e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home స్పోర్ట్స్ హర్మన్‌ డబుల్‌ జోష్‌

హర్మన్‌ డబుల్‌ జోష్‌

  • న్యూజిలాండ్‌పై భారత్‌ అద్భుత విజయం
  • సాత్విక్‌ జోడీ శుభారంభం
  • షూటింగ్‌, ఆర్చరీలో భారత్‌కు తీవ్ర నిరాశ

టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 3-2తో అద్భుత విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్‌సింగ్‌ డబుల్‌ గోల్స్‌తో విజృంభించగా, రూపిందర్‌పాల్‌సింగ్‌ మరో గోల్‌తో ఆకట్టుకున్నాడు. మరోవైపు తెలుగు షట్లర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌శెట్టి అదిరే ఆరంభం చేశారు. పురుషుల డబుల్స్‌ తొలిపోరులో మూడో సీడ్‌ జోడీని మట్టికరిపించి శెభాష్‌ అనిపించుకున్నారు. అయితే భారత్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్న షూటింగ్‌, ఆర్చరీలో తీవ్ర నిరాశ ఎదురైంది. టెన్నిస్‌లో సుమీత్‌ నాగల్‌ విజయం హైలెట్‌గా నిలిచింది.

భారత్‌ శుభారంభం

భారత పురుషుల హాకీ జట్టు పూల్‌-ఏ మ్యాచ్‌లో 3-2తో న్యూజిలాండ్‌ను చిత్తుచేసింది. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (26వ, 33వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో సత్తాచాటగా.. రూపిందర్‌పాల్‌ సింగ్‌ (10వ ని.) ఓ గోల్‌ చేశాడు. గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్‌ను భారత్‌ అడ్డుకోలిగింది. మహిళల హాకీ జట్టు 1-5 తేడాతో నెదర్లాండ్స్‌ చేతిలో ఓడింది.

- Advertisement -

టోక్యో: భారత పురుషుల బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్టార్లు సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి టోక్యో ఒలింపిక్స్‌ను ఘనంగా ఆరంభించారు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో సాత్విక్‌ జోడీ 21-16, 16-21, 27-25 తేడాతో మూడో సీడ్‌ చైనీస్‌ తైపీ ద్వయం లీ యాంగ్‌, వాంగ్‌ చిలిన్‌ను చిత్తుచేసింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో భారత జోడీ అద్భుతంగా పోరాడి ఒత్తిడిని చిత్తుచేసింది. కాగా పురుషుల సింగిల్స్‌లో తెలుగు ప్లేయర్‌, 13వ ర్యాంకర్‌ బి.సాయిప్రణీత్‌కు షాక్‌ ఎదురైంది. గ్రూప్‌-డి తొలి మ్యాచ్‌లో ప్రణీత్‌ 17-21, 15-21 తేడాతో 47వ ర్యాంకర్‌ మిస్రా జిల్బెర్మన్‌ చేతిలో ఓడాడు. దీంతో ముందడుగు వేయాలంటే తదుపరి మ్యాచ్‌ల్లో సాయి తప్పకగెలువాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు మహిళల సింగిల్స్‌ పోరును ఆదివారం ప్రారంభించనుంది.

వికాస్‌ ఔట్‌

భారత బాక్సర్‌ వికాస్‌ క్రిషన్‌ (69 కేజీలు) తొలి బౌట్‌లోనే 0-5 తేడాతో సెవోన్‌రెట్స్‌ ఒకాజవా (జపాన్‌) చేతిలో ఓడి నిరాశపరిచాడు. చివరికి రక్తమోడుతూ రింగ్‌ను వీడాడు. కాగా భారత బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌ ఆదివారం బరిలోకి దిగనుంది. ఇక జూడోలో భారత సీనియర్‌ సుశీలా దేవీ ఆరంభంలోనే ఓటమి చవిచూసింది.

మనికా, సుశ్రిత గెలుపు

టేబుల్‌ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో భారత స్టార్లు మనికా బాత్రా, సుశ్రితా ముఖర్జీ విజయాలు సాధించారు. మనికా 4-0 టిన్‌టిన్‌ హో (బ్రిటన్‌)పై, ముఖర్జీ 4-3తోతో లిండా బెర్డ్‌స్ట్రోమ్‌పై విజయాలు సాధించి ముందడుగేశారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శరత్‌ కమల్‌ – మనికా జోడీ 0-4తో మూడో సీడ్‌ చైనీస్‌ తైపీ ద్వయం లిన్‌ యున్‌జూ – చెంగ్‌ ఐచింగ్‌ చేతిలో ఓడి నిరాశపరిచింది.

గురి తప్పింది

భారీ అంచనాలు పెట్టుకున్న భారత షూటర్లు వ్యక్తిగత విభాగాల్లో తీవ్రంగా నిరాశపరిచారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్‌ క్వాలిఫయర్స్‌లో 586 పాయింట్లతో ఆకట్టుకొని టాప్‌లో నిలిచిన భారత యువ షూటర్‌ సౌరభ్‌ చౌదరీ ఫైనల్‌లో ఏడో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. ఇరాన్‌ షూటర్‌ ఫోరౌగీ స్వర్ణం, సెర్బియా షూటర్‌ మికెక్‌ రజతం సాధించారు. మరోవైపు పతకం సాధిస్తాడని అనుకున్న అభిషేక్‌ వర్మ (575) క్వాలిఫయర్స్‌లో 17వ స్థానంలో నిలిచి చతికిలపడ్డాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో యువ షూటర్‌, ప్రపంచ నంబర్‌వన్‌ ఎలావెనిల్‌ వలరివన్‌, అపూర్వీ చండీలా క్వాలిఫయర్స్‌ దాటలేకపోయారు. ఎలవెనిల్‌ (626.5) 16వ స్థానానికే పరిమితమైతే.. అపూర్వీ (621.9) 36వ ప్లేస్‌తో ఘోరంగా విఫలమైంది. పోటీ ప్రారంభంలో అదరగొట్టిన ఇద్దరూ ఆ తర్వాత చతికిలపడ్డారు. ఆర్చరీ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లో భారత ద్వయం దీపికా కుమారి – ప్రవీణ్‌ జాదవ్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో ఓటమిపాలయ్యారు. చైనీత్‌ తైపీ జోడీపై గెలిచి క్వార్టర్‌ చేరిన దీపిక ద్వయం 2-6 తేడాతో దక్షిణ కొరియా ప్లేయర్లు కిమ్‌జే డియోక్‌, ఆన్‌సాన్‌ చేతిలో ఓడి పతక ఆకాంక్షను నీరుగార్చింది.

తొలి స్వర్ణం చైనాదే

10 మీటర్ల మహిళల ఎయిర్‌ రైఫిల్‌లో చైనా షూటర్‌, 21 ఏండ్ల యాంగ్‌ క్వియాన్‌ (251.8 పాయింట్లు)అగ్రస్థానంలో నిలిచి టోక్యో ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణ పతకాన్ని పట్టింది. అలాగే చైనా మహిళా వెయిట్‌ లిఫ్టర్‌ జేహెచ్‌ హౌ (49 కేజీలు) 210 కేజీల బరువు ఎత్తి పసిడి సాధించడంతో పాటు ఒలింపిక్‌ రికార్డు బద్దలుకొట్టింది. ఫెన్సింగ్‌లోనూ చైనీస్‌ అమ్మాయి సన్‌యువెన్‌ బంగారు పతకం దక్కించుంది.

12 ఏండ్ల ఒలింపియన్‌ పోరు ముగిసె

12 ఏండ్ల ప్రాయంలోనే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన హెండ్‌ జజా నిరాశపరిచింది. మహిళల టేబుల్‌ టెన్నిస్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. శనివారం జరిగిన పోరులో జజా 0-4 తేడాతో ఆస్ట్రియాకు చెందిన లియు జియా చేతిలో ఓటమి పాలైంది. అంతగా అనుభవం లేకుండానే విశ్వక్రీడలకు అర్హత సాధించిన సిరియా సంచలనం హెండ్‌..ప్రత్యర్థికి పోటీ నివ్వడంలో విఫలమైంది. ఇదే అదనుగా విజృంభించిన లియు..మ్యాచ్‌ను అలవోకగా కైవసం చేసుకుంది. మ్యాచ్‌ పూర్తయిన తర్వాత ప్రత్యర్థి లియుతో కలిసి సెల్ఫీ దిగి హెండ్‌..తన ఒలింపిక్స్‌ అనుభవాలను మరింతగా పదిలం చేసుకుంది.

నాగల్‌ రికార్డు గెలుపు

ఒలింపిక్‌ గేమ్స్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌లో విజయం సాధించిన మూడో భారత ప్లేయర్‌గా యువ ప్లేయర్‌ సుమీత్‌ నాగల్‌ రికార్డు సృష్టించాడు. తొలి రౌండ్‌లో నాగల్‌ 6-4, 6-7 (6/8), 6-4 తేడాతో డెనిస్‌ ఇస్టోమిన్‌పై గెలిచాడు. దీంతో 25 ఏండ్ల తర్వాత పురుషుల సింగిల్స్‌లో గెలిచిన భారత ప్లేయర్‌గా నిలిచాడు. నాగల్‌ కంటే ముందు ఒలింపిక్స్‌ సింగిల్స్‌లో మన దేశం తరఫున జీషన్‌ అలీ, లియాండర్‌ పేస్‌ మాత్రమే విజయాలు సాధించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana