250 సీసీ కెమెరాలతో.. వన్డే మ్యాచ్‌కు బందోబస్తు

Sat,March 2, 2019 07:08 AM

tight security to oneday match at Uppal Stadium

హైదరాబాద్ : దేశ సరిహద్దులో నెలకొన్న పరిస్థితులతో శనివారం జరుగబోయే భారత్-ఆస్ట్రేలియా వన్డే క్రికెట్ డే అండ్ నైట్ మ్యాచ్‌కు రాచకొండ పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆపరేషన్ ఈగిల్-ఐతో స్టేడియంతోపాటు రహదారులను సాంకేతిక పరిజ్ఞానంతో ఒకే గొడుకు కిందకు తెచ్చారు. దీనికోసం 250 సీసీ కెమెరాలతో స్టేడియంతోపాటు బయటి ప్రాంతాలను క్షుణ్ణంగా ప్రతి అడుగును వీక్షించనున్నారు.

గత వారం రోజుల నుంచి స్టేడియాన్ని సాంకేతిక పరంగా మూడుసార్లు రెక్కీ చేసి సమర్థవంతమైన భద్రతను కల్పించారు. కెమెరాల్లోని ప్రతి దృశ్యాన్ని చూసేందుకు కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఐటీ సెల్ విభాగానికి చెందిన 30మంది సిబ్బంది 18 స్ర్కీన్ ల ద్వారా ప్రతి మూలను పరిశీలించనున్నారు. ఇలా సాంకేతికంగా స్టేడియంతో పాటు ఆ చుట్టు పరిసరాలను జల్లెడ పట్టిన పోలీసులు టెక్నాలజీతోపాటు 2300 సిబ్బందిని మోహరించారు.

స్టేడియంలో ప్రతి ప్రేక్షకుడి దృశ్యం రికార్డు..
ఉప్పల్ స్టేడియంలో ప్రవేశించే ప్రతి ప్రేక్షకుడు, అభిమాని చిత్రాన్ని 250సీసీ కెమెరాలు రికార్డు చేయనున్నాయి. స్టేడియంలోని ప్రతి గ్యాలరీని స్పష్టంగా కెమెరాలు చిత్రీకరించనున్నాయి. రాత్రి సమయంలో కూడా దృశ్యాన్ని స్పష్టంగా చిత్రీకరించేందుకు ఇన్‌ఫ్రారెడ్(ఐఆర్) కెమెరాలను ఉపయోగిస్తున్నారు. స్టేడియానికి దారి తీసే రామంతాపూర్, స్ట్రీట్ నం.8, జెన్‌ప్యాక్-హబ్సిగూడ రోడ్డు, ఉప్పల్ రింగ్‌రోడ్డు- స్టేడియం రహదారుల్లోని సీసీ కెమెరాలను కేంద్రీకృత కమాండ్ కంట్రోల్‌కు కనెక్టివిటీని ఇచ్చారు.

46వేల మంది డేటా రెడీ..
స్టేడియం లోపల, బయట అనుమానితులను గుర్తించేందుకు రాచకొండ ఐటీ సెల్ అధికారులు తమ వెంట మొత్తం 46వేల మంది పాత నేరస్తులతోపాటు మరికొంత మంది అనుమానితుల ఫొటోలను రెడీగా పెట్టుకున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న సమయంలో ఏ చిన్న అనుమానం వచ్చినా ఆ ఫొటోను ప్రత్యేకంగా క్రాప్ చేసుకుని దానిని ఫేషీయల్ రిైగ్నెజేషన్ యాప్‌లో వేసుకుని పరిశీలిస్తే వెంటనే వారికి సమాచారం తెలిసిపోతుంది. అనుమానం ఉంటే పోలీసు సోషల్ మీడియాల ద్వారా దేశవ్యాప్తంగా సమాచారం మార్పిడి చేసుకుని సమాచారాన్ని నిమిషాల్లో సేకరించుకోనున్నారు. ఈ విధంగా రాచకొండ పోలీసులు సమర్థవంతమై టెక్నాలజీతో కూడిన బందోబస్తును కల్పించారు.

ప్రతీ దృశ్యాన్ని వీక్షిస్తాం..
క్రికెట్ అభిమానులకు, ప్రేక్షకులకు పూర్తి సేఫ్టీని అందిస్తాం. టెక్నాలజీతో ప్రతి దృశ్యాన్ని స్పష్టంగా వీక్షిస్తాం. పోలీసు కమిషనర్‌తోపాటు ఉన్నతాధికారులు ఎక్కడి నుంచైనా వారి ఫోన్లలో మ్యాచ్ భద్రతకు ఏర్పాటు చేసిన 250 సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించే సౌకర్యాన్ని కల్పించాం. మా సిబ్బంది శనివారం ప్రతి సెకన్‌ను రెప్పార్పకుండా సీసీ కెమెరాల దృశ్యాలను చూడనున్నారు.
- శ్రీధర్‌రెడ్డి, రాచకొండ ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్

1804
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles