సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Jan 12, 2020 , 02:27:56

శభాష్‌ నందిని

శభాష్‌ నందిని

పేదరికం ముందరి కాళ్లకు బంధం వేస్తున్నా.. ఉన్నత లక్ష్యాల ముందు కష్టాలు పెద్ద విషయం కాదనుకున్న పదహారేండ్ల యువ అథ్లెట్‌.. కాలే కడుపుతోనే పరుగందుకుంది. పొట్టకూటి కోసం నగరానికి వలస వచ్చిన తండ్రికి.. తన ప్రతిభతో సత్కారాలు అందించాలనుకున్న ఆ యువ కెరటం.. ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో స్వర్ణ పతకంతో మెరిసింది. ఇప్పటికే హెప్టాథ్లాన్‌లో జాతీయ రికార్డు నెలకొల్పిన ఈ నయా సంచలనం.. ప్రస్తుతం లాంగ్‌జంప్‌లో 5.65 మీటర్ల దూరం దునికి పసిడి పతకం నెగ్గింది. 100 మీటర్ల హర్డిల్స్‌లోనూ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆ యువ కెరటమే.. అగసర నందిని. ఆమె విజయం వెనుక ఉన్న కష్ట నష్టాలను ఓ సారి పరికించి చూస్తే..

  • ఖేలో ఇండియా గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన తెలంగాణ అథ్లెట్‌..
  • లాంగ్‌ జంప్‌లో 5.65 మీ. లంఘించి పసిడి కైవసం

నమస్తే తెలంగాణ క్రీడా విభాగం: బతుకుదెరువు కోసం పొట్ట చేతబట్టుకొని పదిహేనేండ్ల క్రితం నగరానికి వచ్చిన ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన నందిని.. పరుగే ప్రాణంగా ముందుకు సాగుతున్నది. జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవడమే లక్ష్యంగా క్రీడారంగం వైపు అడుగులు వేసిన ఈ యువ కెరటం.. అనతి కాలంలోనే మంచి గుర్తింపు సాధించింది. మంగళూరు వేదికగా జరిగిన సౌత్‌జోన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌సిప్‌ హెప్టాథ్లాన్‌లో 5046 పాయింట్లతో సరికొత్త రికార్డు సృష్టిస్తూ.. స్వర్ణం చేజిక్కించుకున్న నందిని.. ఫెడరేషన్‌ కప్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో అదే ఫలితాన్ని రిపీట్‌ చేసింది. దీంతో పాటు జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించి ఔరా అనిపించింది. తాజాగా ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లోనూ ఇదే జోరు కొనసాగించి స్వర్ణం చేజిక్కించుకుంది.

ట్రాక్‌ రికార్డ్‌

పూర్తి పేరు: అగసర నందిని

తండ్రి పేరు: యెల్లప్ప

తల్లి పేరు: ఆయమ్మ

నివాసం: చంద్రపురి కాలనీ


పతక ప్రదర్శన:

  • కర్ణాటకలో జరిగిన 31వ సౌత్‌జోన్‌ జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ హెప్టాథ్లాన్‌లో స్వర్ణ పతకం. 5046 పాయింట్లతో సరికొత్త మీట్‌ రికార్డు

  • 100మీటర్ల హర్డిల్స్‌లో 15.15 సెకన్ల టైమింగ్‌తోరజత పతకం

  • తమిళనాడులో గతేడాది జరిగిన 17వ ఫెడరేషన్‌ కప్‌ జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ హెప్టాథ్లాన్‌లో స్వర్ణ పతకం (4800 పాయింట్లు)

  • గుంటూరులో 2019లో జరిగిన 35వ జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ 100 మీటర్ల హార్డిల్స్‌లో రజత పతకం (14.47సెకన్లు)

  • పంజాబ్‌లో గతేడాది జరిగిన 65వ జాతీయ స్కూల్‌ గేమ్స్‌ అథ్లెటిక్స్‌ అండర్‌-17 విభాగం 100 మీటర్ల హార్డిల్స్‌లో కాంస్య పతకం (14.87సెకన్లు)

నందినిలో సహజసిద్ధంగా మంచి అథ్లెట్‌ లక్షణాలు ఉన్నాయి. పెద్ద టోర్నీల్లో పతకాలు సాధించగల సత్తా ఆమె సొంతం. నందిని ఒక్కసారి ట్రాక్‌ ఎక్కి పరుగందుకుంటే పతకం విషయంలో నాకెలాంటి సందేహం ఉండ దు. భవిష్యత్తులో ఆమె అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్‌ గెలువగలదు.


బొల్లారం నుంచి గచ్చిబౌలికి..

కర్ణాటకలోని బళ్ల్లారికి చెందిన యెల్లప్ప, ఆయమ్మ దంపతులు పదిహేనేండ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చారు. తొలినాళ్లలో నగరంలోని ఫ్లైఓవర్‌ల కింద తలదాచుకున్న ఈ కుటుంబం.. ఆ తర్వాత యెల్లప్ప వాచ్‌మన్‌గా చేరడంతో కాప్రాలో నివాసం ఏర్పరుచుకుంది. తమ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా.. ఏనాడు కూతురు అభిరుచిని కాదనని యెల్లప్ప రోడ్డు పక్కన టీ స్టాల్‌ పెట్టుకొని ఆమెను అనుక్షణం ప్రోత్సహిస్తూ వచ్చాడు. తండ్రి కష్టాన్ని వృథాపోనివ్వని నందిని పాల్గొన్న ప్రతి పోటీలో రాణించింది. ఇది గుర్తించిన కేంద్రీయ విద్యాలయం(కేవీ) పీఈటీ ముత్తయ్య ఆమెను నాగరాజ్‌కు పరిచయం చేశాడు. నందినిలో మేటి అథ్లెట్‌కు ఉండాల్సిన శరీరాకృతిని గుర్తించిన ఆయన.. ద్రోణాచార్య అవార్డీ, జాతీయ అథ్లెటిక్స్‌ కోచ్‌ నాగపురి రమేశ్‌ దృష్టికి తీసుకెళ్లాడు. ఆమెలోని టాలెంట్‌ను గుర్తించేందుకు ఒకసారి పరిగెత్తి చూపెట్టమని చెప్పిన రమేశ్‌.. ఆమె పరుగు పూర్తి చేసేలోపే గచ్చిబౌలికి వచ్చేయమని సూచించాడు. మైత్ర సాయ్‌ గోపీచంద్‌ ఫౌండేషన్‌ సహాయంతో నాగపురి రమేశ్‌ ప్రత్యేక్ష శిక్షణలో మరింత రాటుదేలిన నందిని ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. టోర్నీ ఏదైనా బరిలో దిగడం విజేతగా నిలువడమే పనిగా పెట్టుకుంది.

ద్యుతీ, హిమా అడుగుజాడల్లో..

నార్సింగి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న 16 ఏండ్ల నందిని.. 100 మీటర్ల హర్డిల్స్‌ తన ప్రధాన లక్ష్యమంటూనే.. హెప్లాథ్లాన్‌, పెంటాథ్లాన్‌లోనూ సత్తా చాటాలని చూస్తున్నది. రెండేండ్ల క్రితమే అసలు ట్రాక్‌ ఎక్కిన నందిని.. ద్యుతీచంద్‌, హిమాదాస్‌లను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్నది. అంతర్జాతీయ స్థాయిలో దేశం తరఫున పతకం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న నందిని.. భారత హెప్టాథ్లాన్‌ అథ్లెట్‌ స్వప్నా బర్మన్‌ను మరిపించే ప్రదర్శన చేయాలని భావిస్తున్నది. సరైన ప్రోత్సాహం అందితే అంతర్జాతీయ స్థాయిలో మెరుపులు మెరిపిస్తానంటున్న నందిని భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆశిద్దాం.


గువాహటి: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌-2020లో తెలంగాణకు తొలి స్వర్ణ పతకం దక్కింది. అండర్‌-17 బాలికల లాంగ్‌ జంప్‌లో అద్వితీయ ప్రదర్శన కనబర్చిన పదహారేండ్ల అగసర నందిని మన రాష్ర్టానికి మొదటి పసిడి పతకాన్ని అందించింది. శనివారం జరిగిన పోటీల్లో ఐదో ప్రయత్నంలో 5.65 మీటర్ల దూరం లంఘించిన నందిని టాప్‌లో నిలిచింది. నిర్మ అసారి (5.62 మీటర్లు, గుజరాత్‌), అభిరామి బాలకృష్ణ (5.47 మీటర్లు, కేరళ) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. 100 మీటర్ల హర్డిల్స్‌ హీట్స్‌లో 14.28 సెకన్లతో అగ్రస్థానంలో నిలిచి తుదిపోరుకు అర్హత సాధించిన నందిని మరో స్వర్ణంపై గురిపెట్టింది.

స్నేహిత్‌ జోరు

పోటీలకు రెండో రోజైన శనివారం తెలంగాణకు తొలి స్వర్ణం దక్కగా, మిగతా విభాగాల్లో మన వాళ్లు సత్తాచాటారు. అండర్‌-21 బాలుర కబడ్డీ లీగ్‌ మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 25-64 తేడాతో హర్యానా చేతిలో ఓటమిపాలైంది. హర్యానాకు దీటైన పోటీనివ్వడంలో విఫలమైన తెలంగాణ పరాజయం చవిచూసింది. జూడో అండర్‌-17 బాలుర 60కిలోల విభాగంలో రాష్ర్టానికి చెందిన దేవేందర్‌ శ్రీరామ్‌..ప్రిన్స్‌ చేతిలో ఓడి నిష్క్రమించాడు. టేబుల్‌ టెన్నిస్‌లో తెలంగాణ యువ ఆటగాడు ఫిడేల్‌ ఆర్‌ స్నేహిత్‌ శుభారంభం చేశాడు. అండర్‌-21 కేటగిరీలో స్నేహిత్‌ 11-7, 11-6, 11-6తో శుభమ్‌ అంబె(మహారాష్ట్ర)పై అలవోక విజయం సాధించాడు. అదే జోరు కొనసాగిస్తూ రెండో రౌండ్‌లో స్నేహిత్‌ 11-5, 11-6, 11-8తో హరీశ్‌ కుమార్‌ను వరుస గేముల్లో చిత్తుగా ఓడించాడు. ఇక బాలికల 100మీటర్ల హర్డిల్స్‌లో నందినితో పాటు చిదరబోయిన పద్మ ఫైనల్లోకి ప్రవేశించింది. హీట్స్‌లో రేసును నందిని 14.28 సెకన్లలో పూర్తి చేస్తే.. పద్మకు 14.80సెకన్లు పట్టింది.

తల్లిదండ్రులతో నందిని

ఈ పతకం మానాన్న, కోచ్‌ (రమేశ్‌, నాగరాజ్‌)లకు అంకితమిస్తున్నా. వీరంతా నా వెన్నంటి నిలువకుంటే ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదు. నా విజయంలో తెలంగాణ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సార్‌ పాత్ర కీలకం. మా అమ్మానాన్నలు నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. పైసా పైసా కూడబెట్టి నన్ను పోటీలకు పంపారు. ఎన్నో సార్లు కాళ్లకు షూస్‌ లేకుండా, ఖాళీ కడుపుతో పరుగు పెట్టాను. దేశం కోసం పతకం గెలువాలనేది మా నాన్న కల. దాన్ని సాకారం చేసేందుకు ఎంతైనా కష్టపడుతా. ఆసియా గేమ్స్‌ వంటి ప్రతిష్ఠాత్మక క్రీడల్లో దేశం తరఫున పతకం నెగ్గడమే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం.

- అగసర నందిని-నాగపురి రమేశ్‌


logo