సోమవారం 30 మార్చి 2020
Sports - Mar 24, 2020 , 00:19:30

విశ్వక్రీడలు వాయిదా!

విశ్వక్రీడలు వాయిదా!

  • నాలుగు వారాల్లో ఐవోసీ తుది నిర్ణయం 
  • ఒలింపిక్స్‌ను బహిష్కరించిన కెనడా, ఆస్ట్రేలియా 
  • అథ్లెట్లను పంపకూడదని నిర్ణయం.. ఏడాది వాయిదా వేయాలని డిమాండ్‌
  • టోక్యో ఒలింపిక్స్‌పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. కరోనా కరాళనృత్యంతో ప్రపంచమంతా గజగజ వణుకుతున్న వేళ..
  • విశ్వక్రీడలు వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తున్నది. కొవిడ్‌-19 వైరస్‌ నానాటికీ తీవ్రరూపం దాలుస్తుండటంతో ఆయా దేశాల

 క్రీడాసంఘాలతో పాటు అథ్లెట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి ఒలింపిక్స్‌లో పాల్గొనలేమంటూ గళాలు లేవనెత్తుతున్నారు. తమ ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న కెనడా ఓ అడుగు ముందుకేసి టోక్యో ఒలింపిక్స్‌లో తాము పాల్గొనడం లేదంటూ ప్రకటించింది. కెనడా నిర్ణయంతో పలు దేశాలు పునరాలోచనలో పడ్డాయి. ఆస్ట్రేలియా కూడా తమ అథ్లెట్లను వచ్చే ఏడాది కోసం సిద్ధమవ్వాలంటూ సూచించడం కరోనా పభావం ఎంతలా ఉందో తెలుపుతున్నది. జపాన్‌ ప్రధాని షింజో అబె..ఒలింపిక్స్‌ వాయిదా తప్పదనేలా వ్యాఖ్యలు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఇక ఇంతకాలం షెడ్యూల్‌ ప్రకారం విశ్వక్రీడలను నిర్వహిస్తామన్న అంతర్జాతీయ ఒలింపిక్‌ సమాఖ్య(ఐవోసీ) అందరి ఒత్తిడితో మెత్తబడింది. నాలుగు వారాల్లో తుది నిర్ణయం తీసుకుంటామని, వాయిదా గురించే తప్ప రద్దు అవకాశం లేదని తేల్చిచెప్పింది. 

టోక్యో: ఈ ఏడాది జూలైలో ప్రారంభం కావాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా దిశగా పయనిస్తున్నది. కరోనా వైరస్‌(కొవిడ్‌-19) మహమ్మారి విజృంభిస్తున్నందున విశ్వక్రీడలను వాయిదా వేయాలని ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు క్రీడా సంఘాలు కోరుతుండగా.. ఒలింపిక్స్‌లో పాల్గొనకూడదని కెనడా సోమవారం నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభం కారణంగా తమ అథ్లెట్లను విశ్వక్రీడలకు పంపలేమని స్పష్టం చేసింది. ఏడాది పాటు వాయిదా వేయాలని కూడా అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐవోసీ)ని కోరింది. 2021 కోసం సిద్ధమవ్వాలని అథ్లెట్లుకు ఆస్ట్రేలియా ఒలింపిక్స్‌ కమిటీ(ఏవోసీ) సూచించించి. ఈ నేపథ్యంలో అన్ని సభ్య దేశాలు, క్రీడా సమాఖ్యలు, ప్రసారదారులు, స్పాన్సర్లతో మాట్లాడి రానున్న 4వారాల్లోగా తుది నిర్ణయం తీసుకోనున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐవోసీ) ప్రకటించింది. 

అథ్లెట్లను పంపలేం: కెనడా

కరోనా వైరస్‌ విజృంభిస్తున్నందున ఒలింపిక్స్‌తో పాటు పారాలింపిక్స్‌కు అథ్లెట్లను పంపడం కష్టతరమని కెనడా ఒలింపిక్‌ కమిటీ(సీవోసీ) వెల్లడించింది. అందుకే షెడ్యూల్‌ ప్రకారం విశ్వక్రీడలు నిర్వహిస్తే దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిపింది. అలాగే, ఒలింపిక్స్‌ను ఏడాది పాటు వాయిదా వేయాలని ఐవోసీని కోరింది. ‘కరోనా వైరస్‌ సంక్షోభం మా అథ్లెట్లకు సురక్షితం కాదు. వారు శిక్షణ కొనసాగించడం అథ్లెట్ల ఆరోగ్యంతో పాటు వారి  కుటుంబాలకు, కెనడా ప్రజలకు ప్రమాదమే’ అని సీవోసీ చెప్పింది. 

2021కి సిద్ధమవండి: ఆస్ట్రేలియా

జూలైలో ఒలింపిక్స్‌ ప్రారంభమయ్యే పరిస్థితి లేదని, అందుకే వచ్చే ఏడాది కోసం సన్నద్ధమవ్వాలని అథ్లెట్లకు ఆస్ట్రేలియా ఒలింపిక్‌ కమిటీ(ఏవోసీ) సూచించింది. ‘క్రీడలు జూలైలో నిర్వహించే పరిస్థితి లేదని స్పష్టమవుతున్నది. మా అథ్లెట్లు సానుకూల దృక్పథంతో శిక్షణ తీసుకుంటున్నారు.  కానీ కరోనా వల్ల ఒత్తిడి అనిశ్చితితో కూడిన పరిస్థితులు వారికి సవాల్‌గా మారాయి. దేశంలోనూ విదేశాల్లోనూ ఎక్కువ మంది ఒకే చోటికి చేరే పరిస్థితి లేదు. అందుకే వచ్చే ఏడాది కోసం సన్నద్ధమవ్వాలని అథ్లెట్లకు సూచించాం’ అని ఏవోసీ చీఫ్‌ ఇయాన్‌ చెస్టర్‌మాన్‌ చెప్పాడు. 

ఐవోసీది మొండి వైఖరి : కాలమ్‌ స్కిన్నర్‌

కరోనా తీవ్రస్థాయిలో కోరలు చాస్తున్నా.. తుది నిర్ణయానికి మరో నాలుగు వారాలు అవసరమన్న ఐవోసీ ప్రకటనపై బ్రిటన్‌ ట్రాక్‌ సైక్లిస్ట్‌ కాలమ్‌ స్కిన్నర్‌ మండిపడ్డాడు. ఐవోసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ మొండిగా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శించాడు. ‘ఐవోసీ అధ్యక్షుడు థామస్‌బాచ్‌ ఒలింపిక్స్‌ను బలహీనపరిచేందుకు మొండిగా వ్యవహరిస్తున్నారు. తన అభిప్రాయాలను ఆయన అథ్లెట్లకు ఆపాదించడం ఇది మొదటిసారి కాదు.  ఎలాగు ఒలింపిక్స్‌ వాయిదా పడడం ఖాయం గా కనిపిస్తున్నది’ అని స్కిన్నర్‌ ట్వీట్‌ చేశాడు. 2016 ఒలింపిక్స్‌లో స్కిన్నర్‌ స్వర్ణంతో పాటు ఓ రజతాన్ని చేజిక్కించుకున్నాడు. 

 

ఆలస్యం.. అనివార్యం కావొచ్చు

కరోనా వైరస్‌ తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా అనివార్యం కావొచ్చని జపాన్‌ ప్రధాని షింజో అబే చెప్పారు. సోమవారం జపాన్‌ పార్లమెంట్‌లో విశ్వక్రీడల నిర్వహణపై ఆయన మాట్లాడారు. ‘ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు జపాన్‌ పూర్తి నిబద్ధతతో ఉంది. కానీ, ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే ఆలస్యంగా నిర్వహించడం అనివార్యమవుతుంది. అందుకే వాయిదా వేయాల్సిన నిర్ణయం తీసుకోవాల్సి రావొచ్చు. అయితే రద్దు చేయడం ఆప్షనే కాదు’ అని అబే చెప్పారు. 


వాయిదాపై ఆలోచన.. రద్దు సమస్యే లేదు

షెడ్యూల్‌ ప్రకారమే ఒలింపిక్స్‌ను నిర్వహిస్తామని ఇంతకాలం చెబుతూ వస్తున్న అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐవోసీ).. నలువైపులా ఒత్తిడి పెరుగడంతో వాయిదా కూడా ఒక ఆప్షన్‌గా పరిశీలిస్తున్నామని సోమవారం ప్రకటించింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒలింపిక్స్‌ను రద్దు చేసే ఆలోచనే లేదని స్పష్టం చేసింది. ఒలింపిక్స్‌ నిర్వహణపై నాలుగు వారాల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ఐవోసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌.. ఓ లేఖ ద్వారా అథ్లెట్లకు సోమవారం తెలియజేశారు. సభ్యదేశాలు, జపాన్‌ ప్రభుత్వం, అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల అధికారులు, బ్రాడ్‌కాస్టర్లు, స్పాన్సర్లతో చర్చించి ఈ నాలుగు వారాల్లో ఏదో ఒక నిర్ణయానికి రావాలని ఐవోసీ భావిస్తున్నది. మరోవైపు ఒలింపిక్స్‌ను వాయిదా వేయాల్సిందేనని అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ చీఫ్‌ సెబాస్టియన్‌ కోయ్‌.. ఐవోసీకి మరోసారి సూచించాడు. అలాగే, కరోనా ప్రభావం ముగిసే వరకు ఒలింపిక్స్‌ను నిర్వహించవద్దని అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్‌)సైతం విన్నవించింది. కరోనా నేపథ్యంలో స్వదేశంలో ఒలింపిక్స్‌ జరగకూడదని జపాన్‌లో అధిక శాతం ప్రజలు కోరుకుంటున్నారని తాజాగా మరో సర్వే తేల్చింది. 


logo