శనివారం 04 జూలై 2020
Sports - May 09, 2020 , 23:48:33

లార్డ్స్‌లో భారత్‌ సింహనాదం

లార్డ్స్‌లో భారత్‌ సింహనాదం

  • 2002 నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్‌లో అద్భుత విజయం 
  • కైఫ్‌, యువీ అద్వితీయ పోరాటం

2002లో ఇంగ్లండ్‌ గడ్డపై జరిగిన నాట్‌వెస్ట్‌ వన్డే సిరీస్‌ గెలుపు భారత క్రికెట్‌ చరిత్రలో ఒకానొక అద్వితీయ విజయం. క్రికెట్‌మక్కా లార్డ్స్‌  మైదానం వేదికగా ఆతిథ్య జట్టుతో జరిగిన ఆ ముక్కోణపు సిరీస్‌ ఫైనల్లో గంగూలీ సేన ప్రదర్శన అద్భుతం. భారీ లక్ష్యఛేదనలో జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో అప్పటి యువ బ్యాట్స్‌మెన్‌ కైఫ్‌, యువరాజ్‌ సింగ్‌  చేసిన పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే. తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన తుదిపోరులో భారత్‌ విజయం సాధించాక సారథి సౌరవ్‌ చొక్కావిప్పి లార్డ్స్‌  మైదానం బాల్కనీలో చేసుకున్న సంబురాలు ఎప్పటికీ మరిచిపోలేనివి.

2002 జూన్‌-జూలై మధ్య జరిగిన ముక్కోణపు సిరీస్‌లో శ్రీలంక నిష్క్రమించగా.. భారత్‌, ఆతిథ్య ఇంగ్లండ్‌ ఫైనల్‌ చేరాయి. స్వదేశం.. అం దునా లార్డ్స్‌  మైదానం కావడంతో ఇంగ్లిష్‌  జట్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. టాస్‌  కూ డా ఆతిథ్య జట్టువైపే మొగ్గుచూపడంతో కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. మార్కస్‌ ట్రెస్కోతిక్‌(100 బంతుల్లో 109పరుగులు), నాసిర్‌ హుస్సేన్‌ (128 బంతుల్లో 115 పరుగులు) శతకాలతో మెరువడంతో  ఇంగ్లండ్‌  ఐదు వికెట్లు కోల్పోయి 325పరుగుల భారీ స్కోరు చేసింది. భారత బౌలర్లలో జహీర్‌ ఖాన్‌ మూడు, నెహ్రా, కుంబ్లే చెరో వికెట్‌ పడగొట్టారు.

దాదా విశ్వరూపం

326పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన భారత్‌కు ఓపెనర్లు సౌరవ్‌ గంగూలీ(43 బంతుల్లో 60 పరుగులు; 10ఫోర్లు, ఓ సిక్స్‌), వీరేంద్ర సెహ్వా గ్‌(49 బంతుల్లో 45పరుగులు; 7ఫోర్లు) శుభారంభాన్నిచ్చారు. ముఖ్యంగా దాదా చెలరేగి  డారిన్‌ గాఫ్‌, అలెక్స్‌ ట్యూడర్‌, ఫ్లింటాఫ్‌లతో కూడిన ఇంగ్లండ్‌ బౌలింగ్‌ దళానికి చెమటలు పట్టించాడు.  మొత్తంగా గంగూలీ 35 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. భారత్‌ 80 బంతుల్లోనే వందమార్కు దాటేసింది. అయితే 15వ ఓవర్లో దాదా ఔట్‌ కాగా, ఆ తర్వాతి ఓవర్లో సెహ్వాగ్‌ పెవిలియన్‌ బాటపట్టాడు. అనంతరం దినేశ్‌ మోంగియా(9), రాహుల్‌ ద్రవిడ్‌(5), సచి న్‌ టెండూల్కర్‌(14) వెంటవెంటనే ఔటవడంతో భారత్‌ 146 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఇక విజయం కష్టసాధ్యమన్న స్థితికి చేరింది. 

కైఫ్‌, యువరాజ్‌ అద్భుత పోరాటం 

జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో అప్పటి యువ ఆటగాళ్లు మహమ్మద్‌ కైఫ్‌(75 బంతుల్లో 87పరుగులు నాటౌట్‌; 6ఫోర్లు, 2సిక్స్‌లు, యువరాజ్‌ (63బంతుల్లో 69; 9ఫోర్లు, ఓ సిక్స్‌) అద్భుత పోరాటం చేసి ఆరో వికెట్‌కు 121 పరుగులు జోడించారు. కండ్ల ముందు భారీ లక్ష్యమున్నా బెదరలేదు. దూకుడుగా ఆడడంతో పాటు వికెట్ల మధ్య అద్భుతంగా పరుగెత్తారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. కాలింగ్‌వుడ్‌ బౌలింగ్‌లో యువీ ఔటయ్యాడు. ఆ తర్వాత కైఫ్‌, హర్భజన్‌(15) చెరో సిక్సర్‌ బాదడంతో భారత్‌ స్కోరు 300 దాటింది. అయితే భజ్జీ, కుంబ్లే(0) వెంటవెంటనే ఔటవడంతో మ్యాచ్‌ మళ్లీ ఉత్కంఠగా మారింది. 12 బంతుల్లో 11 పరుగులు చేయాల్సి వచ్చింది. 49ఓవర్లో కైఫ్‌ ఓ ఫోర్‌  బాదడంతో మొత్తం తొమ్మిది పరుగులు వచ్చాయి.  చివరి ఓవర్‌కు రెండు పరుగులే మిగిలినా.. జహీర్‌ తొలి రెండు బంతులకు పరుగు చేయలేకపోయాడు. అయితే మూడో బంతికి కవర్స్‌ దిశగా జహీర్‌ షాట్‌ ఆడ గా.. సింగిల్‌ కోసం పరుగెత్తారు. అయితే ఇంగ్లండ్‌ ఫీల్డర్‌ ఓవర్‌ త్రో వేయడంతో కైఫ్‌, జహీర్‌ రెండో పరుగును కూడా పూర్తి చేయడంతో భారత్‌  గెలుపు సంబురాల్లో మునిగిపోయింది. లార్డ్స్‌ బాల్కనీలో గంగూలీ చొక్కావిప్పగా, భారత ఆటగాళ్లు సింహనాదం చేశారు.  logo