ధోనీ రిటైర్మెంట్‌పై చీఫ్ సెలక్టర్ కీలక వ్యాఖ్యలు

Tue,February 12, 2019 12:11 PM

ముంబై: మరోసారి వరల్డ్‌కప్ గెలవాలనుకుంటున్న టీమిండియాలో మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎమ్మెస్ ధోనీ పాత్ర ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మెగా టోర్నీలో ధోనీయే కీలకం కానున్నాడు అని చాలా మంది మాజీ క్రికెటర్లు కూడా చెప్పారు. అందులోనూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టూర్లలో ధోనీ ఫామ్‌లోకి రావడం కూడా టీమ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అయితే వరల్డ్‌కప్‌లో ధోనీ ఎలాంటి పాత్ర పోషించబోతున్నాడు అనేది పక్కన పెడితే.. ఈ టోర్నీ తర్వాత అతడు క్రికెట్ నుంచి పూర్తి తప్పుకోనున్నాడన్న వార్తలు ఇప్పటికే చాలాసార్లు వచ్చాయి. ఇప్పుడీ అంశంపై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌కప్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరగలేదని ప్రసాద్ స్పష్టం చేశాడు.


మేము దీనిపై చర్చించలేదు. ఎందుకంటే వరల్డ్‌కప్‌లాంటి మెగా టోర్నీకి ముందు ఇలాంటి అంశాలపై చర్చ సరి కాదు. దీనివల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. ప్రస్తుతం ట్రోఫీ గెలిచే దిశగా పూర్తి సామర్థ్యంతో టీమ్ సిద్ధమవుతున్నది అని ఎమ్మెస్కే చెప్పాడు. ధోనీ ఫామ్‌పైనా అతను స్పందించాడు. ధోనీ ఎన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడగలిగితే అంతగా ఫామ్‌లోకి వస్తాడని, ఆ లెక్కన ఐపీఎల్ అతనికి బాగా కలిసొస్తుందని చెప్పాడు. వరల్డ్‌కప్‌కు వెళ్లే ముందు ప్లేయర్స్ ఐపీఎల్ ఆడనున్నారు. ఆ లెక్కన ధోనీ 14 నుంచి 16 మ్యాచ్‌లు ఆడతాడు. అది ధోనీకి బాగా ఉపయోగపడుతుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టూర్లలో అతని బ్యాటింగ్ నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది అని ప్రసాద్ అన్నాడు.

5332
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles