కింగ్స్‌కు ‘బౌలింగ్’ స్ట్రోక్

Fri,April 27, 2018 01:17 AM

Sunrisers Hyderabad beat Kings XI Punjab by 13 runs

-స్వల్ప లక్ష్యాన్ని కాపాడిన సన్‌రైజర్స్ బౌలర్లు
-13 పరుగుల తేడాతో పంజాబ్ ఓటమి
-మనీష్ పాండే ఒంటరిపోరాటం
పంజాబ్ లక్ష్యం 20 ఓవర్లలో 133 పరుగులు.. ఓ దశలో జట్టు స్కోరు 12 ఓవర్లలో 77/2... ఇక ఆ జట్టు గెలువాలంటే 48 బంతుల్లో 56 పరుగులు కావాలి.. ఇక కింగ్స్ విజయం నల్లేరు మీద నడకే అనుకుంటున్న తరుణంలో.. హైదరాబాద్ బౌలర్లు మ్యాజిక్ చేశారు. ఓవర్‌కో వికెట్ చొప్పున పడగొడుతూ కింగ్స్ ముందరి కాళ్లకు బంధం వేశారు. ముందుగా స్పిన్నర్లు, ఆ తర్వాత పేసర్లు, వీళ్లకు తోడు ఫీల్డర్లు సమయోచితంగా కదలడంతో పంజాబ్ 18 ఓవర్లలో 101 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. దీంతో విజయసమీకరణం 12 బంతుల్లో 23 పరుగులుగా మారింది. ఈ దశలో రషీద్ బౌండరీలతో ఆశలు రేకెత్తించినా.. ఆఖరి ఓవర్‌లో 15 పరుగులు చేయలేక పంజాబ్ చేతులెత్తేసింది. ఓవరాల్‌గా ప్రతీకార పోరులో అద్భుత ప్రదర్శనతో చెలరేగిన సన్ బౌలర్లు లో స్కోరింగ్ మ్యాచ్‌ను మహాద్భుతంగా కాపాడుకున్నారు.

హైదరాబాద్: భారీ హిట్టర్లు అందుబాటులో ఉన్నా.. సన్‌రైజర్స్ బౌలర్ల క్రమశిక్షణ ముందు మూగబోయారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాలను శాసించే ఆటగాళ్లున్నా.. కుర్ర స్పిన్నర్ల ధాటికి నిలువలేకపోయారు. ఆరంభంలో దూకుడు చూపెట్టి శుభారంభాన్నిచ్చినా.. కీలక సమయంలో పెవిలియన్ క్యూ కట్టిన పంజాబ్ చేజేతుల్లా మూల్యం చెల్లించుకుంది. దీంతో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 13 పరుగుల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 132 పరుగులు చేసింది. మనీష్ పాండే (51 బంతుల్లో 54; 3 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరిపోరాటం చేశాడు. తర్వాత పంజాబ్ 19.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (32) టాప్ స్కోరర్. గేల్ (23)తో సహా మిగతా వారు విఫలమయ్యారు. రాజ్‌పుత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

రాజ్‌పుత్ పాంచ్

పిచ్‌కు బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో పంజాబ్ పేసర్ రాజ్‌పుత్ (5/14) ఆరంభంలోనే హైదరాబాద్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. తన తొలి మూడు ఓవర్లలో ముగ్గురు కీలక బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేసి ఊహించని షాకిచ్చాడు. తొలి ఓవర్ నాలుగో బంతికి విలియమ్సన్ (0)ను, తర్వాతి ఓవర్ రెండో బంతికి ధవన్ (11)ను, ఆ మరుసటి ఓవర్ ఐదో బంతికి సాహా (6)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో సన్‌రైజర్స్ 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో మనీష్ పాండే, షకీబ్ (28) ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. ఎదుర్కొన్న తొలి బంతికే మనీష్ క్యాచ్ ఔట్ నుంచి బయటపడ్డాడు శ్రణ్ బౌలింగ్‌లో రెండు బౌండరీలు బాదిన షకీబ్ ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాడు. పవర్‌ప్లే ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 37/3కి చేరింది. ఫీల్డింగ్‌ను విస్తరించిన తర్వాత ఈ ఇద్దరు సింగిల్స్, డబుల్స్‌కే పరిమితమయ్యారు. దీంతో రన్‌రేట్ (5.70) మందగించడంతో తొలి 10 ఓవర్లలో రైజర్స్ 57/3 స్కోరు మాత్రమే చేసింది.

మధ్యలో ముజీబ్ (1/17), టై కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ పరుగులూ నిరోధించారు. ఇక నాలుగో వికెట్‌కు 52 పరుగులు జోడించాకా.. ముజీబ్ బంతిని స్టాండ్స్‌లోకి పంపే ప్రయత్నంలో షకీబ్ డీప్ మిడ్‌వికెట్‌లో క్యాచ్ ఇచ్చాడు. యూసుఫ్ పఠాన్ (21 నాటౌట్)తో కలిసిన పాండే.. అశ్విన్‌ను లక్ష్యంగా ఓ సిక్స్, ఫోర్ కొట్టి జోరు చూపాడు. ఈ క్రమంలో 48 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. కానీ 16వ ఓవర్‌లో మనీష్ ఇచ్చిన క్యాచ్ ముచ్చటగా మూడోసారి నేలపాలైంది. అప్పటివరకు సింగిల్స్‌కే పరిమితమైన యూసుఫ్ 18వ ఓవర్‌లో కొట్టిన ఓ భారీ షాట్‌ను తివారీ బౌండరీ లైన్ వద్ద జారవిడచడంతో సిక్స్‌గా నమోదైంది. 19వ ఓవర్‌లో 9 పరుగులే రావడం, ఆఖరి ఓవర్ వేసిన రాజ్‌పుత్ చివరి మూడు బంతుల్లో మనీష్, మహ్మద్ నబీ (4)ని ఔట్ చేయడంతో హైదరాబాద్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.

పెవిలియన్‌కు క్యూ..

లక్ష్యం చిన్నదికావడంతో పంజాబ్ ఓపెనర్లు లోకేశ్ రాహుల్, క్రిస్ గేల్ పెద్దగా ఇబ్బందిపడలేదు. ముజీబ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ ఇద్దరు భారీ షాట్లు బాదారు. రెండో ఓవర్‌లోనే గేల్ సిక్సర్ కొడితే నాలుగో ఓవర్‌లో ఓ సిక్స్, రెండు ఫోర్లతో రాహుల్ చెలరేగిపోయాడు. తర్వాత ఇద్దరు కలిసి మరో మూడు బౌండరీలు బాదడంతో పవర్‌ప్లేలో పంజాబ్ స్కోరు 44 పరుగులకు చేరింది. ఈ దశలో బౌలింగ్ వచ్చిన బాసిల్ థంపి (2/14), రషీద్ ఖాన్ (3/19) ప్రత్యర్థులకు ఝలక్ ఇచ్చారు. 8వ ఓవర్‌లో రషీద్.. రాహుల్‌ను క్లీన్‌బౌల్డ్ చేస్తే, తర్వాతి ఓవర్‌లో కాటన్ బౌల్డ్‌తో గేల్‌ను థంపి వెనక్కి పంపాడు. దీంతో 2 పరుగుల తేడాతో రెండు కీలక వికెట్లు పడ్డాయి. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 51 పరుగులు జోడించారు. తర్వాత మయాంక్ అగర్వాల్ (12), కరుణ్ నాయర్ (13) మెల్లగా ఆడటంతో 12 ఓవర్లలో పంజాబ్ 77/2కు చేరింది. ఇక్కడి నుంచి మ్యాచ్ ఊహించని మలుపు తిరిగింది. ఓవరాల్‌గా 41 పరుగులకు 7 వికెట్లు చేజార్చుకోవడంతో పంజాబ్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.

స్కోరు బోర్డు

సన్‌రైజర్స్ హైదరాబాద్: ధవన్ (సి) నాయర్ (బి) రాజ్‌పుత్ 11, విలియమ్సన్ (సి) అశ్విన్ (బి) రాజ్‌పుత్ 0, సాహా (సి) టై (బి) రాజ్‌పుత్ 6, మనీష్ పాండే (బి) రాజ్‌పుత్ , షకీబ్ (సి) అగర్వాల్ (బి) ముజీబ్ 28, యూసుఫ్ పఠాన్ నాటౌట్ 21, మహ్మద్ నబీ (సి) అగర్వాల్ (బి) రాజ్‌పుత్ 4, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 20 ఓవర్లలో 132/6. వికెట్లపతనం: 1-1, 2-16, 3-27, 4-79, 5-128, 6-132. బౌలింగ్: రాజ్‌పుత్ 4-0-14-5, శ్రణ్ 3-0-27-0, అశ్విన్ 4-0-34-0, తివారీ 1-0-10-0, ముజీబ్ 4-0-17-1, టై 4-0-28-0.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్: రాహుల్ (బి) రషీద్ 32, గేల్ (సి) అండ్ (బి) బాసిల్ థంపి 23, మయాంక్ అగర్వాల్ (సి) పాండే (బి) షకీబ్ 12, కరుణ్ నాయర్ ఎల్బీ (బి) రషీద్ 13, ఫించ్ (సి) పాండే (బి) షకీబ్ 8, తివారీ (సి) విలియమ్సన్ (బి) సందీప్ 1, అశ్విన్ (సి) విలియమ్సన్ (బి) రషీద్ 4, టై ఎల్బీ (బి) సందీప్ 4, శ్రణ్ రనౌట్ 2, రాజ్‌పుత్ (బి) బాసిల్ థంపి, ముజీబ్ నాటౌట్ 10, ఎక్స్‌ట్రాలు: 2, మొత్తం: 19.2 ఓవర్లలో 119 ఆలౌట్. వికెట్లపతనం: 1-55, 2-57, 3-77, 4-82, 5-88, 6-92, 7-96, 8-99, 9-101, 10-119. బౌలింగ్: సందీప్ 4-0-17-2, నబీ 2-0-24-0, కౌల్ 4-0-25-0, బాసిల్ థంపి 2.2-0-14-2, రషీద్ 4-0-19-3, షకీబ్ 3-0-18-2.
ipl-table

3263
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles