చితక్కొట్టిన విండీస్..బంగ్లా టార్గెట్ 322

Mon,June 17, 2019 06:52 PM

West Indies Score 321  in First Innings

టాంటన్: ప్రపంచకప్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు. బంగ్లాదేశ్ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ భారీ స్కోరు సాధించారు. షెయ్ హోప్(96: 121 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్) సూపర్ ఇన్నింగ్స్‌తో రాణించడంతో విండీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 321 పరుగులు చేసింది. యూనివర్స్ బాస్ క్రిస్‌గేల్(0) మినహా టాప్‌ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఎవిన్ లూయిస్(70: 67 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు), హెట్‌మైర్(50: 26 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఆఖర్లో క్రీజులోకి వచ్చిన హోల్డర్ బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ధనాధన్ ఆటతో 15 బంతుల్లోనే 4ఫోర్లు, 2సిక్సర్ల సాయంతో 33 రన్స్ రాబట్టాడు.

ఆరంభంలోనే గేల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హోప్ జట్టును పటిష్ఠస్థితిలో నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. 6 పరుగుల వద్ద వికెట్ కోల్పోవడంతో విండీస్‌పై ఒత్తిడి పెరిగింది. బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా ఆడలేకపోయారు. కట్టుదిట్టంగా బంతులేస్తున్న బంగ్లా బౌలర్లను ఎవిన్ లూయిస్, హోప్ జోడీ ధాటిగా ఎదుర్కొంది. ఈ జోడీ వందకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్(25) అంతంత మాత్రంగానే రాణించాడు. ఐతే హెట్‌మైర్(50 26 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) కళ్లు చెదిరే షాట్లతో అలరించాడు. అతని మెరుపు ఆటతోనే విండీస్ వేగంగా 200 మార్క్ దాటింది. హెట్‌మైర్ ఔటైన తర్వాత వచ్చిన రస్సెల్(0) నిరాశపరిచాడు. ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో రహీమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.


డెత్ ఓవర్లలో బంగ్లా వైవిధ్యమైన బంతులతో విండీస్‌ను కట్టడి చేసింది. వరుస విరామాల్లో వికెట్లు పడుతున్నా విండీస్ దూకుడు తగ్గించలేదు. ప్రతీ బంతిని బౌండరీ దాటించాలన్న కసితో కరీబియన్ స్టార్లు బ్యాట్ ఝుళిపించారు. ఇదే సమయంలో బంగ్లా వికెట్లు కూడా తీసింది. 48వ ఓవర్లో డారెన్ బ్రావో(19) సిక్సర్ బాదడంతో 300 మార్క్‌ను విండీస్ అందుకుంది. వికెట్లు తీసినా అందరు బౌలర్లు ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. బంగ్లా బౌలర్లలో సైఫుద్దిన్(3/72), ముస్తాఫిజుర్ రహమాన్(3/59), షకీబ్ అల్ హసన్(2/54) మెరుగ్గా బౌలింగ్ చేశారు.

2188
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles