గురువారం 09 ఏప్రిల్ 2020
Sports - Feb 09, 2020 , 22:42:59

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌: జైశ్వాల్‌ ఒంటరి పోరాటం..భారత్‌ 177 ఆలౌట్‌

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌: జైశ్వాల్‌ ఒంటరి పోరాటం..భారత్‌ 177 ఆలౌట్‌

బంగ్లా బౌలర్ల ధాటికి భారత్‌ 47.2 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది.

పోచెఫ్‌స్ట్రూమ్‌: అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో యువ సంచలనం యశస్వి జైశ్వాల్‌ మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు.  క్లిష్టపరిస్థితుల్లో అద్వితీయ ఆటతో మరోసారి ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్‌తో ఫైనల్‌ పోరులో యశస్వి(88: 121 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్స్‌) అర్ధశతకంతో రాణించడంతో యువ భారత్‌ మెరుగైన స్కోరు చేసింది. ఆరంభంలో తిలక్‌వర్మ(38: 65 బంతుల్లో 3ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. బంగ్లా బౌలర్ల ధాటికి  భారత్‌ 47.2 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది.  

ఆఖర్లో ధ్రేవ్‌ జురేల్‌(22) అనూహ్యంగా రనౌట్‌ కావడంతో భారత్‌ మంచి స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయింది.  ఈ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లు, ఫీల్డర్లు సంచలన ఆటతీరుతో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి ఆఖరి వరకు  బౌలర్లు క్రమశిక్షణతో  బంతులేసి టీమ్‌ఇండియా స్కోరు వేగానికి కళ్లెం వేశారు. బంగ్లా బౌలర్లలో అవిషేక్‌ దాస్‌(3/40), ఇస్లాం(2/31), హసన్‌ షకీబ్‌(2/28) భారత్‌ను భారీ దెబ్బకొట్టారు.   

మెగా టోర్నీలో విశేషంగా రాణించిన జైశ్వాల్‌ బంగ్లాదేశ్‌తో ఫైనల్‌ పోరులోనూ ఆకట్టుకున్నాడు.  ప్రత్యర్థి బౌలర్ల నుంచి సవాల్‌  ఎదురైనా  సంయమనంతో బ్యాటింగ్‌ చేశాడు. జట్టు స్కోరు 9 వద్ద దివ్యాంశ్‌ వెనుదిరగడంతో కుదురుకునేందుకు ఎక్కువ సమయం తీసుకుంది.  నిలకడగా ఆడిన యశస్వి  89 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకొన్న తర్వాత చెలరేగాడు.   జైశ్వాల్‌, తిలక్‌వర్మ భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ జోడీ 50కి పైగా విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. స్కోరు బోర్డు పరుగులు పెడుతున్న సమయంలో తిలక్‌వర్మ వెనుదిరిగాడు.  ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ ప్రియం గార్గ్‌(7) అలా వచ్చి ఇలా వెళ్లాడు. 

 బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న జైశ్వాల్‌.. ఇస్లాం బౌలింగ్‌లో వెనుదిరగడంతో భారత్‌ టపటపా వికెట్లు చేజార్చుకుంది. బంగ్లా బౌలర్ల ఎదురుదాడికి బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. బంగ్లా కుర్రాళ్లు కళ్లుచెదిరే ఫీల్డింగ్‌తో మైమరిపించారు.   ప్రస్తుత అండర్‌-19 వరల్డ్‌కప్‌లోనే జైశ్వాల్‌ 133 సగటుతో 400 పరుగులను సాధించడం విశేషం.  అందులో నాలుగు అర్ధశతకాలు, ఒక శతకం ఉన్నాయి. logo