సోమవారం 06 జూలై 2020
Sports - May 02, 2020 , 01:37:59

చేజారింది

చేజారింది

టెస్టుల్లో నంబర్‌వన్‌ ర్యాంకు  కోల్పోయిన భారత్‌

దుబాయ్: సంప్రదాయ ఫార్మాట్‌లో భారత్‌ నంబర్‌వన్‌ ర్యాంకును కోల్పోయింది. అక్టోబర్‌ 2016 నుంచి 42 నెలలు టెస్టుల్లో అగ్రస్థానం లో కొనసాగిన కోహ్లీసేన ఒకేసారి మూడో ర్యాంకుకు పడిపోయింది. ప్రస్తుతం మ్యాచ్‌లేమీ జరుగకున్నా నిబంధనల ప్రకారం 2016-17 మధ్య జరిగిన మ్యాచ్‌లను మినహాయించి ఐసీసీ తాజా టీమ్‌  ర్యాంకింగ్స్‌ను శుక్రవారం విడుదల చేసింది. ఈ ఏడాది మొదట్లో న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్‌ క్లీన్‌స్వీప్‌నకు గురైంది. అలాగే 12టెస్టు విజయాలు సాధించిన 2016-17 సీజన్‌లోని ఫలితాలను మినహాయించడంతో కోహ్లీసేన మరింత వెనుకబడి, టెస్టు గదను కోల్పోయింది. ఆస్ట్రేలియా..టెస్టుల్లో మరోసారి అగ్రస్థానానికి చేరింది. టాప్‌ ర్యాంకుకు ఎగబాకిన ఆస్ట్రేలియా(116 రేటింగ్‌ పాయింట్లు), రెండో ర్యాంకుకు వచ్చిన న్యూజిలాండ్‌ (115), మూడో ర్యాంకుకు పడిన భారత్‌ (114) మధ్య ఒక్కో పాయింట్‌ మాత్రమే అంతరం ఉండడం విశేషం. టెస్టుల్లోనే కాదు టీ20 ల్లోనూ ఆస్ట్రేలియా(278) టాప్‌ ర్యాంకు దక్కించుకుంది. పొట్టి ఫార్మాట్‌లో ఆసీస్‌ తొలిసారి నంబర్‌వన్‌ స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్‌(268),భారత్‌(266)రెండు, మూడు ర్యాంక్‌ల్లో ఉన్నాయి. 


logo