స్పిన్ ఎలా ఆడాలంటే.. ఆసీస్‌కు ఇండియన్ ప్లేయర్స్ పాఠాలు

Tue,September 25, 2018 03:31 PM

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఒకప్పుడు ప్రపంచ చాంపియన్‌గా ఉన్నా.. దశాబ్దాల పాటు క్రికెట్‌ను ఏలినా.. ఉపఖండం అంటే మాత్రం చచ్చేంత వణుకు. ఇక్కడి స్పిన్ పిచ్‌లంటే కంగారు పడతారు ఆ టీమ్ బ్యాట్స్‌మెన్. అందుకే ప్రపంచమంతా జయించి వచ్చినా.. ఇండియా, శ్రీలంక, పాకిస్థాన్‌లాంటి దేశాల్లో మాత్రం ఆసీస్ రికార్డు అంతంతమాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆస్ట్రేలియా.. పాకిస్థాన్‌తో పూర్తిస్థాయి సిరీస్‌కు సిద్ధమవుతున్నది. యూఏఈలో ఈ రెండు టెస్ట్‌ల సిరీస్ జరగనుంది. అక్కడ కూడా దాదాపుగా ఉపఖండంలాంటి పరిస్థితులే ఉన్నాయి. పైగా బాల్ టాంపరింగ్ ఉదంతంలో స్మిత్, వార్నర్ ఏడాది నిషేధం ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడిప్పుడే ఆ టీమ్ కొత్త కెప్టెన్ టిమ్ పైన్, కోచ్ జస్టిన్ లాంగర్ నేతృత్వంలో మళ్లీ పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నది.

అయితే వాళ్లకు పాకిస్థాన్ స్పిన్ బౌలింగ్ రూపంలో పెద్ద సమస్య ఎదురైంది. కచ్చితంగా ఆ టీమ్ తమపై స్పిన్‌తోనే దాడి చేస్తుందని భావించిన ఆస్ట్రేలియా.. అందుకు పూర్తిగా సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఆసీస్‌కు ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ స్పిన్ ఎలా ఆడాలో సూచనలు ఇస్తున్నారు. గతంలో తమ స్పిన్ కన్సల్టెంట్‌గా ఉన్న శ్రీధరన్ శ్రీరామ్‌ను మరోసారి ఆసీస్ టీమ్ పిలిచింది. అతడు తనతోపాటు ఇద్దరు స్పిన్నర్లు పర్‌దీప్ సాహు, కేకే జియాస్‌లను తీసుకెళ్లాడు. ఇందులో సాహు ఆసీస్ ఓపెనర్ ఫించ్‌తో కలిసి ఐపీఎల్ టీమ్ కింగ్స్ పంజాబ్‌కు ఆడాడు. ఇక జియాస్ గతంలో ఇండియా టూర్‌కు వచ్చిన ఆసీస్‌తో కలిసి ప్రాక్టీస్ చేశాడు. ఈ ముగ్గురూ ఇప్పుడు నెట్స్‌లో ఆసీస్ ప్లేయర్స్‌తో కలిసి చెమటోడుస్తున్నారు.

వీళ్లు చాలా విలువైన సూచనలు ఇస్తున్నారని, అవి తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఆసీస్ పేస్ బౌలర్ పీటర్ సిడిల్ చెప్పాడు. గతంలో 2014లో ఇదే యూఏఈలో పాకిస్థాన్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడిన ఆసీస్.. 0-2తో ఓడిపోయింది. ఆ సిరీస్‌లో పాకిస్థాన్ స్పిన్నర్లు జుల్ఫికర్ బాబర్, యాసిర్ షాలే ఆ టీమ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత శ్రీలంక, ఇండియాల్లోనూ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లు ఓడిపోయింది.

1521
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles