సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Mar 07, 2020 , 02:06:28

హ్యాట్సాఫ్‌ హార్దిక్‌

హ్యాట్సాఫ్‌ హార్దిక్‌

ఆకలిగొన్న సింహానికి జింకపిల్ల దొరికినట్లు.. పది రోజుల నుండి పస్తులున్నవాడికి విందు భోజనం లభించినట్లు.. టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య డీవై పాటిల్‌ టీ20 కప్‌లో విరుచుకుపడ్డాడు. చుక్కలనంటే సిక్సర్లతో సునామీ సృష్టిస్తూ 55 బంతుల్లోనే 158 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

  • 20 సిక్సర్లతో పాండ్య సునామీ
  • డీవై పాటిల్‌ టీ20 కప్‌
  • 55 బంతుల్లో 158 నాటౌట్‌

వీ ముంబై: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య వీరవిధ్వంసం సృష్టించాడు. గాయం నుంచి కోలుకొని జాతీయ జట్టులో పునరాగమనం చేసేందుకు తహతహలాడుతున్న పాండ్య డీవై పాటిల్‌ టీ20 కప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గత మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన హార్దిక్‌.. సెమీస్‌లో అంతకుమించి రెచ్చిపోయాడు. 6 ఫోర్లు, 20 సిక్సర్లతో 55 బంతుల్లోనే అజేయంగా 158 పరుగులు చేశాడు. పాండ్య విజృంభణతో  బీపీసీఎల్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో మొదట రిలయన్స్‌-1 జట్టు 4 వికెట్లకు 238 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో బీపీసీఎల్‌ 134 పరుగులకే ఆలౌటౌవడంతో పాండ్య జట్టు ఫైనల్‌ చేరింది. టోర్నీలో రెండు సెంచరీలతో అదరగొట్టిన హార్దిక్‌ ఫైనల్లో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరగడంతో రిలయన్స్‌ జట్టు  రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారమే  జరిగిన తుదిపోరులో రిలయన్స్‌-1 జట్టు 11 పరుగుల తేడాతో ఇండియన్‌ ఆయిల్‌  చేతిలో ఓటమి పాలైంది. శిఖర్‌ ధవన్‌ (69; 6 ఫోర్లు, 2 సిక్సర్లు)  రాణించినా ఫలితం లేకపోయింది. మొదట ఇండియన్‌ ఆయిల్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు  చేయగా.. లక్ష్యఛేదనలో  రిలయన్స్‌-1.. 183/7కే పరిమితమైంది. 


ఇటీవల ముగిసిన న్యూజిలాండ్‌ పర్యటనలో టీమ్‌ఇండియా వన్డే, టెస్టు సిరీస్‌ల్లో వైట్‌వాష్‌కు గురైన సమయంలో.. సగటు క్రీడాభిమానుల మదిలో మెదిలిన తొలి ప్రశ్న.. హార్దిక్‌ పాండ్య ఎక్కడా అని. ప్రత్యర్థి జట్టులో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జెమీసన్‌ బౌండ్రీలతో రెచ్చిపోతుంటే.. మన జట్టుకు సమతూకం తెచ్చే పాండ్యలాంటి ఆల్‌రౌండర్‌ లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపించింది. లోయర్‌ ఆర్డర్‌లో మెరుపులు మెరిపించడంతో పాటు.. బౌన్స్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ప్రత్యర్థిని బోల్తా కొట్టించడంలో దిట్ట అయిన హార్దిక్‌.. మొదట న్యూజిలాండ్‌ పర్యటనకు ఎంపికయ్యాడు. కానీ ఫిట్‌నెస్‌ టెస్టులో విఫలం కావడంతో అతడికి జట్టులో చోటు దక్కలేదు.


నాలుగు రోజుల్లో రెండు సెంచరీలు

వెన్నెముక గాయంతో ఇబ్బందిపడ్డ హార్దిక్‌.. శస్త్రచికిత్స అనంతరం మైదానంలో తిరిగి అడుగుపెట్టినప్పటి నుంచి వీరలెవల్లో విజృంభిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు జాతీయ జట్టులోకి  వద్దామా అన్న కసితో కనిపిస్తున్నాడు. డీవై పాటిల్‌ టీ20 కప్‌లో పాండ్య విధ్వంసం సునామీని మించిపోయిందనడంలో అతిశయోక్తిలేదు. లీగ్‌ దశలో ఆడిన తొలి మ్యాచ్‌లో నాలుగు సిక్సర్లతో 25 బంతుల్లో 38 పరుగులు చేసిన పాండ్య.. బంతితో మూడు వికెట్లు పడగొట్టి అదుర్స్‌ అనిపించుకున్నాడు. మంగళవారం కాగ్‌ (సీఏజీ)తో జరిగిన మ్యాచ్‌లో 10 సిక్సర్ల సాయంతో కేవలం 39 బంతుల్లోనే 105 పరుగులు చేసి తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. సెమీస్‌ మ్యాచ్‌లో అయితే అతడు విశ్వరూపం కనబరుస్తూ.. భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. బాదడానికే బరిలో దిగినట్లు.. పరుగులంటే కేవలం సిక్సర్లే అన్న చందంగా చెలరేగిపోయాడు. ఫలితంగా 55 బంతుల్లోనే అజేయంగా 158 పరుగులు చేశాడు. అందులో చుక్కలనంటే 20 సిక్సర్లుంటే.. కేవలం ఆరంటే ఆరే ఫోర్లు ఉన్నాయి.


దూబేను దంచికొట్టిన హార్దిక్‌

ప్రత్యర్థి బౌలర్లకు అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అనుభవం పెద్దగా లేదనే మాట నిజమే అయినా.. ఏ స్థాయి మ్యాచ్‌లోనైనా 20 సిక్సర్లు బాదడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ బీపీసీఎల్‌ జట్టు తరఫున సందీప్‌ శర్మ, శివం దూబె, రాహుల్‌ త్రిపాఠిలాంటి పేరున్న బౌలర్లే బంతులేశారు. న్యూజిలాండ్‌ పర్యటనకు పాండ్య స్థానంలో చోటు దక్కించుకున్న యువ ఆల్‌రౌండర్‌ శివం దూబే బౌలింగ్‌నైతే.. హార్దిక్‌ ఊచకోత కోశాడు. ఎడాపెడా సిక్సర్లు బాదుతూ రెచ్చిపోయాడు. ఈ నెల 12 నుంచి సఫారీలతోనే జరుగనున్న వన్డే సిరీస్‌కు పాండ్య జట్టులోకి రావాలని  చూస్తున్నాడు. 


షేర్‌ ఆయా! 

జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో పునరావాసం పొందుతున్న పాండ్యతో పాటు శిఖర్‌ ధవన్‌, భువనేశ్వర్‌ కుమార్‌ కూడా డీవై పాటిల్‌ కప్‌లో ఆడుతున్నా.. హార్దిక్‌ హిట్టింగ్‌ ముందు వారి ప్రదర్శన చిన్నబోతున్నది. వరుస మ్యాచ్‌ల్లో సెం చరీలతో అదరగొట్టిన పాండ్యకు సోషల్‌మీడియా బ్రహ్మరథం పడుతున్నది. ‘షేర్‌ ఆయా’ హ్యాష్‌ ట్యాగ్‌ తో ఎక్కడ చూసినా హార్దిక్‌ సిక్సర్ల చర్చే వినిపిస్తున్నది. ముఖ్యంగా కివీస్‌ టూర్‌ కు పాండ్య ప్లేస్‌లో ఎంపికైన శివం దూబేతో పోలుస్తూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 20 సిక్సర్లు బాదే సత్తా ఉన్న ఆటగాడి స్థానంలో 9 పరుగులకే పరిమితమయ్యే ప్లేయర్‌ను ఎంపిక చేయడం ఎంత తెలివి తక్కువ పని అని సెలెక్టర్ల తీరును ఎండగడుతున్నారు.logo