కోహ్లి, రవిశాస్త్రిల అధికారాలకు కత్తెర!

Mon,August 13, 2018 05:47 PM

Virat Kohli and Ravishastri may lose their powers after Third test against England

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలకు గడ్డుకాలం మొదలవబోతున్నది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో టీమిండియా అత్యంత దారుణమైన ప్రదర్శనపై బీసీసీఐ గుర్రుగా ఉంది. మూడో టెస్ట్ ఫలితం చూసిన తర్వాత ఈ ఇద్దరికీ పెద్ద పరీక్ష ఎదురు కాబోతున్నట్లు ఓ సీనియర్ బోర్డు అధికారి వెల్లడించారు. ఇప్పటివరకు కోహ్లి, శాస్త్రిలకు అపరిమితమైన అధికారాలను బోర్డు ఇచ్చింది. టీమ్ ఎంపిక, టూర్ షెడ్యూల్, సపోర్టింగ్ స్టాఫ్‌ల విషయంలో ఈ ఇద్దరూ ఏది చెబితే అది అన్నట్లుగా సాగింది. అయితే మరో విదేశీ సిరీస్‌లో దారుణమైన పరాజయాలు కోహ్లి, శాస్త్రిల అధికారాలకు కత్తెర వేయబోతున్నట్లు స్పష్టమవుతున్నది. మూడో టెస్ట్‌లో కూడా ఓడి సిరీస్ కోల్పోతే.. కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలను వీళ్లకు సంధించడానికి బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు బోర్డు అధికారి వెల్లడించారు.

ఈసారి తమకు తగినంత సమయం ఇవ్వలేదని టీమ్ ఫిర్యాదు చేసేందుకు వీల్లేదు. సౌతాఫ్రికాలో సిరీస్ ఓడిపోయినపుడు షెడ్యూల్‌పై ప్లేయర్స్ మండిపడ్డారు. దీంతో ఈసారి వాళ్లతో మాట్లాడిన తర్వాతే ఇంగ్లండ్ టూర్‌లో పరిమిత ఓవర్ల సిరీస్ తర్వాత టెస్ట్ సిరీస్ షెడ్యూల్ చేశాం అని ఆ అధికారి చెప్పారు. ఈ వరుస ఓటముల తర్వాత అసలు కోహ్లి, శాస్త్రిలకు అన్ని అధికారులు ఎందుకు ఇచ్చారన్న ప్రశ్న బీసీసీఐ వర్గాల్లో తలెత్తుతున్నది. సీనియర్ టీమ చెప్పినందుకే అదే సమయంలో ఇండియా ఎ టీమ్‌ను ఇంగ్లండ్‌కు పంపించాం. అందులో ఇద్దరు సీనియర్లు విజయ్, రహానే కూడా ఉన్నారు. వాళ్లు అడిగనవన్నీ ఇచ్చాం. ఇప్పుడు అందుకు తగినట్లు ఫలితాలు రాకపోతే వాళ్లు కొన్ని ప్రశ్నలను ఎదుర్కోవాల్సిందే అని ఆ బీసీసీఐ అధికారి స్పష్టంచేశారు. ఇప్పటికే రవిశాస్త్రి, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ నేతృత్వంలో ఇండియా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌లలో ఓడిందని, ఇప్పుడు ఇంగ్లండ్‌లోనూ అదే పరిస్థితి ఎదుర్కొంటున్నదని ఆయన చెప్పారు. గతంలో ఇంగ్లండ్‌లో సిరీస్ ఓడిపోయినపుడు అప్పటి కోచ్ డంకన్ ఫ్లెచర్‌ను బోర్డు తీసేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

అంటే పరోక్షంగా రవిశాస్త్రికే అదే జరగబోతుందా అన్న అనుమానాలు రేకెత్తించారు. ఇక ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్‌పైనా ఎన్నో విమర్శలు వస్తున్నాయి. అతడు ఫీల్డింగ్ కోచ్ అయిన తర్వాత స్లిప్ ఫీల్డింగ్ దారుణంగా ఉంది. ఇప్పటివరకు స్లిప్ ఫీల్డర్లు 50 క్యాచ్‌లు జారవిడిచారు. ఇక బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్ కూడా విదేశీ సిరీస్‌లకు తగినట్లుగా బ్యాట్స్‌మెన్‌ను సిద్ధం చేయలేకపోతున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీమ్‌ను ఎంపిక చేయడంతోపాటు టూర్ సెలక్షన్ కమిటీలో ఓ సెలక్టర్ భాగం కావాలని గవాస్కర్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాడు. ఆస్ట్రేలియా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నది. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా గాయంతో బాధపడుతున్న కోహ్లి మూడో టెస్ట్‌కు దూరమైతే ఎవరిని కెప్టెన్ చేయాలన్నదానిపైనా చర్చ జరుగుతున్నది. వైస్ కెప్టెన్ రహానేకు మూడో టెస్ట్‌లో ప్లేసే అనుమానంగా మారింది. అతడు లేకపోతే అశ్విన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు.

7417
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS