విరాట్ తానా.. బీసీసీఐ తందానా!

Tue,June 27, 2017 08:06 PM

ముంబై: ఊహించిందే జ‌రిగింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఫేవ‌రెట్ ర‌విశాస్త్రి కోచ్ ప‌ద‌వి కోసం అప్లై చేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. కుంబ్లే రాజీనామా చేయ‌గానే కోచ్ ప‌ద‌వి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి బీసీసీఐ కొత్త‌గా గ‌డువు ఇచ్చింది. ర‌విశాస్త్రి కోస‌మే బోర్డు ఇలా చేస్తున్న‌ద‌ని అప్పుడే చాలా మందికి డౌట్ వ‌చ్చింది. అంతేకాదు గ‌డువు పెంచిన త‌ర్వాత బోర్డే ర‌విశాస్త్రి ద‌గ్గ‌రికి వెళ్లి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరింది. అయితే గ‌తంలో గంగూలీ త‌న‌ను అవ‌మానించ‌డాన్ని మ‌నసులో పెట్టుకున్న ర‌వి.. తాను కోచ్ ప‌ద‌వి కోసం క్యూలో నిల‌బ‌డ‌న‌ని, త‌న‌కు ప‌ద‌వి క‌చ్చితంగా ఇస్తానంటేనే వ‌స్తాన‌ని నిర్మొహ‌మాటంగా చెప్పాడు.


ఇప్పుడు ర‌వి అప్లై చేస్తున్నాడంటే అత‌నికి బోర్డు కోచ్ ప‌ద‌విపై గ్యారెంటీ ఇచ్చిందా అన్న సందేహం క‌లుగుతున్న‌ది. మ‌రి బోర్డు ఇప్పుడు ఫార్మాట్ ను ఫాలో అవుతుందా లేక ఇంట‌ర్వ్యూలాంటి తంతులేమీ లేకుండా ర‌విశాస్త్రికి కోచ్ ప‌ద‌విని అప్ప‌గిస్తుందా అన్న‌ది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే ఇంట‌ర్వ్యూ చేయాల్సింది క్రికెట్ అడ్వైజ‌రీ క‌మిటీ. అందులో ఉన్న‌ది గంగూలీ. శాస్త్రి పేరెత్తితేనే మండిప‌డే దాదా.. ఏదో తూతూమంత్రంగా ఇంట‌ర్వ్యూ చేసేసి అత‌నికి కోచ్ ప‌ద‌వి అప్ప‌గిస్తాడ‌ని అస్స‌లు అనుకోలేం. ఈ నేప‌థ్యంలో ర‌విని ఇంట‌ర్వ్యూలాంటివేమీ లేకుండా నేరుగా కోచ్‌గా నియ‌మించే అవ‌కాశాలే ఎక్కువ‌. అలా అయితే ఈ ప్ర‌హ‌స‌న‌మంతా ఎందుకు? కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించ‌డం.. దానికోసం ఇప్ప‌టికే అప్లై చేసుకున్న‌వారిని అవ‌మానించ‌డం ఎందుకు?

ఇదే విష‌యాన్ని కోచ్ ప‌ద‌వి కోసం అప్లై చేసుకున్న లాల్‌చంద్ రాజ్‌పుత్ కూడా అప్ప‌ట్లో లేవ‌నెత్తాడు. ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగించ‌డం అంటే ఇప్ప‌టికే అప్లై చేసుకున్న వాళ్ల‌ను అవ‌మానించ‌డ‌మే అని అత‌ను స్ప‌ష్టంచేశాడు. ఇప్పుడు అత‌డు అన్న‌ది అక్ష‌రాలా నిజ‌మ‌వుతున్న‌ది. ఒక‌వేళ కోహ్లిని కాద‌ని తాము మ‌రో కోచ్‌ను ఎంపిక చేయ‌లేమ‌ని బోర్డు ముందే భావించి ఉంటే.. అస‌లు కోచ్ ప‌ద‌వి కోసం ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించి ఉండాల్సింది కాదు. కోహ్లిపై.. కుంబ్లేతో అత‌ను వ్య‌వ‌హ‌రించిన తీరుపై.. కెప్టెన్‌కు సూప‌ర్‌స్టార్ స్టేట‌స్ ఇచ్చిన బోర్డుపై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. బీసీసీఐ పెద్ద‌లకు మాత్రం అవేమీ ప‌ట్ట‌క‌పోవ‌డం విచార‌క‌రం.

1692
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles