బుధవారం 28 అక్టోబర్ 2020
Sports - Sep 19, 2020 , 01:57:38

నేటి నుంచి13వ సీజన్‌ ఐపీఎల్‌ తుఫాను

నేటి నుంచి13వ సీజన్‌ ఐపీఎల్‌ తుఫాను

బ్యాట్స్‌మెన్‌ హిట్టింగ్‌ విన్యాసాలు.. బుల్లెట్లలా దూసుకొచ్చే బంతులు.. గింగిరాలు తిరిగే స్పిన్‌.. మెరుపు ఫీల్డింగ్‌.. భారత్‌ పాటు విదేశీ స్టార్లతో కళకళలాడే జట్లు.. అన్నింటికీ మించి మైదానంలో ఉత్కంఠ పోరాటాలు, ఆటగాళ్ల భావోద్వేగాలు.. వీటిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేచిచూస్తున్న క్రికెట్‌ అభిమానుల నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది. యూఏఈ  వేదికగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌ నేడు ప్రారంభం కానుంది. కరోనా వైరస్‌ ప్రభావంతో విసిగివేసారిన కోట్లాది మందిలో ఈ క్రికెట్‌ వేడుక ఉత్సాహం నింపనుంది. మొత్తంగా 53 రోజుల పాటు క్రికెట్‌ ప్రపంచంలోకి తీసుకెళ్లనుంది.  సినీ తారలతో అట్టహాసంగా జరిగే ప్రారంభ వేడుక, మ్యాచ్‌ల్లో అభిమాన క్రికెటర్ల, జట్ల పేర్లను దిక్కులు పిక్కటిల్లేలా అరిచే ప్రేక్షకులు, చీర్‌లీడర్ల చిందులు ఇలాంటివేవీ  లేకుండా ఈ ఏడాది ఐపీఎల్‌ వినూత్నంగా జరుగనుంది. 

కరోనా వైరస్‌తో ఆందోళనలో ఉన్న ప్రపంచాన్ని క్రికెట్‌ లోకంలోకి తీసుకెళ్లి.. అలరించేందుకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సిద్ధమైంది. క్రీడాపోటీలు లేక మంచి ఆకలి మీద ఉన్న అభిమానులకు ఫుల్‌ మీల్స్‌ పెట్టేందుకు మరికొన్ని గంటల్లో మెగాలీగ్‌ ఆరంభం కానుంది. శనివారం అబుదాబి వేదికగా ఐపీఎల్‌ 13వ సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనున్నాయి. సుదీర్ఘ కాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉండి.. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత దిగ్గజం మహేంద్ర సింగ్‌ ధోనీని చూసేందుకు కండ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన అభిమానుల నిరీక్షణ తీరనుంది.  యూఏఈలోని దుబాయ్‌(24), అబుదాబి (20), షార్జా(12) మూడు వేదికల్లో  53 రోజుల పాటు 60 మ్యాచ్‌లుగా నవంబర్‌ 10న ఫైనల్‌ వరకు ఐపీఎల్‌ జరుగనుంది. 

హోరాహోరీకి సిద్ధం 

 గతంలో కంటే మరింత సమతూకంతో కనిపిస్తున్న ఎనిమిది జట్లను చూస్తే టైటిల్‌ కోసం ఈసారి పోరు మరింత హోరాహోరీగా జరుగడం ఖాయంగా కనిపిస్తున్నది. రోహిత్‌ శర్మ సారథ్యంలో బిగ్‌ హిట్టర్లతో ముంబై  భీకరంగా ఉంటే.. దిగ్గజ సారథి ధోనీ, డుప్లెసిస్‌, వాట్సన్‌ లాంటి సీనియర్లతో డాడీస్‌ ఆర్మీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎప్పటిలాగానే టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా ఉంది.  ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ నేతృత్వంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పటిష్టంగా ఉంది. తొలిసారి  టైటిల్‌ కొట్టాలని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కసితో ఉండగా.. సమతూకంతో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ సైతం అదే లక్ష్యాన్ని పెట్టుకుంది.  కోల్‌ కతా నైట్‌రైడర్స్‌ మూడో టైటిల్‌ ఆశతో ఉంటే. రాజస్థాన్‌ రాయల్స్‌ పుంజుకోవాలనే పట్టుదలతో ఉంది. 

తొలి పంచ్‌ ఎవరిదో..

  అబుదాబి:  ఐపీఎల్‌ 13వ సీజన్‌ తొలి మ్యాచ్‌లో టైటిల్‌ ఫేవరెట్లు ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ శనివారం తలపడనున్నాయి. చాలా సీజన్లలో తొలుత తడబడిన ముంబై.. అబుదాబి వేదికగా తొలి పోరుతోనే శుభారంభం చేయాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌తో యూఏ ఈ పిచ్‌లు, వాతావరణ పరిస్థితులపై ఓ అంచనా రానుంది. కాగా అబుదాబి పిచ్‌  బౌలర్లకే అనుకూలించే అవకాశం ఉంది. రోహిత్‌, డికాక్‌, హార్దిక్‌, కృనాల్‌ పాండ్య, పొలార్డ్‌, బుమ్రా ఇలా స్టార్‌ ఆటగాళ్లతో కళకళలాడుతున్న ముంబై ఎంతో పటిష్టంగా ఉంది. మరోవైపు వ్యక్తిగత కారణాలతో సీనియర్‌ ప్లేయర్‌ సురేశ్‌ రైనా సీజన్‌ నుంచి తప్పుకోవడం లోటే అయినా చెన్నై  కూడా బలంగానే ఉంది. కెప్టెన్‌ ధోనీ, వాట్సన్‌, రాయుడు, జాదవ్‌, జడేజా లాంటి మ్యాచ్‌ విన్నర్లతో పటిష్టంగానే కనిపిస్తున్నది. 

 జట్లు (అంచనా)  

ముంబై: రోహిత్‌ (కెప్టెన్‌), డికాక్‌(వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌, కుల్టర్‌నైల్‌, రాహుల్‌ చాహర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్ప్రీత్‌ బుమ్రా 

చెన్నై : షేన్‌ వాట్సన్‌, రాయుడు, డుప్లెసిస్‌,  ధోనీ(కెప్టెన్‌), కేదార్‌ జాదవ్‌, డ్వైన్‌ బ్రావో, జడేజ, పియూష్‌ చావ్లా, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, తాహిర్‌ 

వినూత్నంగా..

  టీ20 క్రికెట్‌కే వన్నెలద్దిన ధనిక లీగ్‌ ఐపీఎల్‌.. కరోనా కారణంగా ఈసారి వినూత్నంగా జరుగనుంది. మార్చిలో ప్రారంభం కావాల్సిన టోర్నీ మహమ్మారి వల్ల ఆరు నెలలు ఆలస్యమైంది. ప్రతీసారి సినీతారల తళుకుబెళుకులు, డ్యాన్స్‌లతో హోరెత్తే ఆరంభ వేడుకతో ప్రారంభమయ్యే లీగ్‌.. ఈసారి హడావుడి లేకుండా నిరాడంబరంగా  మొదలవనుంది. ఇక మహమ్మారి దెబ్బతో ప్రేక్షకుల్లేకుండా బోసిపోయే స్టేడియాల్లో మ్యాచ్‌లు జరుగనుండడంతో ఇంతకు ముందు రికార్డు చేసిన కేరింతలను ప్లే చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు.  చీర్‌ లీడర్ల నృత్యాలు ఉండవు. క్వారంటైన్‌ పూర్తి చేసుకొని లీగ్‌లో ఆడుతున్న ఆటగాళ్లు మొత్తం తమ జట్టు మ్యాచ్‌లు అయిపోయే వరకు బయో బబుల్‌ దాటేందుకు వీలు లేదు. ప్రామాణిక నిర్వహణ పద్ధతి(ఎస్‌వోపీ)ని తూచా తప్పకుండా పాటించాల్సిందే. ఇక కరచాలనాలు, ఆలింగనాలు ఎక్కువగా కనిపించకపోవచ్చు. 


logo