అభిమానం అంటే ఇదీ.. వరల్డ్‌కప్ చూడటానికి ఏం చేశాడో చూడండి!

Thu,June 21, 2018 12:38 PM

This Football fan from India travel all the way from Dubai to Moscow on Bicycle

మాస్కో: అతనికి ఫుట్‌బాల్ అంటే పిచ్చి. అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీకి వీరాభిమాని. ఈసారి ఎలాగైనా రష్యా వెళ్లి ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ చూడాలనుకున్నాడు. కానీ రష్యాకు విమానంలో వెళ్లేంత డబ్బు అతని దగ్గర లేదు. దీంతో కేరళ నుంచి దుబాయ్ వెళ్లి.. అక్కడి నుంచి ఏకంగా సైకిల్‌పై రష్యా రాజధాని మాస్కో వెళ్లాడు. అతని పేరు క్లిఫిన్ ఫ్రాన్సిస్. కేరళకు చెందిన మ్యాథ్స్ టీచర్. వేలాది మంది అభిమానులతో కలిసి మొన్న లుజ్నికి స్టేడియంలో జరిగిన ఫ్రాన్స్, డెన్మార్క్ మ్యాచ్‌ను చూశాడు. అయితే అతను ఏకంగా 4 వేల కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ మాస్కో చేరుకోవడం విశేషం.

షార్జా నుంచి ఇరాన్‌కు బోటులో వెళ్లి అక్కడి నుంచి మాస్కోకు రోడ్డు మార్గం ద్వారా సైకిల్‌పై వెళ్లాడు. అతను ఈ క్రమంలో ఇరాన్, అజర్‌బైజాన్‌లను దాటాడు. జార్జియా మీదుగా కూడా వెళ్లాల్సి ఉన్నా.. వీసాను నిరాకరించారు. దీంతో తాను కాస్త ఇబ్బంది పడినట్లు ఫ్రాన్సిస్ చెప్పాడు. కేరళలోని అలెప్పికి చెందిన ఫ్రాన్సిస్ మొదల కొచ్చి నుంచి దుబాయ్‌కు విమానంలో వెళ్లాడు. తాను ఇండియా నుంచే రష్యా వరకు సైకిల్‌పై వెళ్లాలనుకున్నా.. మధ్యలో పాకిస్థాన్ వీసా కష్టమని తెలిసి దుబాయ్‌కు వెళ్లినట్లు అతను తెలిపాడు. మొత్తానికి కేరళ నుంచి రష్యా చేసుకోవడానికి అతనికి అయిన ఖర్చు కేవలం వెయ్యి డాలర్లు మాత్రమే.

ఫ్రాన్సిస్ ఓ ఫ్రీలాన్స్ మ్యాథ్స్ టీచర్. జీమ్యాట్, క్యాట్, సాట్‌లాంటి ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యేవాళ్లకు కోచింగ్ ఇస్తుంటాడు. లాంగ్ జర్నీలను ఇష్టపడే అతను గతంలోనూ ఇలాగే లావోస్, థాయ్‌లాండ్, వియత్నాం, కంబోడియా దేశాల్లో పర్యటించాడు. ఇప్పటి జర్నీ గురించి మాట్లాడుతూ.. జార్జియా బోర్డర్‌లో చిక్కుకుపోయినప్పుడు ఓ జర్మన్ సైక్లిస్ట్ తన సిమ్ కార్డు ఇచ్చి ఆదుకున్నాడని ఫ్రాన్సిస్ చెప్పాడు. అతను తిరిగి అజర్‌బైజాన్ వచ్చి అక్కడి నుంచి మరో దారిలో జూన్ 5న రష్యాలోకి అడుగుపెట్టాడు. తాను అడుగుపెట్టిన ప్రతి దేశంలో ప్రజలు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారని అతను తెలిపాడు. ఇంత‌కీ అత‌ను ఇండియా నుంచి మాస్కో జ‌ర్నీ ఎప్పుడు స్టార్ట్ చేశాడో తెలుసా.. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 23. అంటే దాదాపు మూడున్న‌ర నెల‌లు ప‌ట్టింది మొత్తం జ‌ర్నీ పూర్తి చేయ‌డానికి.

తన అభిమాన ప్లేయర్ మెస్సీని కలవాలని అనుకుంటున్నట్లు ఫ్రాన్సిస్ వెల్లడించాడు. తన దగ్గర ఎక్కువగా డబ్బు లేకపోవడంతో కేవలం ఒక్క గ్రూప్ స్టేజ్ మ్యాచ్ చూడటానికి మాత్రమే వంద డాలర్లు ఖర్చు చేసినట్లు చెప్పాడు. తన వెంట ఓ టెంట్, స్లీపింగ్ బ్యాగ్, సైకిల్ రిపేర్ వస్తే చేసుకునే కిట్, కొన్ని బట్టలు మాత్రమే తీసుకొని వెళ్లాడు. తన ప్రయాణాలపై ఓ బుక్ రాయాలన్నది ఫ్రాన్సిస్ కల. అంతేకాదు 2020లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌లో ఇండియాను సపోర్ట్ చేయడానికి తాను మళ్లీ సైకిల్‌పై వెళ్తానని చెప్పాడు. మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, చైనా, మంగోలియా, రష్యా వరకు వెళ్లి అక్కడి నుంచి బోటులో జపాన్ చేరుకోవాలన్నది తన ప్లాన్ అని ఫ్రాన్సిస్ అన్నాడు.

3086
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles