కోహ్లి టాస్ గెలిస్తే రికార్డే!

Wed,October 31, 2018 05:48 PM

Virat Kohli on the verge of setting a new toss record

తిరువనంతపురం: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఏం చేసినా రికార్డే. అతని పరుగుల ప్రవాహం అలా సాగిపోతున్నది మరి. ఇప్పుడు కూడా మరో అరుదైన రికార్డుకు అతను చేరువగా ఉన్నాడు. అయితే ఈసారి అది బ్యాట్‌తో సాధించే రికార్డు కాదు. మ్యాచ్‌కు ముందు టాస్‌తోనే కొట్టే రికార్డు. వెస్టిండీస్‌తో జరగబోయే చివరి వన్డేలో టాస్ గెలిస్తే చాలు కోహ్లి రికార్డు సాధిస్తాడు. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో నాలుగు టాస్‌లనూ కోహ్లియే గెలిచాడు. ఐదో వన్డేలోనూ టాస్ గెలిస్తే సొంతగడ్డపై జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక భారత కెప్టెన్‌గా విరాట్ నిలవనున్నాడు. అంతేకాదు ఓ సిరీస్‌లో వరుసగా ఐదు టాస్‌లు గెలిచిన నాలుగో ఇండియన్ కెప్టెన్ అవుతాడు. గతంలో అజర్, ధోనీ, ద్రవిడ్ ఈ ఘనత సాధించారు. ఇక వెస్టిండీస్‌పై ఇలా వరుసగా ఐదు టాస్‌లు గెలిచిన వాళ్లలో హ్యాన్సీ క్రోనే, స్టీవ్ వా ఉన్నారు.

ఇంగ్లండ్ టూర్‌లో వరుసగా ఐదు టాస్‌లు ఓడి లాలా అమర్‌నాథ్, కపిల్‌ దేవ్ సరసన నిలిచిన కోహ్లి.. ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా అరుదైన రికార్డు ముంగిట ఉండటం విశేషమే. అప్పట్లో నేను టాస్ గెలవాలంటే రెండు వైపులా హెడ్స్ ఉండాలేమో అని నిరాశ వ్యక్తంచేసిన కోహ్లి.. ఇప్పుడు వరుసగా టాస్‌లు గెలుస్తూ వెళ్తున్నాడు. టాస్‌తోపాటు తిరువనంతపురంలో మ్యాచ్ కూడా గెలిస్తే సొంతగడ్డపై తిరుగులేని రికార్డు భారత్ సొంతమవుతుంది. 2015 నుంచి ఇప్పటివరకు సొంతగడ్డపై ఆడిన వన్డే సిరీస్‌ను భారత్ కోల్పోలేదు.

5091
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles