క్రికెట్ ‘బాస్‌’గా టీమిండియా మరోసారి నిరూపించుకుంది: అక్తర్

Tue,November 12, 2019 04:09 PM

హైదరాబాద్: టీమిండియా క్రికెట్ ‘బాస్‌’గా మరోసారి నిరూపించుకుందని పాకిస్తాన్ మాజీ స్పీడ్ స్టర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అన్నారు. ఇండియా-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ.. ఇండియా తిరిగి పుంజుకున్న తీరు అద్భుతమని అక్తర్ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. మొదటి మ్యాచ్‌లో ముష్ఫికర్ ఆటతీరుతో అలవోకగా గెలిచిన బంగ్లా, చివరి రెండు మ్యాచ్‌ల్లో చేతులెత్తేసింది. ఫలితంగా సిరీస్ 2-1తో భారత్ సొంతమైంది. రెండో మ్యాచ్‌లో భారత్ స్టాండ్-ఇన్ కెప్టెన్ రోహిత్ తన అద్భుతమైన ఆటతో ఇండియాను విజయతీరాలకు చేర్చాడు. దీంతో సిరీస్ సమమైంది. నిర్ణాయాత్మకమైన మూడో టీ 20లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 174/5తో నిలిచింది. రెండో మ్యాచ్‌లో ఇరగదీసిన కెప్టెన్ రోహిత్ రెండో ఓవర్లోనే వెనుదిరగడం, మరి కాసేపటికే ధావన్(19) ఔటవడంతో ఇండియా మ్యాచ్‌లో వెనుకబడింది. కానీ, వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ కే ఎల్ రాహుల్(52), శ్రేయాస్ అయ్యర్(62: 3 బౌండరీలు, 5 సిక్సర్లు) విరుచుకుపడడంతో భారత్ కోలుకుంది. వీరిరువురూ.. వెనువెంటనే ఔటైనప్పటికీ, మానీష్ పాండే చివర్లో విలువైన పరుగులు జోడించి.. భారత్‌కు గౌరవప్రదమైన స్కోరును సాధించిపెట్టారు.


175 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. ఓపెనర్ నయీమ్(48 బంతుల్లో 81, 10 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగినప్పటికీ.. అతనికి మిగితా బ్యాట్స్‌మెన్ నుంచి సరైన సహకారం అందలేదు. భారత్ బౌలర్లలో దీపక్ చాహర్ హ్యాట్రిక్ సహా 6 వికెట్లు పడగొట్టి, టీ 20ల్లోనే అద్భుతమైన రికార్డు లిఖించాడు. యువ బౌలర్ శివమ్ దుబే కీలకమైన నయీం వికెట్ సహా 3 వికెట్లు పడగొట్టాడు. చాహల్ సైతం ఒక వికెట్ తీసి, టీ 20ల్లో 50 వికెట్లు సాధించిన మూడో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కాగా, ఇండియా, బంగ్లా మధ్య టెస్టు సిరీస్ ఈ నెల 14 నుంచి ప్రారంభమవుతుంది.

1839
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles