అమెరికా, కెనడా, మెక్సికోల్లో 2026 వరల్డ్‌కప్

Wed,June 13, 2018 04:47 PM

US Mexico and Canada to host 2026 FIFA World Cup

మాస్కో: 2026 ఫిఫా వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని సొంతం చేసుకున్నాయి నార్త్ అమెరికా దేశాలైన అమెరికా, కెనడా, మెక్సికో. ఈ మూడు దేశాలు కలిపి సంయుక్తంగా బిడ్ దాఖలు చేశాయి. బుధవారం మాస్కోలో జరిగిన సమావేశంలో మొరాకోను వెనక్కి నెట్టి ఈ మూడు దేశాలు ఆతిథ్య హక్కులను సొంతం చేసుకున్నాయి. చివరిసారి అమెరికా 1994లో, మెక్సికో 1986లో వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిచ్చాయి. కెనడా గతంలో ఎప్పుడూ వరల్డ్‌కప్ మ్యాచ్‌లను నిర్వహించలేదు.

రేపటి నుంచి మొదలయ్యే ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ సందర్భంగా మాస్కోలో 68వ ఫిఫా కాంగ్రెస్ జరిగింది. ఇందులోనే అన్ని సభ్య దేశాలు 2026 వరల్డ్‌కప్ ఆతిథ్య దేశం ఎన్నిక కోసం ఓటింగ్‌లో పాల్గొన్నాయి. 2026లో అతిపెద్ద ఫిఫా వరల్డ్‌కప్‌కు ఈ మూడు దేశాలు ఆతిత్యమివ్వనున్నాయి. ఎందుకంటే ఆ టోర్నీలో మొత్తం 48 దేశాలు పాల్గొంటున్నాయి. 34 రోజుల పాటు 80 మ్యాచ్‌లు జరుగుతాయి.

మూడు దేశాలు ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 60 మ్యాచ్‌లు అమెరికాలో ఉంటాయి. క్వార్టర్‌ఫైనల్స్ నుంచి అన్ని మ్యాచ్‌లూ అమెరికాలోనే జరుగుతాయి. మెక్సికో, కెనడాలు చెరో పది మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తాయి. 2018, 2022 వరల్డ్‌కప్‌ల ఆతిథ్యాన్ని రష్యా, ఖతార్‌లకు ఇవ్వడంపై వివాదం చెలరేగింది. దీంతో 2026 ఆతిథ్య హక్కుల కోసం మరింత పారదర్శకంగా వ్యవహరిస్తామని ఫిఫా చెప్పింది. నిజానికి ఈసారి అమెరికాకు హ‌క్కులు ద‌క్క‌క‌పోతే ఫిఫా స‌భ్య దేశాల సంగ‌తి చూస్తానంటూ గ‌తంలోనే ట్రంప్ హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

927
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS