ముంబైని కూల్చారు

Wed,April 25, 2018 01:21 AM

Sunrisers Hyderabad beat Mumbai Indians by 31 runs

-కౌల్, రషీద్ ఖాన్, థంపీ విజృంభణ ..
-87 పరుగులకే రోహిత్ సేన ఆలౌట్
-లోస్కోరింగ్ మ్యాచ్‌లో అద్భుత విజయం
సన్‌రైజర్స్ హైదరాబాద్ దెబ్బతిన్న బెబ్బులిలా విజృంభించింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమితో కసిమీదున్న రైజర్స్..ముంబైతో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. హైదరాబాద్ బౌలర్లు సిద్దార్థ్ కౌల్, రషీద్‌ఖాన్, బాసిల్ థంపీ వీరవీహారంతో స్వల్ప లక్ష్యఛేదనలో ముంబై 100లోపే కుప్పకూలింది. పదునైన పేస్‌కు తోడు సుడులు తిరిగే స్పిన్‌తో ముంబైని ముప్పుతిప్పలు పెట్టి హైదరాబాద్ అద్భుత విజయాన్ని ఒడిసిపట్టుకుంది. గెలుపు బాట పడుదామనుకున్న రోహిత్‌సేన ఆశలకు సొంత ఇలాఖాలోనూ నిరాశే ఎదురైంది.

ముంబై: ముంబై మారలేదు. సొంతగడ్డ వాంఖడే స్టేడియంలో అభిమానులను మరోమారు నిరాశపరిచింది. మంగళవారం జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 31 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై అద్భుత విజయాన్నందుకుంది. హైదరాబాద్ నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యఛేదనలో సిద్దార్థ్ కౌల్(3/23), రషీద్‌ఖాన్(4-1-11-2), థంపీ(2/4) ధాటికి ముంబై 18.5 ఓవర్లలో 87 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్(34), కృనాల్ పాండ్యా(24) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. తొలుత

విలియమ్సన్(29), యూసుఫ్ పఠాన్(29) బ్యాటింగ్‌తో హైదరాబాద్ 18.4 ఓవర్లలో 118 పరుగులు చేసింది. మెక్‌క్లీగన్, హార్దిక్, మార్కండే రెండేసి వికెట్లు తీశారు. పొదుపైన బౌలింగ్‌తో జట్టు గెలుపులో కీలకమైన రషీద్‌ఖాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. మ్యాచ్ మొత్తమ్మీద రెండు సిక్స్‌లు మాత్రమే నమోదయ్యాయి.

తీరుమారని ముంబై: సొంతగడ్డపై ముంబై బ్యాటింగ్ తేలిపోయింది. అభిమానుల మద్దతు మధ్య అంచనాలకు అనుగుణంగా రాణించాల్సింది పోయి మరోమారు విఫలమైంది. స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన ముంబైకి అంతగా కలిసిరాలేదు. పిచ్ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటూ హైదరాబాద్ బౌలర్లు ఆది నుంచే పక్కా ప్రణాళికతో బౌలింగ్‌కు దిగారు. ముఖ్యంగా భువనేశ్వర్ బదులుగా జట్టులోకొచ్చిన సందీప్‌శర్మ(1/9) రైజర్స్‌కు అదిరిపోయే ఆరం భాన్నిచ్చాడు. విధ్వంసక ఓపెనర్ లెవిస్(5)ను ఔట్ చేసి వికెట్ల పతనానికి నాంది పలికాడు. ఆ మరుసటి ఓవర్లోనే ఇషాన్‌కిషన్(2) నబీ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి లాంగ్‌ఆఫ్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ దీపక్ హుడాకు చిక్కాడు. ఇక భారీ ఆశల మధ్య క్రీజులోకి అడుగుపెట్టిన కెప్టెన్ రోహిత్‌శర్మ(2) మరోమారు నిరాశజనక ప్రదర్శన కనబరిచాడు. తన బ్యాటింగ్ లోపాలను ఎత్తిచూపుతూ షకీబల్ బౌలింగ్‌లో ధవన్ క్యాచ్ ద్వారా మూడో వికెట్‌గా నిష్క్రమించాడు. పవర్‌ప్లే ముగిసే సరికి ముంబై 3 వికెట్లు కోల్పోయింది. ఓవైపు వికెట్లు పడుతున్నా..తొణకని ఆత్మవిశ్వాసంతో సూర్యకుమార్(38 బంతుల్లో 34, 4ఫోర్లు) నబీ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్లో వరుస బౌండరీలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.

సూర్యకుమార్‌కు కృనాల్ పాండ్యా(24) జత కలువడంతో ముబై ఇన్నింగ్స్ గాడిలో పడింది. వీరిద్దరు హైదరాబాద్ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ స్కోరుబోర్డును పరిగెత్తించారు. అయితే సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌ను రషీద్‌ఖాన్(2/11) దెబ్బకొట్టాడు. కృనాల్‌ను రషీద్ వికెట్ల ముందు దొరుకబుచ్చుకున్నాడు. డీఆర్‌ఎస్‌కు వెళ్లినా కృనాల్‌కు నిరాశే ఎదురైంది. దీంతో నాలుగో వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక ఫామ్‌లేమితో నానా తంటాలు పడుతున్న పొల్లార్డ్(9) ముంబై ఆశలను ఆవిరి చేశాడు. స్లిప్‌లో ధవన్‌కు సునాయాస క్యాచ్ ఇచ్చి పొల్లార్డ్ వెనుదిరిగాడు. ఈ క్రమంలో ఎవరూ క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించలేదు. ఫలితంగా 10 పరుగుల తేడాతో ముంబై ఐదు వికెట్లు సూర్యకుమార్, మెక్‌క్లీగన్(0), మార్కండే(1), హార్దిక్(3), ముస్తాఫిజుర్(1) వికెట్లు కోల్పోయారు. సిద్దార్థ్ కౌల్(3/23)మూడు వికెట్లతో విజృంభించగా, బాసిల్ థంపీ(2/4), నబీ(1/23), షకీబల్‌హసన్(1/16) ముంబై పతనంలో కీలకమయ్యారు.

సన్‌డౌన్: టాస్ గెలిచిన ముంబై..హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ముంబై బౌలర్లు మెక్‌క్లీగన్(2/22), హార్దిక్(2/20), మయాంక్ మార్కండే(2/15) ధాటికి హైదరాబాద్ 18.4 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ విలియమ్సన్(29), యూసుఫ్ పఠాన్(29) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. కెప్టెన్ విలియమ్సన్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ బుమ్రా వేసిన తొలి ఓవర్లో రెండు ఫోర్లతో ఆకట్టుకున్నాడు. అయితే మరుసటి ఓవర్లోనే మెక్‌క్లీగన్..హైదరాబాద్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఒకే ఓవర్లో ధవన్(5)తో పాటు సాహా(0)ను ఔట్ చేసి రైజర్స్ శిబిరాన్ని ఒత్తిడిలోకి నెట్టాడు. గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన ధవన్ క్లీన్‌బౌల్ట్ కాగా, వికెట్లకు దూరంగా వెళుతున్న బంతిని వెటాడిన సాహా కీపర్ కిషన్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన మనీశ్‌పాండే బౌండరీలతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో కవర్స్‌లో షాట్ ఆడిన మనీశ్..రోహిత్‌కు దొరికిపోయాడు. ఆ మరుసటి ఓవర్లోనే షకీబల్ హసన్(2) రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇలా పవర్‌ప్లే ముగిసే సరికి హైదరాబాద్ 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన యూసుఫ్ పఠాన్..విలియమ్సన్‌కు జతకలిశాడు. ఇద్దరు కలిసి కుదురుకునే ప్రయత్నం చేశారు.

కానీ హైదరాబాద్ ఆశలు ఎక్కువసేపు నిలువలేదు. హార్దిక్ బౌలింగ్‌లో విలియమ్సన్ నిష్క్రమించడంతో రైజర్స్‌కు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. అప్పటికే క్రీజులో ఉన్న యూసుఫ్ అండగా వచ్చి రావడంతోనే మహ్మద్ నబీ బౌండరీలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మరోవైపు యూసుఫ్ కూడా బ్యాటు ఝులిపించడంతో స్కోరుబోర్డుకు కీలక పరుగులు జతకలిశాయి. అయితే మయాంక్ మార్కండే బంతిని సరిగ్గా అంచనా వేయని నబీ..క్లీన్‌బౌల్డ్ కావడంతో ఆరో వికెట్‌కు 22 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఇక్కణ్నుంచి రైజర్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఆఖరి వరుస బ్యాట్స్‌మెన్ రషీద్‌ఖాన్(6), బాసిల్ థంపీ(3), సిద్దార్థ్ కౌల్(2) వెంటవెంటనే వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో యూసుఫ్ సహకరించే వారు కరువయ్యారు. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోని పఠాన్ ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఆఖరి వికెట్‌గా వెనుదిరగడంతో రైజర్స్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మ్యాచ్ మొత్తమ్మీద రైజర్స్ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమైంది.

స్కోరుబోర్డు

హైదరాబాద్: ధవన్(బి)మెక్‌క్లీగన్ 5, విలియమ్సన్(సి)కిషన్(బి)హార్దిక్ 29, సాహా(సి)కిషన్(బి)మెక్‌క్లీగన్ 0, నీశ్‌పాండే(సి)రోహిత్‌శర్మ(బి)హార్దిక్‌క 16, షకీబల్‌హసన్(రనౌట్) 2, యూసుఫ్(సి)హార్దిక్(బి)ముస్తాఫిజుర్ 29, నబీ(బి)మార్కండే 14, రషీద్‌ఖాన్(సి)కిషన్(బి)బుమ్రా 6, థంపీ (బి)మార్కండే 3, కౌల్(రనౌట్) 2, సందీప్‌శర్మ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 18.4 ఓవర్లలో 118 ఆలౌట్; వికెట్ల పతనం: 1-20, 2-20, 3-44, 4- 46, 5-63, 6-85, 7-100, 8-106, 9-109, 10-118; బౌలింగ్: బుమ్రా 4-0-25-1, మెక్‌క్లీగన్ 3-0-22-2, హార్దిక్ 3-0-20-2, ముస్తాఫిజుర్ 3.4-0-18-1, మార్కండే 3-0-15-2, కృనాల్ 2-0-14-0.

ముంబై: సూర్యకుమార్ 32 నాటౌట్, లెవిస్(సి)మనీశ్(బి)సందీప్‌శర్మ 5, ఇషాన్‌కిషన్(సబ్/దీపక్)(బి)నబీ 0, రోహిత్‌శర్మ(సి)ధవన్(బి)షకీబల్ 2, కృనాల్(ఎల్బీ)రషీద్‌ఖాన్ 24, పొల్లార్డ్(సి)ధవన్(బి)రషీద్ 9, హార్దిక్(సి)థంపీ(బి)కౌల్ 3, మెక్‌క్లీగన్(ఎల్బీ)కౌల్ 0, మార్కండే(ఎల్బీ)కౌల్ 1, బుమ్రా 6 నాటౌట్, ముస్తాఫిజుర్(సబ్/దీపక్)(బి)థంపీ 1; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 18.5 ఓవర్లలో 87 ఆలౌట్; వికెట్ల పతనం: 1-12, 2-17, 3-21, 4-61, 5-73, 6-77, 7-78, 8-80, 9-81, 10-87; బౌలింగ్: సందీప్‌శర్మ 3-0-9-1, నబీ 3-0-23-1, షకీబల్ 3-0-16-1, సిద్దార్థ్‌కౌల్ 4-0-23-3, రషీద్‌ఖాన్ 4-1-11-2, థంపీ 1.5-0-4-2.
ipl-table

3190
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles