e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home స్పోర్ట్స్ ఆరంభం అదుర్స్‌

ఆరంభం అదుర్స్‌

  • అట్టహాసంగా జాతీయ అథ్లెటిక్స్‌ టోర్నీ
  • 5000మీటర్ల రేసులో పారుల్‌, అభిషేక్‌కు స్వర్ణాలు
  • పోటీలను ప్రారంభించిన మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, దయాకర్‌రావు

వరంగల్‌, సెప్టెంబర్‌ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్‌ వేదికగా 60వ జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ టోర్నీకి తెరలేచింది. హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో బుధవారం పోటీలు అట్టహాసంగా మొదలయ్యాయి. ప్రతిష్ఠాత్మక టోర్నీకి తొలిసారి ఆతిథ్యమిస్తున్న వరంగల్‌ నగరం కొత్త శోభను సంతరించుకుంది. దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన ప్లేయర్లు, కోచ్‌లు, సహాయ సిబ్బంది కోసం ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఎక్కడా అసౌకర్యానికి లోనుకాకుండా అన్ని శాఖల సమన్వయంతో తగు వసతులు కల్పించారు. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. జ్యోతి ప్రజల్వన చేసిన అనంతరం గాల్లోకి బెలూన్స్‌ ఎగరవేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ ‘ఉద్యమాల ఖిల్లా అయిన వరంగల్‌ నగరం చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారి జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు జరుగడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్‌ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రోత్సహిస్తున్నారు. హైదరాబాద్‌ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. భవిష్యత్‌లో వరంగల్‌ను క్రీడాహబ్‌గా తీర్చిదిద్దుతాం. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు స్పోర్ట్స్‌ అకాడమీ ఏర్పాటు చేసి మరింత మంది క్రీడాకారులను వెలుగులోకి తీసుకొస్తాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజయ్య, సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, నగర మేయర్‌ సుధారాణి, వరంగల్‌ అథ్లెటిక్స్‌ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్‌రావు, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, సీపీ డాక్టర్‌ తరుణ్‌ జోషి, మర్రి యాదవరెడ్డి, స్టాన్లీ జోన్స్‌, నాగపురి రమేశ్‌, అంజూబాబీ జార్జ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో..

జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలతో జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో సందడి నెలకొంది. చాలా రోజుల తర్వాత జరుగుతున్న పోటీలు కావడంతో భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో పోటీలను వీక్షించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చాంపియన్‌షిప్‌లో పోటీపడే అథ్లెట్ల జాబితాకు అనుగుణంగా స్టేడియంలోకి అనుమతిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికలైన ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లో ప్రత్యేకంగా పేజీలు, చానల్స్‌ ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ప్రత్యేక సాంకేతిక బృందం ఈ ఏర్పాట్లు చూస్తున్నది. భారీ కెమెరా, డ్రోన్ల ద్వారా ఈవెంట్లను చిత్రీకరిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని, ఫొటోలను అందుబాటులోకి తెస్తున్నారు. స్టేడియం బయట వీక్షించేందుకు గాను ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

పారుల్‌, అభిషేక్‌ పసిడి మెరుపులు

- Advertisement -

పోటీల తొలి రోజైన బుధవారం తొలుత జరిగిన మహిళల 5000మీటర్ల రేసులో రైల్వేస్‌ స్ప్రింటర్‌ పారుల్‌ చౌదరి (15:59:69సె) పసిడి పతకంతో మెరిసింది. రేసు ఆసాంతం రజత పతక విజేత కోమల్‌ చంద్రకాంత్‌ (16:01:43సె) కంటే వెనుకంజలోనే కనిపించిన పారుల్‌..రేసు మరో 250మీటర్లు ఉందనగా జోరు పెంచి అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో పారుల్‌ను అధిగమించడం కోమల్‌కు కష్టతరంగా మారింది. ఇదే రేసులో మహారాష్ట్రకు చెందిన శివానీ బాబురావు (16:19:18సె) కాంస్య పతకం దక్కించుకుంది. పురుషుల 5000 మీటర్ల రేసులో రైల్వేస్‌కు చెందిన అభిషేక్‌ పాల్‌ (14:16:35సె) స్వర్ణ పతకం దక్కించుకోగా, సర్వీసెస్‌ అథ్లెట్లు ధర్మేందర్‌ (14:17:20సె), అజయ్‌ కుమార్‌ (14:20:98సె) వరుసగా రజత, కాంస్య పతకాలు ఖాతాలో వేసుకున్నారు. అభిషేక్‌, సర్వీసెస్‌ రేసర్ల మధ్య పోటీ రసవత్తరంగా సాగింది. మహిళల పోల్‌వాల్ట్‌ విభాగంలో పార్వతి వెంకటేశ్‌ (తమిళనాడు, 3.90మీ) స్వర్ణం దక్కించుకోగా, మారియా జైసన్‌ (రైల్వేస్‌, 3.80మీ), క్రిష్ణ రచన్‌ (రైల్వేస్‌, 3.60మీ) వరుసగా రజత, కాంస్యాలు సొంతం చేసుకున్నారు. తెలంగాణ అథ్లెట్ల విషయానికొస్తే..మహిళల 100మీటర్ల రేసులో నిత్య గందె ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల లాంగ్‌జంప్‌లో అంకిత్‌సైనీ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana