e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home స్పోర్ట్స్ దస్‌ కా దమ్‌

దస్‌ కా దమ్‌

దస్‌ కా దమ్‌
  • పదోసారి ఇటాలియన్‌ ఓపెన్‌ నెగ్గిన నాదల్‌
  • ఫైనల్లో జొకోవిచ్‌పై ఘనవిజయం
  • మహిళల సింగిల్స్‌ విజేత స్వియాటెక్‌

మట్టికోట మహా సంగ్రామానికి ముందు జరిగిన రిహార్సల్స్‌లో స్పెయిన్‌ బుల్‌ నాదల్‌ విజృంభించాడు. ఎర్రమట్టిపై తనకు ఎదురు లేదని నిరూపిస్తూ.. రికార్డు స్థాయిలో పదోసారి రోమ్‌ ఓపెన్‌ టైటిల్‌ చేజిక్కించుకున్నాడు. తుదిపోరులో ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ పోటీనిచ్చినా.. నాదల్‌ను నిలువరించలేకపోయాడు. ఏకపక్షంగా సాగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో పొలాండ్‌ భామ ఇగా స్వియోటెక్‌ విజేతగా నిలిచింది.

రోమ్‌: మట్టికోట మహరాజు రఫేల్‌ నాదల్‌ దుమ్మురేపాడు. ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్‌ ఓపెన్‌కు రెండు వారాల ముందు.. తనకు అచ్చొచ్చిన రోమ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌-1000 టోర్నీలో టైటిల్‌ చేజిక్కించుకున్నాడు. తిరుగులేని ఆటతో దూసుకెళ్లిన స్పెయిన్‌ బుల్‌ నాదల్‌.. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో 7-5, 1-6, 6-3తో ప్రపంచ నంబర్‌వన్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా)ను మట్టికరిపించాడు. ఇప్పటికే 9 సార్లు ఇటాలియన్‌ ఓపెన్‌ విజేతగా నిలిచిన నాదల్‌కు ఇది పదో విజయం కావడం విశేషం. స్థాయికి తగ్గ ఆటతో తొలి సెట్‌ చేజిక్కించుకున్న నాదల్‌.. రెండో సెట్‌లో వెనుకబడిపోయాడు. జొకో పదునైన సర్వీస్‌లకు బదులు చెప్పలేక సెట్‌ కోల్పోయాడు. నిర్ణయాత్మక మూడో సెట్‌ ప్రారంభం నుంచి ఆధిపత్యం కనబర్చిన నాదల్‌ పవర్‌ఫుల్‌ బ్యాక్‌హ్యాండ్‌ షాట్‌లతో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.

వన్‌సైడ్‌ వార్‌..

మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఇగా స్వియాటెక్‌ (పొలాండ్‌) విజృంభించింది. శనివారం ఒకే రోజు క్వార్టర్స్‌తో పాటు సెమీస్‌లో ప్రత్యర్థులను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లిన స్వియాటెక్‌.. తుదిపోరులో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విరుచుకుపడింది. ఆదివారం జరిగిన ఫైనల్లో స్వియాటెక్‌ 6-0, 6-0తో తొమ్మిదో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై ఘనవిజయం సాధించింది. గతేడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేతగా నిలిచిన స్వియాటెక్‌ కేవలం 46 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తుచేసింది. గత ఐదేండ్లలో డబ్ల్యూటీఏ ఫైనల్‌ ఇంత ఏకపక్షంగా సాగడం ఇదే తొలిసారి. ఫైనల్లో స్వియాటెక్‌ 17 విన్నర్‌లు సంధించగా.. ప్లిస్కోవా ఐదుకే పరిమితమైంది. స్వియాటెక్‌ 5 అనవసర తప్పిదాలు చేస్తే.. 23 తప్పిదాలతో ప్లిస్కోవా మూల్యం చెల్లించుకుంది. స్వియాటెక్‌ కెరీర్‌లో ఇది మూడో టైటిల్‌.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దస్‌ కా దమ్‌

ట్రెండింగ్‌

Advertisement