ఆత్మవిశ్వాసంతో భారత్.. టీ20 సిరీస్ ఫైనల్ నేడు!

Sun,March 18, 2018 08:31 AM

t20 final match between india and bangladesh will be played today in colombo

కొలంబో: శ్రీలంక 70వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని జరుగుతున్న నిదహాస్ ముక్కోణపు టీ20 టోర్నీ చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం భారత్, బంగ్లాదేశ్ మధ్య ఫైనల్ పోరు జరుగనుంది. లంక చేతిలో తొలిమ్యాచ్‌లో ఓటమి మినహాయిస్తే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయాలతో రోహిత్‌శర్మ సారథ్యంలోని టీమ్‌ఇండియా తుదిపోరులో నిలిచింది. మరోవైపు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ లంకను రెండుసార్లు మట్టికరిపించిన బంగ్లా టైగర్స్ కప్ వేటలోకి దూసుకొచ్చారు. భవిష్యత్ పర్యటనలను దృష్టిలో పెట్టుకుని కోహ్లీ, ధోనీ, భువనేశ్వర్, బుమ్రా లాంటి సీనియర్లకు విశ్రాంతినిచ్చిన టీమ్‌ఇండియా మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా, జైదేవ్ ఉనద్కట్ యువ క్రికెటర్లకు అవకాశం కల్పించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అంతగా అనుభవం లేకపోయినా మెండైన ఆత్మవిశ్వాసంతో కుర్రాళ్లు అందిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా చెన్నై కుర్ర స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్..తరుపుముక్కగా కనిపిస్తున్నాడు. వైవిధ్యమైన స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను పడగొడుతున్నాడు. మరోవైపు బంగ్లా అంచనాలను మించి రాణిస్తున్నది. సొంతగడ్డపైనే కాదు విదేశాల్లోనూ రాణిస్తామని చాటిచెబుతూ ప్రత్యర్థులకు దీటైన సమాధానమిస్తున్నది. అటు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అదురగొడుతూ అద్భుత విజయాలను సొంతం చేసుకుంటున్నది. ఓవైపు సహచరులు విఫలమవుతున్నా..తాను ఉన్నానంటూ ముష్ఫీకర్ రహీమ్ వీరోచిత ఇన్నింగ్స్‌తో విజృంభిస్తున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా గెలుపు లక్ష్యంగా బంగ్లా టైగర్స్ పోరాడుతున్నారు.

రోహిత్, ధవన్ రాణిస్తే
ప్రతిభ పరంగా చూస్తే బంగ్లాదేశ్ కంటే భారత్ మెరుగ్గా కనిపిస్తున్నది. పూర్తి జట్టుగానే కాకుండా ఆటగాళ్లను వ్యక్తిగతంగా పోల్చిచూసినా టీమ్‌ఇండియా ఒక మెట్టుపైనే ఉంది. ఓపెనర్లు ధవన్ మంచి ఫామ్‌మీదుండగా, గత మ్యాచ్‌లో లంకపై అర్ధసెంచరీతో రోహిత్ మళ్లీ టచ్‌లోకి వచ్చాడు. వీరిద్దరు గనుక మెరుగైన శుభారంభమిస్తే భారత్‌కు భారీ స్కోరు సాధించినట్లే. రుబెల్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్‌తో కూడిన పేస్ ద్వయాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ రోహిత్, ధవన్ ద్వయం పరుగులు కొల్లగొట్టాలి. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తున్న రైనా తన బ్యాటు ఝులిపిస్తే బంగ్లా బౌలర్లకు కష్టాలు తప్పకపోవచ్చు. మిడిలార్డర్‌లో లోకేశ్ రాహుల్, మనీశ్‌పాండే, దినేశ్ కార్తీక్, సుందర్ తలో చేయి వేస్తే మన గెలుపు నల్లేరే మీద నడకే. బ్యాటింగ్‌లో ఒకింత పటిష్టంగా కనిపిస్తున్న భారత్‌ను బౌలింగ్ కొంత కలవరపెడుతున్నది. హైదరాబాదీ మహ్మద్ సిరాజ్, జైదేవ్ ఉనద్కట్ ప్రత్యర్థికి భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. కీలక సమయాల్లో ఒత్తిడిలోనవుతూ ఆకట్టుకోలేకపోతున్నారు. మరోవైపు చెన్నై స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ పవర్‌ప్లే ఓవర్లలో అదురగొడుతున్నాడు. పరుగులు ఇవ్వడంలోనూ పిసినారీ తనం పాటిస్తూ ఆరంభంలోనే ప్రత్యర్థిని దెబ్బకొడుతున్నాడు. ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌కు అదృష్టం కలిసి రావడం లేదు. తన బౌలింగ్‌లో క్యాచ్‌లు నేలపాలు కావడం అతన్ని నిరాశలో పడేస్తున్నది. బౌలింగ్ విభాగం సమిష్టిగా రాణిస్తే..బంగ్లాకు కష్టమే కావచ్చు.

జోరు సాగిస్తారా
వరుస విజయాల జోరును బంగ్లాదేశ్ కొనసాగిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తమదైన రోజున ఎంతటి ప్రత్యర్థినైనా ఓడించడంలో బంగ్లా టైగర్స్ సమర్థులు. లంకపై రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలతో ఇది ప్రస్ఫుటమైంది. రికార్డు లక్ష్యఛేదనతో పాటు కీలకమైన ఆఖరి మ్యాచ్‌లో ఉత్కంఠ విజయంతో ఫైనల్లోకి దూసుకొచ్చారు. టాపార్డర్‌లో సీనియర్ తమీమ్ ఇక్బాల్ అంతగా ఆకట్టుకోలేకపోతున్న యువ బ్యాట్స్‌మన్ లిట్టన్ దాస్ కుదురుకుంటే పరుగుల వరద ఖాయం. మిడిలార్డర్‌లో కెప్టెన్ షకీబల్ హసన్, ముష్ఫీకర్ రహీమ్, మహ్మదుల్లా, షబ్బీర్ రెహమాన్ విజృంభిస్తే..కట్టడి చేయడం యువ భారత బౌలర్లకు కష్టమే.

జట్ల అంచనా
భారత్: రోహిత్‌శర్మ(కెప్టెన్), ధవన్, రైనా, రాహుల్, మనీశ్‌పాండే, దినేశ్‌కార్తీక్, వాషింగ్టన్ సుందర్, విజయ్ శంకర్, చాహల్, శార్దుల్ ఠాకూర్, సిరాజ్/జైదేవ్.

బంగ్లాదేశ్: షకీబల్(కెప్టెన్), తమీమ్, లిటన్‌దాస్, షబ్బీర్, ముష్ఫీకర్, సౌమ్య సర్కార్, మహ్మదుల్లా, మిరాజ్, ముస్తాఫిజుర్, రుబెల్ హుస్సేన్, నజ్ముల్ ఇస్లాం.

3132
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles