ప్లేఆఫ్‌లో సన్‌రైజర్స్!

Tue,May 8, 2018 04:15 AM

SunRisers Hyderabad Beat Royal Challengers Bangalore By 5 Runs

-సమిష్టి ప్రదర్శనతో అదుర్స్..
-బెంగళూరుపై ఉత్కంఠ విజయం..
-కోహ్లీసేన ప్లేఆఫ్ ఆశలు గల్లంతు


సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోమారు అద్భుతం చేసింది. ఎంతటి స్వల్ప లక్ష్యాన్ని అయినా నిలుపుకోగల్గుతామని నిరూపించింది. ప్రత్యర్థి ఎవరైనా తమ సూపర్ బౌలింగ్‌తో పడుగొడుదామని చాటిచెబుతూ వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సొంతగడ్డపై ఆఖరి వరకు నువ్వానేనా అన్న రీతిలో సాగిన మ్యాచ్‌లో బెంగళూరును కట్టడిచేస్తూ హైదరాబాద్ ప్లేఆఫ్ రేసులో మరింత ముందంజ వేసింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో సమిష్టిగా రాణించడంతో రైజర్స్ గెలుపు నల్లేరుపై నడకే అయ్యింది. తప్పక విజయం సాధించి తీరాల్సిన మ్యాచ్‌లో కోహ్లీసేన ఆఖరి మెట్టుపై బొక్కాబోర్లా పడి దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించింది.

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తిరుగులేకుండా పోయింది. వేదిక ఏదైనా గెలుపును ఆలంభనగా మార్చుకున్న హైదరాబాద్ వరుస విజయాల జోరును కొనసాగిస్తున్నది. సోమవారం రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 141/6 స్కోరుకు పరిమితమైంది. కెప్టెన్ కోహ్లీ(39), గ్రాండ్‌హోమీ(33) మినహా ఎవరూ రాణించలేకపోయారు. షకీబల్ హసన్(2/36) రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. తొలుత కెప్టెన్ విలియమ్సన్(56) అర్ధసెంచరీకి తోడు షకీబల్‌హసన్(35) రాణింపుతో హైదరాబాద్ 20 ఓవర్లలో 146/10 స్కోరు చేసింది. సిరాజ్(3/25), సౌథీ(3/30) మూడేసి వికెట్లు తీశారు. అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలకమైన విలియమ్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

బెంగళూరు బేజారు: లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరుకు పార్థివ్‌పటేల్(20) రూపంలో ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. వరుస బౌండరీలతో దూకుడు మీద కనిపించిన పార్థివ్‌ను షకీబల్ హసన్(1/36) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేసిన పార్థివ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చి రావడంతోనే కోహ్లీ తన లక్ష్యమెంటో స్పష్టం చేశాడు. మనన్ వోహ్రా(8) జతగా షకీబల్‌ను కోహ్లీ ఓ ఫోర్, సిక్స్, ఫోర్‌తో 15 పరుగులు పిండుకున్నాడు. అదే జోరులో కౌల్ బౌలింగ్‌లో ఓ ఫోర్‌తో రైనా(4801)ను అధిగమిస్తూ ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా విరాట్(4814) నిలిచాడు.

ఓవైపు కెప్టెన్ బ్యాటు ఝులిపిస్తున్నా..మరో ఎండ్‌లో అప్పటికే ఓసారి ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ వోహ్రాను సందీప్‌శర్మ క్లీన్‌బౌల్డ్ చేశాడు. తన టీ20 కెరీర్‌లో తొలిసారి యువ స్పిన్నర్ రషీద్‌ఖాన్‌ను ఎదుర్కొన్న కోహ్లీ 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ నుంచి బయపడ్డాడు. కానీ తనకు దక్కిన అవకాశాన్ని నిలుపుకోవడంలో విఫలమైన కోహ్లీ ఆ మరుసటి ఓవర్లోనే యూసుఫ్ పఠాన్ క్యాచ్‌తో వెనుదిరిగాడు. కోహ్లీని అనుసరిస్తూ డివిలీయర్స్(5), మొయిన్ అలీ(10) వెంటవెంటనే నిష్కమించడంతో బెంగళూరు 84 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయిం కష్టాల్లో పడింది. ఈ తరుణంలో మణ్‌దీప్‌సింగ్(21 నాటౌట్), గ్రాండ్‌హోమీ(33) గెలుపు దిశగా నడిపించే ప్రయత్నం చేశారు. వీరిద్దరు హైదరాబాద్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ కీలక పరుగులు జోడించారు. మఖ్యంగా గ్రాండ్‌హోమీ..భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ లక్ష్యాన్ని కుదించే పనిలో పడ్డాడు. అయితే హైదరాబాద్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బెంగళూరు విజయానికి అడ్డుకట్ట వేసింది. పేసర్లకు తోడు స్పిన్నర్లు చెలరేగడంతో హైదరాబాద్ ఖాతాలో మరో గెలుపు చేరింది. షకీబల్‌కు రెండు వికెట్లు దక్కగా, సందీప్‌శర్మ, భువనేశ్వర్, కౌల్, రషీద్‌ఖాన్ ఒక్కో వికెట్ తీశారు.

విలియమ్సన్ జోరు: మొదట టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ కోహ్లీ లక్ష్యఛేదన వైపు మొగ్గుచూపాడు. వరుస విజయాలతో దూకుడు మీదున్న హైదరాబాద్ జట్టు ఎలాంటి మార్పుల్లేకుండానే బరిలోకి దిగగా, బెంగళూరు తరఫున మొయిన్ అలీ, మనన్ వోహ్రా తుది జట్టులోకి వచ్చారు. మహ్మద్ సిరాజ్(3/25), సౌథీ(3/30) విజృంభణతో సహచరులు అంతగా ఆకట్టుకోలేకపోయిన వేళ విలియమ్సన్(56) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 146/10 స్కోరుకు పరిమితమైంది. సొంతగడ్డపై పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవాలనుకున్న సన్‌రైజర్స్‌కు అంత మెరుగైన ఆరంభమేమి దక్కలేదు. ఓపెనర్లు అలెక్స్ హేల్స్(5), ధవన్(13) నిరాశపరిచారు. సౌథీ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో హేల్స్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. క్రాస్ సీమ్ డెలివరీని సరిగా అర్థం చేసుకోని హేల్స్ మూల్యం చెల్లించుకున్నాడు. హేల్స్‌ను అనుసరిస్తూ సిరాజ్ బౌలింగ్‌లో ధవన్ కూడా నిష్క్రమించడంతో హైదరాబాద్ పవర్‌ప్లే ముగిసే సరికి 2 వికెట్లకు 38 పరుగులు చేసింది. ఓవైపు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు విలియమ్సన్ ప్రయత్నించినా అవతలి ఎండ్ నుంచి సరైన సహకారం లేకపోయింది.

లీగ్‌లో తన చెత్త ఫామ్‌కు కొనసాగింపుగా మనీశ్‌పాండే(5)..చాహల్‌కు వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన షకీబల్ హసన్(35)..విలియమ్సన్‌కు జత కలిశాడు. వీరిద్దరు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. అలీ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలతో ఆకట్టుకున్న షకీబల్ ఆ తర్వాత బ్యాటు ఝులిపించడంలో విఫలమయ్యాడు. ఓ దశలో రైజర్స్‌కు పరుగుల రాక కష్టమైంది. ఓవైపు ఓవర్లు అయిపోతుండటంతో లాభం లేదనుకున్న విలియమ్సన్ గేరు మార్చాడు. ఉమేశ్ బౌలింగ్‌లో ఓ ఫోర్, సిక్స్‌తో ఊపులోకి వచ్చాడు. ఆ తర్వాత అదే దూకుడు మీద సిక్స్ సంధించిన విలియమ్సన్ ఈ సీజన్‌లో ఐదో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోరుబోర్డును పరిగెత్తించే క్రమంలో భారీ షాట్‌కు ప్రయత్నించిన విలియమ్సన్ నాలుగో వికెట్‌గా నిష్క్రమించాడు. దీంతో 64 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక్కణ్నుంచి హైదరాబాద్ ఏ దశలోనూ తేరుకోలేకపోయింది.

22 పరుగులకు 6 వికెట్లు: విలియమ్సన్ ఔట్ తర్వాత హైదరాబాద్ 22 పరుగుల తేడాతో ఆఖరి 6 వికెట్లు కోల్పోయింది. వరుస బౌండరీలతో స్కోరుబోర్డుకు పరుగులు జతచేసే ప్రయత్నంలో షకీబల్..సౌథీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత సిరాజ్ ఒకే ఓవర్లో యూసుఫ్ పఠాన్(12), సాహా(8) పెవిలియన్ పంపాడు. దీంతో రైజర్స్‌కు కోలుకునే అవకాశం లేకుండా పోయింది. ఆఖరి ఓవర్ రెండో బంతికి కోహ్లీ సూపర్ త్రో ద్వారా రషీద్‌ఖాన్(1) రనౌట్ కాగా, రెండు బంతుల తేడాతో సిద్ధార్థ్ కౌల్(1) , సందీప్‌శర్మ(0) ఔట్ కావడంతో హైదరాబాద్ 146 పరుగులకు ఆలౌటైంది. ఉమేశ్‌యాదవ్(1/36), చాహల్(1/25) ఒక్కో వికెట్ దక్కింది.

స్కోరు బోర్డు

హైదరాబాద్: హేల్స్(బి)సౌథీ 5, ధవన్(సి)సౌథీ(బి)సిరాజ్ 13, విలియమ్సన్ (సి)మణ్‌దీప్(బి)ఉమేశ్ 56, మనీశ్‌పాండే(సి)కోహ్లీ(బి)చాహల్ 5, షకీబల్(సి)ఉమేశ్(బి)సౌథీ 35, యూసుఫ్ పఠాన్(బి)సిరాజ్ 12, సాహా(బి)సిరాజ్ 8, రషీద్‌ఖాన్(రనౌట్) 1, భువనేశ్వర్ 1 నాటౌట్, కౌల్(రనౌట్) 1, సందీప్‌శర్మ(ఎల్బీ)సౌథీ 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 146 ఆలౌట్; వికెట్ల పతనం: 1-15, 2-38, 3-48, 4-112, 5-124, 6-134, 7-143, 8-144, 9-146, 10-146; బౌలింగ్: అలీ 3-0-19-0, ఉమేశ్ 4-0-36-1, సౌథీ 4-0-30-3, సిరాజ్ 4-0-25-3, చాహల్ 4-0-25-1, గ్రాండ్‌హోమీ 1-0-8-0.

బెంగళూరు: వోహ్రా 3 నాటౌట్, పార్థివ్ పటేల్ (ఎల్బీ)షకీబల్ 20, కోహ్లీ (సి)పఠాన్(బి)షకీబల్ 39, డివిలీయర్స్(బి)రషీద్‌ఖాన్ 5, అలీ(సి)సాహా(బి)కౌల్ 10, మణ్‌దీప్‌సింగ్ 21 నాటౌట్, గ్రాండ్‌హోమీ (బి) భువనేశ్వర్ 33, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 141/6; వికెట్ల పతనం: 1-24, 2-60, 3-74, 4-80, 5-84, 6-141; బౌలింగ్: సందీప్‌శర్మ 4-0-20-1, భువనేశ్వర్ 4-0-27-1, షకీబల్ 4-0-36-2, కౌల్ 4-0-36-2, రషీద్‌ఖాన్ 4-0-31-1.

6585
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles