శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Sep 21, 2020 , 01:43:00

బోణీ ఎవరిదో..నేడు హైదరాబాద్‌, బెంగళూరు మధ్య మ్యాచ్‌

బోణీ ఎవరిదో..నేడు హైదరాబాద్‌, బెంగళూరు మధ్య మ్యాచ్‌

దుబాయ్‌: ఐపీఎల్‌ 13వ సీజన్‌లో తొలిపోరుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్‌) సిద్ధమైంది. తొలి టైటిల్‌ కోసం కసితో ఉన్న విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)ను ఇక్కడి దుబాయ్‌ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సోమవారం ఎస్‌ఆర్‌హెచ్‌ ఢీకొననుంది.  2016లో జట్టుకు తొలి టైటిల్‌ అందించిన ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ రెండేండ్ల తర్వాత మళ్లీ సారథ్యపగ్గాలు చేపట్టగా.. జానీ బెయిర్‌స్టో, కేన్‌ విలియమ్సన్‌, మనీశ్‌ పాండే, మిచెల్‌ మార్ష్‌లతో హైదరాబాద్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా ఉంది. ఇటీవల సీపీఎల్‌లో అదరగొట్టిన ఆప్ఘనిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌, ఆల్‌రౌండర్‌ మహమ్మద్‌ నబీ, భారత సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌తో ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్‌ వైవిధ్యంగా ఉంది.  మరోవైపు గతేడాది పాయింట్ల పట్టికలో చివర్లో నిలిచిన బెంగళూరు శుభారంభం చేయాలని పట్టుదలతో ఉంది. స్టార్‌ ప్లేయర్లు  కెప్టెన్‌ కోహ్లీ, డివిలియర్స్‌కు ఫించ్‌, మోరిస్‌ తోడవడంతో మరింత బలోపేతమైంది. భారత స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌, సుందర్‌, మొయిన్‌ అలీ, ఆడమ్‌ జంపా రూపంలో కోహ్లీకి అనేక స్పిన్‌ ఆప్షన్లు ఉన్నాయి. కాగా దుబాయ్‌ పిచ్‌  బౌ లర్లకు అనుకూలించే అవకాశం ఉంది.   

నేటి మ్యాచ్‌

 హైదరాబాద్‌ X బెంగళూరు

రాత్రి 7.30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో..