
హరారె: టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ మహ్మద్ కైఫ్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. పాకిస్థాన్ టీమ్‌కు శుభాకాంక్షలు చెబుతూ అతడు చేసిన ట్వీట్ వివాదమవుతున్నది. జింబాబ్వేలో జరిగిన టీ20 ట్రై సిరీస్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఆరు వికెట్లతో గెలిచి ట్రోఫీ ఎగరేసుకుపోయింది పాకిస్థాన్. ఆ టీమ్ ఓపెనర్ ఫకర్ జమాన్ 91 పరుగులు చేశాడు. దీంతో పాక్ టీమ్‌ను, ఫకర్ జమాన్‌ను పొగుడుతూ కైఫ్ ఓ ట్వీట్ చేశాడు.
ఇది అభిమానులకు అస్సలు రుచించలేదు. పాక్ టీమ్‌ను పొగుడుతావా అంటూ కైఫ్‌తో ఆడుకోవడం మొదలుపెట్టారు. దేశ ద్రోహి అని ఒకరు.. పాకిస్థాన్‌పై అంత ప్రేమ ఎందుకు అని మరొకరు.. ఇలా కైఫ్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్‌కు దిగి 20 ఓవర్లలో 8 వికెట్లకు 183 పరుగులు చేసింది. ఓపెనర్ షార్ట్ 76 పరుగులు చేశాడు. తర్వాత చేజింగ్ మొదలుపెట్టిన పాకిస్థాన్.. 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేజ్ చేసింది. జమాన్ కేవలం 46 బంతుల్లో 91 పరుగులు చేశాడు. ఈ ముక్కోణపు సిరీస్‌లో జింబాబ్వే కూడా ఆడింది.