శనివారం 28 మార్చి 2020
Sports - Feb 04, 2020 , 04:14:25

కివీస్‌ టూర్‌కు రోహిత్‌ దూరం!

కివీస్‌ టూర్‌కు రోహిత్‌ దూరం!
  • గాయంతో వన్డే, టెస్టు సిరీస్‌ల నుంచి ఔట్‌

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌ పర్యటనలో వరుస విజయాలతో జోరుమీదున్న టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఫుల్‌ ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ రోహిత్‌ శర్మ వన్డే, టెస్టు సిరీస్‌లకు దూరమయ్యాడు. టీ20 సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో కాలి పిక్క కండరాలు పట్టేయడంతో రిటర్డ్‌హర్ట్‌గా మైదానం వీడిన హిట్‌మ్యాన్‌ ఆ తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌కే పరిమితమయ్యాడు. మ్యాచ్‌ అనంతరం లోకేశ్‌ రాహుల్‌ మాట్లాడుతూ.. రెండు మూడు రోజుల్లో రోహిత్‌ కోలుకుంటాడని చెప్పినా.. నొప్పి తగ్గకపోవడంతో ఏకంగా పర్యటనకే దూరమయ్యాడు. ‘న్యూజిలాండ్‌ పర్యటన నుంచి అతడు (రోహిత్‌) నిష్క్రమించాడు. ప్రస్తుత పరిస్థితి అంత బాగోలేదు. ఫిజియో పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. 


త్వరలోనే పూర్తి సమాచారం తెలుస్తుంది. అయితే తదుపరి సిరీస్‌లో రోహిత్‌ పాల్గొనడం మాత్రం కుదరదు’ అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య బుధవారం తొలి వన్డే జరుగనున్న నేపథ్యంలో వైస్‌ కెప్టెన్‌ గాయం జట్టును కలవరపెడుతున్నది. ప్రస్తుతానికి అధికారిక సమాచారం లేకున్నా.. వన్డేల్లో అతడి స్థానాన్ని మయాంక్‌ అగర్వాల్‌, టెస్టుల్లో శుభ్‌మన్‌ గిల్‌ భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రెగ్యులర్‌ ఓపెనర్లు రోహిత్‌, ధవన్‌ గాయాల పాలవడంతో రాహుల్‌, పృథ్వీ షా వన్డే సిరీస్‌లో బ్యాటింగ్‌ దాడిని ఆరంభించనున్నారు. మయాంక్‌ అదనపు ఓపెనర్‌గా రిజర్వ్‌లో ఉంటాడు. స్వదేశంలో జరిగిన గత రెండు టెస్టు సిరీస్‌ (దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో)లకు రిజర్వ్‌ ఓపెనర్‌గా కొనసాగిన శుభ్‌మన్‌ గిల్‌.. తాజాగా కివీస్‌ టూర్‌లో భారత్‌-ఏ తరఫున ద్విశతకంతో అదరగొట్టాడు. దీంతో సంప్రదాయ ఫార్మాట్‌లో అతడి చోటుకు ఢోకా లేనట్లే. 


logo