దెబ్బకు దెబ్బ.. టీ 20 సిరీస్ టీమ్ఇండియా కైవసం

- ధవన్, విరాట్, హార్దిక్ మెరుపులు
- రెండో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపు
తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గి ఆసీస్ వన్డే సిరీస్ సొంతం చేసుకుంటే.. పొట్టి ఫార్మాట్లో టీమ్ఇండియా సేమ్ సీన్ రిపీట్ చేసింది. భారీ స్కోర్లను ఛేదించలేక చతికిలబడ్డ చోటే.. రికార్డు స్థాయి స్కోరును ఛేజ్ చేసి సిరీస్ ఒడిసి పట్టింది. వన్డేల్లో ఎదురైన పరాభవానికి టీ20ల్లో బదులు తీర్చుకుంది. మాథ్యూ వెడ్, స్టీవ్ స్మిత్ పోరాటంతో కంగారూలు రెండొందలకు చేరువైతే.. శిఖర్ ధవన్, హార్దిక్ పాండ్యా హార్డ్ హిట్టింగ్తో లక్ష్యాన్ని ఊదేశారు. అంతర్జాతీయ టీ20ల్లో టీమ్ఇండియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా చాహల్.. బుమ్రా సరసన చేరాడు. వీరిద్దరూ 59 వికెట్లతో టాప్‌లో ఉన్నారు. బుమ్రా 49 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధిస్తే.. చాహల్ 44 మ్యాచ్‌ల్లో అతడిని సమం చేశాడు.
2016లో ఇక్కడే జరిగిన మ్యాచ్‌లో 198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టీమ్ఇండియా.. తాజా మ్యాచ్‌లో 195 పరుగుల టార్గెట్ ఛేజ్ చేసింది.ఆసీస్‌లో ఆస్ట్రేలియాపై ఇవే అత్యధిక ఛేదనలు.
పొట్టి ఫార్మాట్లో భారత్‌కు వరుసగా ఇది ఐదో సిరీస్ విజయం.
టీ20ల్లో భారత్ జట్టు గత 11 మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగకుండా దూసుకెళ్తున్నది. ఇందులో 10 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించగా.. ఓ మ్యాచ్ రద్దయింది. ఈ ఫార్మాట్లో టీమ్ఇండియాకు ఇదే అత్యధిక వరుస విజయాల రికార్డు.
సిడ్నీ: సుదీర్ఘ ఆసీస్ పర్యటన ఆరంభంలోనే వన్డే సిరీస్ కోల్పోయి ఒత్తిడిలో పడ్డ భారత జట్టు.. ఆ పరాజయం నుంచి కోలుకొని టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. టాపార్డర్ బాధ్యతాయుతమైన ఆటకు హార్దిక్ పాండ్యా మెరుపులు తోడవడంతో రెండో టీ20లో టీమ్ఇండియా విజయం సాధించింది. ఆదివారం ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే టీ20 సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్ మాథ్యూ వెడ్ (32 బంతుల్లో 58; 10 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకంతో అలరించగా.. స్మిత్ (38 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. భారత బౌలర్లలో యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్ రెండు వికెట్లు పడగొట్టడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేశాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధవన్ (36 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీకి.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (24 బంతుల్లో 40; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'హార్దిక్ పాండ్యా (22 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తుపాన్ ఇన్నింగ్స్‌లు తోడవడంతో భారత్ సునాయాసంగా విజయ తీరాలకు చేరింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో టీ20 మంగళవారం ఇక్కడే జరుగనుంది.
తలా కొన్ని..
సిడ్నీలో ఆడిన చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓటములకు తోడు.. ఆసీస్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంతో టీమ్ఇండియా గెలువడం కష్టమే అనిపించింది. అయితే బ్యాటింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై భారత్‌కు శుభారంభం దక్కింది. తొలి రెండు ఓవర్లలో 9 పరుగులే రాగా.. మూడో ఓవర్ నుంచి మోత మొదలైంది. రాహుల్ (30; 2 ఫోర్లు, ఒక సిక్స్) సిక్సర్‌తో స్కోరు బోర్డును కదిలిస్తే.. ధవన్ బౌండ్రీలతో రెచ్చిపోయాడు. మ్యాక్స్‌వెల్ వేసిన నాలుగో ఓవర్లో టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్ పండుగ చేసుకున్నారు. రాహుల్ ఓ బౌండ్రీ బాదితే.. ధవన్ 6,4 అరుసుకోవడంతో 19 పరుగులు వచ్చాయి. మంచి టచ్‌లో ఉన్న రాహుల్ ఔటైనా.. పవర్ ప్లే ముగిసేసరికి భారత్ 60/1తో నిలిచింది. స్పిన్నర్ల రాకతో స్కోరు బోర్డు వేగం తగ్గగా.. అర్ధశతకం అనంతరం ధవన్ వెనుదిరిగాడు. శాంసన్ (15) ఎక్కువసేపు నిలువలేకపోగా.. కోహ్లీ ధాటిగా ఆడాడు. టై వేసిన 15వ ఓవర్లో విరాట్ 4,6,4 బాదడంతో విజయ సమీకరణం 30 బంతుల్లో 54కు చేరింది.
64లో 51 అతడివే..
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా అదరగొట్టింది. విధ్వంసక ఓపెనర్లు ఫించ్, వార్నర్ అందుబాటులో లేకున్నా.. స్టాండిన్ కెప్టెన్ మాథ్యూ వెడ్ ఆ లోటు కనపడనివ్వలేదు. చాహర్ వేసిన తొలి ఓవర్లో మూడు ఫోర్లు బాదిన అతడు.. సుందర్‌కు సిక్సర్‌తో స్వాగతం పలికాడు. ఐదో ఓవర్లో బంతినందుకున్న నటరాజన్ షార్ట్ (9)ను బుట్టలో వేసుకున్నా.. మరో ఎండ్‌లో వెడ్ మాత్రం వరుస బౌండ్రీలతో హోరెత్తించాడు. సుందర్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతడు.. శార్దుల్ ఠాకూర్‌కు మూడు ఫోర్లు రుచి చూపించాడు. ఫలితంగా ఆరు ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 59/1తో నిలిచింది. అందులో 47 పరుగులు వెడ్ బ్యాట్ నుంచే వచ్చాయంటే అతడి జోరు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 25 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న వెడ్ అనూహ్యంగా రనౌట్ కాగా.. నటరాజన్ కట్టుదిట్టమైన బంతులతో స్కోరు కాస్త తగ్గింది. ఉన్నంత సేపు దడదడలాడించిన మ్యాక్స్‌వెల్ (22) భారీ షాట్‌కు యత్నించి ఔట్ కాగా.. స్మిత్ నిలకడగా పరుగులు రాబట్టాడు. ఆఖర్లో హెన్రిక్స్ (26), స్టొయినిస్ (16 నాటౌట్) విలువైన పరుగులు రాబట్టడంతో ఆసీస్ భారీ స్కోరు చేయగలిగింది. చివరి ఐదు ఓవర్లలో కంగారూలు 62 పరుగులు సాధించారు.
హార్దిక్ హిట్టింగ్..
కీలక దశలో విరాట్ ఔట్ కావడంతో టీమ్ఇండియా ఒత్తిడిలో పడింది. గెలువాలంటే మూడు ఓవర్లలో 37 పరుగులు చేయాల్సిన దశలో శ్రేయస్ అయ్యర్ (12 నాటౌట్) అండగా హార్దిక్ రెచ్చిపోయాడు. జంపా ఓవర్లో అయ్యర్ 6,4 బాదితే.. టై వేసిన 19వ ఓవర్లో పాండ్యా రెండు ఫోర్లు కొట్టాడు. చివరి ఓవర్లో 14 పరుగులు చేయాల్సిన దశలో రెండు భారీ సిక్సర్లు అరుసుకున్న పాండ్యా మరో రెండు బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించాడు. ఇన్నింగ్స్ చివరి పది బంతులను ఎదుర్కొన్న పాండ్యా 25 పరుగులు రాబట్టాడు.
కోహ్లీ-వెడ్ ఫన్నీ రనౌట్..
ఆస్ట్రేలియా కెప్టెన్ వెడ్ పెవిలియన్ చేరిన తీరు నవ్వు తెప్పించింది. చక్కటి షాట్లతో ధాటిగా ఆడుతున్న వెడ్.. సుందర్ వేసిన ఎనిమిదో ఓవర్లో కవర్స్‌లో ఉన్న కోహ్లీకి సునాయాస క్యాచ్ ఇచ్చాడు. అయితే విరాట్ దాన్ని అందుకోలేకపోయాడు. అప్పటికే క్రీజు నుంచి బయటకు వచ్చిన వెడ్ పరుగు పూర్తి చేయాలనుకున్నా.. స్మిత్ నిరాకరించడంతో తిరిగి క్రీజుకు చేరేలోపు కోహ్లీ కీపర్‌కు బంతి అందివ్వడంతో రనౌట్‌గా వెనుదిరిగాడు.
ఏబీని అనుకరించిన కోహ్లీ..
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ.. మిస్టర్ 360ని గుర్తుకు తెచ్చాడు. ఆండ్రూ టై బౌలింగ్‌లో వికెట్లను వదిలేసి ముందుకు జరిగిన కోహ్లీ.. ఏబీ డివిలియర్స్‌ను తలపిస్తూ మోకాళ్లపై కూర్చొని బంతిని స్టాండ్స్‌లోకి తరలించాడు. మ్యాచ్ అనంతరం దీనిపై స్పందిస్తూ ‘ఆ షాట్ చూసి నాకే ఆశ్చర్యం వేసింది. ఇది ఎలా ఆడానో డివిలియర్స్‌ను అడుగుతా’ అని సరదాగా స్పందించాడు.
రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకున్నా యంగ్ ప్లేయర్స్‌తో కూడిన జట్టు అద్భుతంగా ఆడింది. హార్దిక్‌లోని సహజసిద్ధమైన హిట్టింగ్ నైపుణ్యమే అతడిని టీమ్‌లో ప్రధాన ఆటగాడిగా మలిచింది. అతడు ఇదే విధంగా ముందుకు సాగుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాలి. లక్ష్యం పెద్దదైనా సమిష్టిగా సత్తాచాటడంతోనే విజయం సాధ్యమైంది. యువ ఆటగాళ్లు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. - విరాట్ కోహ్లీ
స్కోరు బోర్డు
ఆస్ట్రేలియా: వెడ్ (రనౌట్) 58, షార్ట్ (సి) అయ్యర్ (బి) నటరాజన్ 9, స్మిత్ (సి) హార్దిక్ (బి) చాహల్ 46, మ్యాక్స్‌వెల్ (సి) సుందర్ (బి) శార్దుల్ 22, హెన్రిక్స్ (సి) రాహుల్ (బి) నటరాజన్ 26, స్టొయినిస్ (నాటౌట్) 16, సామ్స్ (నాటౌట్) 8, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 20 ఓవర్లలో 194/5.
వికెట్ల పతనం: 1-47, 2-75, 3-120, 4-168, 5-171, బౌలింగ్: దీపక్ 4-0-48-0, సుందర్ 4-0-35-0, శార్దుల్ 4-0-39-1, నటరాజన్ 4-0-20-2, చాహల్ 4-0-51-1.
భారత్: రాహుల్ (సి) స్వెప్సన్ (బి) టై 30, ధవన్ (సి) స్వెప్సన్ (బి) జంపా 52, కోహ్లీ (సి) వెడ్ (బి) సామ్స్ 40, శాంసన్ (సి) స్మిత్ (బి) స్వెప్సన్ 15, హార్దిక్ (నాటౌట్) 42, అయ్యర్ (నాటౌట్) 12, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 19.4 ఓవర్లలో 195/4.
వికెట్ల పతనం: 1-56, 2-95, 3-120, 4-149, బౌలింగ్: సామ్స్ 3.4-0-41-1, అబాట్ 2-0-17-0, టై 4-0-47-1, మ్యాక్స్‌వెల్ 1-0-19-0, స్వెప్సన్ 4-0-25-1, హెన్రిక్స్ 1-0-9-0, జంపా 4-0-36-1.
తాజావార్తలు
- పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలి
- సేవలు అభినందనీయం
- వ్యవసాయ పనుల్లో బాలకార్మికులు
- ఆలయ ప్రహరీ మరమ్మతు ప్రారంభం
- కరోనా నిబంధనలు పాటించాలి
- ఏటూరునాగారంలో కేంద్ర గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలి
- గొగోయ్‌కి ‘జెడ్‌ప్లస్' భద్రత
- అమెరికా తొలి నల్లజాతి రక్షణమంత్రిగా ఆస్టిన్
- పాత రూ.100 నోట్లు ఔట్
- మూడు దుర్ఘటనల్లో 18మంది మృతి