెనర్లను ఎంచుకుంటే.. మరికొన్ని ఆల్‌రౌండర్ల వైపు మొగ్గుచూపుతాయి. ఎవరిని తీసుకున్న యజమానుల అంతిమ లక్ష్యం మాత్రం హిట్టింగే.

అయితే ఈ సీజన్‌లో విదేశీ స్టార్ల కంటే మన యువ ఆటగాళ్లే దుమ్మురేపుతున్నారు. వేదిక మారినా.. బౌండ్రీలు దూరమైనా.. ఏ మాత్రం అదురు బెదురు లేకుండా ఇరగదీస్తున్నారు. సీనియర్లు ధోనీ, కోహ్లీ వంటి వాళ్లే ఇబ్బంది పడుతున్న చోట సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, మయాంక్‌ అగర్వాల్‌, లోకేశ్‌ రాహుల్‌, పృథ్వీ షా, రాహుల్‌ తెవాటియా, శుభ్‌మన్‌ గిల్‌ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. మరి మనవాళ్ల నాటుకొట్టుడుపై ఓ కన్నేస్తే..

నమస్తే తెలంగాణ క్రీడావిభాగం:  కరోనా వైరస్‌ విజృంభణతో అసలు ఈ ఏడాది ఐపీఎల్‌ జరుగుతుందో లేదో అనే అనుమానాలను దాటుకుంటూ సీజన్‌లో ఇప్పటికే 10 మ్యాచ్‌లు ముగిశాయి. అన్ని జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడేశాయి. అంబటి రాయుడుతో మొదలైన మోత ఇషాన్‌ కిషన్‌ వరకు ఆగకుండా సాగుతున్నది. ఈ సీజన్‌లో సగటు భారతీయులు ఆనందించాల్సిన విషయాల గురించి ఓ సారి చర్చించుకుంటే.. లీగ్‌లో ఇప్పటి వరకు నమోదైన రెండు సెంచరీలు టీమ్‌ఇండియా ఆటగాళ్ల బ్యాట్లనుంచే జాలువారగా.. అత్యధిక పరుగుల జాబితా టాప్‌-5లో ముగ్గురు మనవాళ్లే ఉన్నారు. లోకేశ్‌ రాహుల్‌ (222), మయాంక్‌ అగర్వాల్‌ (221) పోటీపడి పరుగులు సాధిస్తుంటే.. నేనేం తక్కువా అన్నట్లు సంజూ శాంసన్‌ (159) దూసుకొస్తున్నాడు. 

సిక్సర్లలోనూ మనమే..

పట్టుమని పది మ్యాచ్‌లు (హైదరాబాద్‌ మ్యాచ్‌కు ముందు వరకు) ముగియకముందే బౌండ్రీ మీటర్‌పై 153 సిక్సర్లు నమోదయ్యాయి. సాధారణంగా ఏ సీజన్‌ను తీసుకున్నా.. అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో విదేశీయులదే అగ్రస్థానం. కానీ ఈ సారి అందుకు భిన్నంగా తొలి ఆరు స్థానాల్లో మనవాళ్లే ఉన్నారు. శాంసన్‌ 16 సిక్సర్లతో టీమ్‌ఇండియా బెర్త్‌కు సవాల్‌ విసురుతుంటే.. తాజాగా ఇషాన్‌ కిషన్‌, రాహుల్‌ తెవాటియా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. 

గ్రౌండ్‌ ఎంతున్నా..

మనదేశంతో పోల్చుకుంటే.. ప్రస్తుతం ఐపీఎల్‌ జరుగుతున్న యూఏఈలో మైదానాలు పెద్దవి. బెంగళూరు  చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్‌గా వెళ్లిన బంతి.. అబుదాబిలో నేరుగా ఫీల్డర్‌ చేతిలోనే పడుతుంది. అయినా మనవాళ్లు సిక్సర్ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై రికార్డు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తెవాటియా కొట్టిన రెండు సిక్సర్లు గ్రౌండ్‌ బయట పడగా.. మయాంక్‌ ఇప్పటి వరకు మూడు బంతులను మైదానం బయటకు పంపాడు. 80 మీటర్లకు తగ్గని సిక్సర్లతో యువ ఆటగాళ్లు తమలోనూ పించ్‌హిట్టర్లు ఉన్నారని నిరూపిస్తున్నారు. 


logo